ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth : కారు బోరు.. కాంగ్రెస్‌దే జోరు

ABN, First Publish Date - 2023-12-04T04:00:06+05:30

తన పథకాలే ఓట్లను కురిపిస్తాయని భావించారు! తాను ఎవరిని నిలబెడితే వారిని గెలిపిస్తారని అనుకున్నారు! అందుకే, ఆరేడుగురికి మినహా సిటింగులందరికీ టికెట్లు ఇచ్చారు

ఇక రేవంతు నేటి ఉదయం సీఎల్పీ భేటీ..

6న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం!

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను తిరస్కరించిన ప్రజలు

అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో కాంగ్రెస్‌ ఘన విజయం

తెలంగాణ ఇచ్చిన ఆ పార్టీకి పదేళ్ల తర్వాత అధికారం

కామారెడ్డిలో ఓడిన కేసీఆర్‌.. ఆరుగురు మంత్రులూ ఔట్‌

బీఆర్‌ఎస్‌కు ఊపిరిపోసిన గ్రేటర్‌ హైదరాబాద్‌, మెదక్‌

8 సీట్లకు ఎగబాకిన బీజేపీ.. 19 చోట్ల రెండో స్థానం

ఆ పార్టీ అగ్ర నేతలు సంజయ్‌, ఈటల, అర్వింద్‌,

రఘునందన్‌ ఓడినా కొత్త ప్రాంతాల్లో కమల వికాసం

అసెంబ్లీలో మళ్లీ సీపీఐ.. కూనంనేని గెలుపు

కొత్త శాసనసభలో తొలిసారి ఎమ్మెల్యేలు 47 మంది

కోడ్‌ ఉండగానే డీజీపీ అత్యుత్సాహం.. రేవంత్‌కు బొకే

ఈసీ ఆగ్రహం.. తొలగింపు.. కొత్త డీజీపీ రవిగుప్తా

తన పథకాలే ఓట్లను కురిపిస్తాయని భావించారు! తాను ఎవరిని నిలబెడితే వారిని గెలిపిస్తారని అనుకున్నారు! అందుకే, ఆరేడుగురికి మినహా సిటింగులందరికీ టికెట్లు ఇచ్చారు! తెలంగాణ అంటే నేను.. నేనంటే తెలంగాణ అన్నారు! కానీ, కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు!! మీరు అడిగిన దానిని.. మీకు కావాల్సిన దానిని నేను ఇవ్వను.. నేను ఇచ్చిన దానినే మీరు తీసుకోవాలనే వైఖరికి చెక్‌ పెట్టారు! ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌కు పదేళ్ల అధికారం ఇక చాలనుకొని.. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆదరించారు! ఎలాంటి శషభిషలూ లేకుండా కాంగ్రెస్‌కు పూర్తిస్థాయిలో అధికారాన్ని కట్టబెట్టారు! ఆ పార్టీని మేజిక్‌ మార్కు దాటించారు.

తెలంగాణ ఎన్నికల్లో 64 స్థానాలతో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించగా.. బీఆర్‌ఎస్‌ 39 సీట్లు గెలిచింది. కెరటంలా ఎగసి పడిన బీజేపీ ఈసారీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది! కానీ.. గతంలో ఒకే సీటు నుంచి ఇప్పుడు 8కి ఎగబాకింది! ఫలితాల తర్వాత సీఎం అభ్యర్థిని నిర్ణయించడంలో తీవ్ర జాప్యం చేసే కాంగ్రెస్‌ ఈసారి ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించింది! కాబోయే సీఎం రేవంతేనని సంకేతాలిచ్చింది. సోమ వారమే సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆరో తేదీనే రేవంత్‌ ప్రమాణ స్వీకారమూ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలతో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. బీఆర్‌ఎస్‌ కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన బీజేపీ ఎనిమిది సీట్లనే గెలిచింది. ఈ ఎన్నికల్లో సంచలనాలు, అనేక విశేషాలూ నమోదయ్యాయి. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను.. అటు కాబోయే సీఎం రేవంత్‌ రెడ్డిని ఏకకాలంలో కామారెడ్డిలో ఓడించిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి డబుల్‌ జెయింట్‌ కిల్లర్‌గా నిలిచారు. ఇక, కాంగ్రె్‌సతో జతకట్టిన సీపీఐకి ఫలితం దక్కింది! ఆ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి విజయం సాధించారు. ఇక, రెండేసి స్థానాల్లో పోటీ చేసిన సీఎం కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌ల్లో ఈటల రెండుచోట్లా ఓడిపోగా.. కేసీఆర్‌, రేవంత్‌లకు ఒక్కోచోట ఎదురు దెబ్బ తగిలింది. అలాగే, ఆరుగురు మంత్రులు కూడా విజయం ముంగిట బొక్కబోర్లా పడ్డారు. ఇక, ఈసారి అసెంబ్లీ నవతరంతో కళకళలాడనుంది.

గ్రామాల్లో కాంగ్రెస్‌.. రాజధానిలో బీఆర్‌ఎస్‌

గ్రామీణులు కాంగ్రె్‌సకు పట్టం కడితే.. సీమాంధ్రులు, రాజధానివాసులు బీఆర్‌ఎ్‌సకే మరోసారి జైకొట్టారు. అందుకే, మెదక్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా మిగిలిన రాష్ట్రమంతా కాంగ్రెస్‌ అత్యధిక సీట్లను సాధించింది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ కేవలం ఒక్కొక్క స్థానంలో గెలవడం గమనార్హం. అలాగే, ఆ పార్టీకి గట్టి పట్టున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కేవలం రెండేసి సీట్లను మాత్రమే గెలిచింది. బీఆర్‌ఎ్‌సను పూర్తిస్థాయిలో ఆదుకున్నది సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా మెదక్‌తోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ మాత్రమే! మెదక్‌ జిల్లాలో పదింట ఏడు స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలుచుకోగా.. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 24 సీట్లలో ఏకంగా 16 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ విజయ దుందుభి మోగించడం విశేషం. సీమాంధ్రులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పెద్దఎత్తున విజయం సాధించారు. మజ్లిస్‌ ఇక్కడ తన ఏడు సీట్లను నిలబెట్టుకోగా.. బీజేపీ సిటింగ్‌ స్థానాన్ని దక్కించుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. కరీంనగర్‌ జిల్లాలోని 13 స్థానాల్లో ఐదింట బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఇక, సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలోని 11 నియోజకవర్గాల్లో పదింట కాంగ్రెస్‌ కూటమే ఘన విజయం సాధించింది.

ఓటమి సంకేతాలు సుస్పష్టం!

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రె్‌సకు అనుకూల పవనాలు వీస్తున్నాయనే సంకేతాలు కొద్ది రోజుల ముందు నుంచే వీస్తున్నాయి. ధరణి సమస్యలు పరిష్కరించకపోవడం; డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వకపోవడం; దళిత బంధును కొందరికే పరిమితం చేయడం, టీఎ్‌సపీఎస్సీ వరుస లీకేజీలు వంటి కారణాలతో కేసీఆర్‌పై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందనే ప్రచారం జోరుగానే సాగింది. సరిగ్గా అదే సమయంలో, సీఎం కేసీఆర్‌కు వరుస ఎదురు దెబ్బలు తగలడం మొదలైంది. ప్రకృతి కూడా ఆయనకు ప్రతికూల సంకేతాలను పంపింది. గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయడంతో ప్రవళిక అనే అభ్యర్థిని షెడ్యూలుకు కొద్ది రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం బ్యారేజీలోనూ సమస్య రావడం బీఆర్‌ఎస్‌ అవకాశాలను భారీగా దెబ్బతీసింది. నిజానికి, నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో నీళ్లకు; టీఎ్‌సపీఎస్సీ లీకేజీలతో నియామకాల నినాదానికి కాలం చెల్లినట్లు ప్రజలు భావించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అప్పులు రూ.ఐదు లక్షల కోట్లకుపైగా చేరాయనే ప్రతిపక్షాల విమర్శలతో నిధుల నినాదమూ నిర్వీర్యమైందనే ప్రచారం జరిగింది. వెరసి, కేసీఆర్‌ ప్రభుత్వ పథకాల కంటే కూడా వైఫల్యాలకే విస్తృత ప్రచారం లభించింది. అలాగే, ఈటల, పొంగులేటి, తుమ్మల తదితర నాయకులను వదులుకోవడమూ బీఆర్‌ఎస్‌ పరాజయానికి కారణాల్లో ఒకటిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరుసగా మూడోసారి సిటింగులందరికీ టికెట్లు ఇవ్వడమే బీఆర్‌ఎస్‌ ఘోర పరాజయానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. సిటింగులను మార్చిన మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.

బీజేపీ.. స్వయంకృతాపరాథం!

గత అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ.. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ బాధ్యతలు చేపట్టడంతో అనూహ్యంగా పుంజుకున్న విషయం తెలిసిందే. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఘన విజయంతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ మంచి పనితీరు కనబరిచింది. దాంతో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని అంతా భావించారు. ఆ సమయంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం తెరపైకి వచ్చింది. ఆ స్కాంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చిన సీఎం కేసీఆర్‌ తనయ కవితను అరెస్టు చేయకపోవడంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు అయ్యాయనే ప్రచారం జోరుగా సాగింది. అదే సమయంలో, బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత జరిగిన ఈ రెండు పరిణామాలతో ఆ పార్టీ ఒక్కసారిగా డీలా పడిపోయింది. అదే సమయంలో, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ తదితరులు పెద్దఎత్తున పార్టీని వీడడంతో బీజేపీ బలహీనపడిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఈ ఎన్నికల్లో పార్టీ అగ్ర నేతలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, ఈటల రాజేందర్‌ ఓడిపోయినా.. ఎనిమిది స్థానాల్లో విజయ ఢంకా మోగించడమే కాదు.. మరో 19 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. గత ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం కూడా రెట్టింపు అయింది. సిటింగ్‌ స్థానాలైన దుబ్బాక, హుజూరాబాద్‌లను కోల్పోయినా.. కొత్తగా ఏడు నియోజకవర్గాల్లో విజయం సాధించడం ఆ పార్టీకి పెద్ద ఊరట. కానీ, బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా ఉంచి ఉంటే ఈసారి ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చి ఉండేవని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2023-12-04T04:00:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising