Telangana Exit Poll 2023 : తెలంగాణలో కాంగ్రెస్ సునామీ..
ABN, First Publish Date - 2023-12-01T03:38:58+05:30
‘తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వచ్చింది.. ఈ సునామీలో గడ్డపారలే కొట్టుకుపోతాయి.. కేసీఆర్‌లాంటి గడ్డిపోచలు ఎంత!?
మాదే అధికారమని అన్ని సర్వేలూ చెబుతున్నాయి
కార్యకర్తల శ్రమను ఎగ్జిట్‌పోల్స్ ప్రతిబింబిస్తున్నాయి
పార్టీ కార్యకర్తల్లారా.. సంబరాలు మొదలుపెట్టండి
అధికారంపై కేటీఆర్ చెప్పింది తప్పయితే సారీ చెప్తారా?
ప్రజాస్వామిక పాలన, 6 గ్యారెంటీలకు చట్టబద్ధతే లక్ష్యం
ఇక సభల్లో విపక్షానికీ చాన్స్.. కేసీఆర్‌లాగా ఉండబోం
కొడంగల్, కామారెడ్డి.. 2 చోట్లా నేను గెలవబోతున్నా
మీడియాకు స్వేచ్ఛ.. విలేకర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
కామారెడ్డిలో విలేకరులతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
కామారెడ్డి, కోస్గి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వచ్చింది.. ఈ సునామీలో గడ్డపారలే కొట్టుకుపోతాయి.. కేసీఆర్‌లాంటి గడ్డిపోచలు ఎంత!?’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని, డిసెంబరు 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. దొరల తెలంగాణ అంతమై ప్రజల తెలంగాణ వస్తోందని.. బీఆర్‌ఎ్‌సకు 25 సీట్లకు మించి రావని.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల వరకూ పోలింగ్ పూర్తయి ఎగ్జిట్ పోల్స్ విడుదలవ్వగానే కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టేవారని.. ఇప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా లేకపోవడంతోనే ఆయన మీడియా ముందుకు రాలేదన్నారు. ‘‘ఇవాళ ఆ చంద్రుడికి మబ్బులు పట్టినయి. ఆయన కనిపించకుండా పోయాడు’’ అని ఎద్దేవా చేశారు. ఎగ్జిట్‌పోల్స్ రబిష్ అని కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ ప్రజలముందుకు వచ్చి క్షమాపణలు చెబుతారా!? అని ప్రశ్నించారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో, అంతకుముందు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్‌పై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిబింబిస్తుందన్నారు. కేసీఆర్‌ది అరాచక పాలన అని, ప్రజలను జంతువులకన్నా హీనంగా చూశారని, అందుకే బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణకు మొదటి, చివరి శత్రువూ కేసీఆర్ కుటుంబంలోని నలుగురేనని.. మిగితా వారంతా తమకు మిత్రులేనని చెప్పారు. ఇన్నాళ్లు కేసీఆర్ కుటుంబంతో ఊడిగం చేసిన వారంతా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు క్షమాపణలు చెప్పి సేవకులుగా ఉండాలని కోరారు. గతంలో కేసీఆర్... గెలిస్తే రాజు, ఓడితే బానిస తరహాలో శాసనసభను నడిపించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా కేసీఆర్ వ్యవహరించారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు.
సెంటిమెంట్ రగల్చడం కేసీఆర్‌కు అలవాటే
ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి చేకురేలా కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నాగార్జున సాగర్ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై స్పందించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్‌కు అలవాటేనని విమర్శించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాగర్ డ్యాం అక్కడే ఉంటుందని నీళ్లు ఎక్కడికీ పోవన్నారు. సామరస్య పూర్వకంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఎన్నికలపై ఇలాంటి కుట్రలు పనిచేయవ న్నారు. దేశాలే నీటి సమస్యలను పరిష్కరించుకుంటున్నప్పుడు రాష్ట్రాల మద్య వివాదాలను పరిష్కరించుకోలేమా!? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు సమయ స్ఫూర్తి ఉన్నవాళ్లని, సమస్యలు అర్థం చేసుకోగలిగే వారన్నారు. పోలింగ్‌కు ముందురోజు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించారని విమర్శించారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీటి వాటాలు, ఆస్తులపంపకాల విషయంలో కాంగ్రెస్ సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరిస్తుందన్నారు.
శ్రీకాంతాచారి అమరుడైన రోజే ఎన్నికల ఫలితాలు
తెలంగాణ ఉద్యమంలో 2009 నవంబరు 29 ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని, డిసెంబరు 3నే శ్రీకాంతాచారి తుది శ్వాస విడిచారన్నారు. అదే రోజున ఎన్నికల ఫలితాలు వెలువడడం గమనార్హమని రేవంత్ అన్నారు. ప్రాణత్యాగం చేయడం ద్వారా శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లాడని శ్రీకాంతాచారికి ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు. అప్పట్లో డిసెంబరు 9న తెలంగాణకు మొదటి పునాదిరాయి పడిందని, ఇప్పుడు అవే తేదీన యాదృచ్ఛికంగా దొరల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగబోతుందన్నారు.
కేసీఆర్ పాలనలో మీడియాకూ స్వేచ్ఛ లేదు
కేసీఆర్ పాలనలో విలేకరులకు, మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విలేకరులకు, మీడియాకు కూడా గురువారం సాయంత్రం నుంచే స్వేచ్ఛ లభించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని విలేకరులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అభిప్రాయాన్ని సమస్యలను ప్రతిబింబించే విధంగా మీడియాకు అవకాశం కల్పిస్తామన్నారు. మీడియా మిత్రులు కూడా తమ తమ విధానాలను సవరించుకోవాలని రేవంత్ కోరారు.
ప్రజాస్వామిక పాలన, 6 గ్యారెంటీలకు చట్టబద్ధతే లక్ష్యం
తెలంగాణ ప్రజలకు ఐదేళ్లపాటు సేవ చేయడానికి కాంగ్రె్‌సకు అధికారం ఇస్తున్నారని రేవంత్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే తమ ముందున్న లక్ష్యాలు ఆరు గ్యారెంటీ స్కీంలకు చట్టబద్ధత కల్పించడం, ప్రజాస్వామిక పాలన అందించడమని చెప్పారు. కాంగ్రెస్ ఎవరిపైనా ఆధిపత్యం చెలాయించదన్నారు. ఎవర్నో నిర్బంధించడానికో, ఇబ్బందులకు గురి చేయడానికో కాంగ్రెస్ అధికారంలోకి రావడం లేదన్నారు. కేసీఆర్ మాదిరిగా కాంగ్రెస్ నేతలు నిరంకుశంగా వ్యవహరించబోరన్నారు. తాము ప్రజాసేవకులుగా ఉంటామన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాస్వామిక విలువలని పునరుద్ధరిస్తామన్నారు. అధికార ప్రతిపక్షాలవి బాధ్యతయుతమైన పాత్ర అని అన్నా రు. గెలిచిన వాడు రాజు కాదు.. ఓడిన వారు బానిసలూ కాదన్నారు. ముఖ్యమైన అంశాలపై పరిపాలన నిర్ణయాలపైన సంఘాలతో పాటు శాసనసభలో ప్రతిపక్ష సభ్యులూ మాట్లాడేవిధంగా పారదర్శక పాలన తీసుకువచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
పార్టీదే నిర్ణయం
ఇప్పటికే తాను ఎంపీగా కొనసాగుతున్నానని, ఈ ఎన్నికల్లోనూ కొడంగల్‌తో పాటు కామారెడ్డిలోనూ గెలువబోతున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మూడు పదవుల్లో ఏ పదవిలో ఉండాలో.. దేనికి రాజీనామా చేయాలో పార్టే నిర్ణయిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక బాఽధ్యతలు అప్పగిస్తామని, అమరుల కుటుంబాల సంక్షేమంపై ఆయనకు బాధ్యతలు అప్పగించాలని పార్టీ ఆలోచిస్తుందన్నారు. ఈ అంశాన్ని కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Updated Date - 2023-12-01T08:18:18+05:30 IST