Revanth Reddy : ఓటమి కేసీఆర్ ముఖంలోనే కనిపిస్తోంది!
ABN, First Publish Date - 2023-11-20T03:12:48+05:30
ఎన్నికల సభల్లో కేసీఆర్, కేటీఆర్‌ల ముఖకవళికలు, వారి బాడీ లాంగ్వేజ్ చూస్తేనే ఫలితాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని ...
తండ్రీ, కొడుకుల బాడీ లాంగ్వేజ్ చూస్తేనే ఫలితాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది
80-85 సీట్లతో కాంగ్రెస్ ఘన విజయం ఖాయం.. హంగ్ అనేది బీజేపీ, బీఆర్‌ఎస్‌ల దుష్ప్రచారం
మాదిగ సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా
కాంగ్రెస్‌కు పడొద్దనే వర్గీకరణపై బీజేపీ డ్రామాలు
రూ.2 లక్షల రుణమాఫీ కచ్చితంగా సాధ్యమే
పహాణీలను పునరుద్ధరించి డిజిటలైజ్ చేస్తాం
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సభల్లో కేసీఆర్, కేటీఆర్‌ల ముఖకవళికలు, వారి బాడీ లాంగ్వేజ్ చూస్తేనే ఫలితాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని, వారి మాటల్లో నిస్సహాయస్థితి, బేలతనం కనిపిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 80 నుంచి 85 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్‌ఎ్‌సలోకి వెళ్లిన 12 మందిని ఈసారి అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వబోమన్నారు. ‘జర్నలిస్టుల అధ్యయన వేదిక’ ఆధ్వర్యంలో ఆదివారం ఓ హోటల్‌లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి వివిధ అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘హంగ్ ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వం వస్తుందన్న చర్చను బీజేపీ, బీఆర్‌ఎస్ లేవదీస్తున్నాయి. కానీ రాష్ట్రంలో సంకీర్ణం అన్న పరిస్థితే రాబోదు. ఇవాళ ఏ సర్వేలు చూసినా కాంగ్రె్‌సకు 40 నుంచి 45 శాతం మధ్యలో ఓట్లు వస్తున్నాయని తేలుతోంది. హంగ్ అన్న చర్చకు తావే లేదు. 80 నుంచి 85 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. తెలంగాణ ప్రస్థానాన్ని నిజాం నిరంకుశ పాలన, సమైక్య పాలకుల ఆధిపత్యం, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన పాలనా విధ్వంసంగా మూడు దశల్లో చూడవచ్చు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అటు నిజాం నిరంకుశ పాలనను, ఇటు సమైక్య పాలనలోని ఆధిపత్య ధోరణినీ పుణికి పుచ్చుకుని కేసీఆర్ ముందుకు వెళ్లారు. దీంతో స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరంకుశ నిజాంకు, సమైక్య పాలకులకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ కలిసి, వారి ఆకాంక్షలు నెరవేరేలా కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించాం.
ఈ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అంటూ ప్రశ్నిస్తున్న కేసీఆర్‌కు ఫెడరల్ స్ఫూర్తి గురించి తెలియదు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల అవసరాలు, ఆదాయాన్ని బట్టి ప్రణాళికలు రూపొందించుకుంటాయి. అలా పోల్చుకుంటే, ఛత్తీ్‌సగఢ్ ప్రభుత్వం ధాన్యంపై బోనస్ ఇస్తోంది మరి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు? రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించాలన్న కసితో బీసీలు ఉన్నారు. వారి ఓట్లను చీల్చి కేసీఆర్‌కు సహకరించే వ్యూహంలో భాగంగానే బీసీని సీఎం చేస్తామంటూ బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలో ఆ పార్టీకి 110 సీట్లలో డిపాజిట్లు కూడా రావు. అటువంటి పార్టీ బీసీని సీఎం చేస్తామని ప్రకటించడం బీసీలను అవమానించడమే. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే కేవలం ఒక్క రాష్ట్రంలోనే బీసీ సీఎం ఉన్నారు.
ధరణి వల్ల భూస్వాములు మళ్లీ తయారయ్యారు
ధరణి వల్ల కాస్రా పహాణీల్లోని పేదలందరి పేర్లూ పోయి.. పాతకాలంలో నక్సలైట్ల ప్రభావంతో ఊరు వదిలి వెళ్లిపోయిన దొరలు కొత్తగా భూస్వాములుగా తయారయ్యారు. అందుకే ధరణి స్థానంలో భూమాత సాఫ్ట్‌వేర్‌ను తీసుకొస్తాం. ధరణి పేరుతో భూ దోపిడీ జరిగింది. అందుకే ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు దుఃఖం వస్తోంది. ధరణి లేకపోతే రైతుబంధు, రైతుబీమా, రుణాల రద్దు వంటివి ఉండవని అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు. ధరణి రాకముందు రైతుబంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ జరగలేదా? ధరణి పేరుతో జరిగిన భూ దోపిడీపై సంపూర్ణ విచారణ జరిపించి బాధ్యులను జైలులో వేయిస్తాం. గతంలో ఉన్న కాస్రా పహాణీల దగ్గరి నుంచి జమాబందీల వరకు మాన్యువల్ రికార్డులన్నీ యథాతథంగా భూమాత పోర్టల్‌లో డిజిటలైజ్ చేస్తాం. గతంలో ఉన్న కాస్రా పహాణీల్లో భూ యజమానులతో పాటు కాస్తు కాలం(కబ్జాదారు కాలం) ఉండేది. కాస్రా పహాణీలతో పేదలకు ఎక్కువ హక్కులు ఉండేవి. వాటిని పునరుద్ధరిస్తాం.
వర్గీకరణపై ఆర్డినెన్స్ కోసం ఢిల్లీకి వెళదాం
మంద కృష్ణ మాదిగకు విజ్ఞప్తి చేస్తున్నా. అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలుద్దాం. ఎస్సీ వర్గీకరణ అమలుకు ఆర్డినెన్సు జారీ చేయమని కోరదాం. కేంద్రం తల్చుకుంటే 48 గంటల్లో ఆర్డినెన్సు ఇవ్వొచ్చు. వెంకయ్య నాయుడు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్‌లో మంద కృష్ణ ఏర్పాటు చేసిన సభకు వచ్చి వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించారు. కానీ, ఇంతవరకు జరిగిందేమీ లేదు. మాదిగ సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా కాంగ్రె్‌సకు పడకుండా ఈ ఎత్తుగడ వేస్తున్నారు తప్ప వారికి వర్గీకరణపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదంటూ కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు కేసీఆర్ ఇస్తున్న కరెంటును కొంటున్నది కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీ్‌సగఢ్ నుంచి కాదా?
రూ.2 లక్షల రుణమాఫీ సాధ్యమే
కేసీఆర్ అవినీతిని ఆపితే ఏ సంక్షేమ పథకాన్నయినా అద్భుతంగా అమలు చేయవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు అంచనాలను 200 శాతం పెంచారు. దీంట్లో 50 శాతం కేసీఆర్ కుటుంబం, కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లింది. ఈ భారీ అవినీతిని ఆపితే, ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాపీ అమలు సాధ్యమే. రుణమాఫీ మొత్తం రూ.30 వేల కోట్లు అవుతుందనుకుంటే.. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా 60 వాయిదాల్లో చెల్లించేలా బ్యాంకర్లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. నెలకు రూ.600 కోట్లు వాయిదాగా చెల్లించడం ప్రభుత్వానికి భారం కాబోదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమైనప్పుడు సీమాంధ్ర పాలకులు ఎలా మాట్లాడారో ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత అలాగే మాట్లాడుతున్నారు. అధికారం చేజారుతోందన్న భయంతో విచక్షణ కోల్పోతున్నారు.
టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. ప్రగతి భవన్‌ను అంబేద్కర్ ప్రజా భవన్‌గా మారుస్తాం. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడేలా కృషి చేస్తాం. కేసీఆర్ ఉద్యమకారుడు కాదు.. ఫక్తు రాజకీయ నాయకుడు. ఆయనకు, ఆయన కుటుంబానికి దక్కాల్సిన దానికంటే ఎక్కువగానే దక్కింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యమకారుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటాం. దీనికోసమే ఒక కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఎన్నికల తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో అధిష్ఠానం చర్చించి సీఎం ఎవరన్నది నిర్ణయిస్తుంది’ అని రేవంత్ చెప్పారు. నక్సలైట్ల అజెండాను కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అమలు చేసింది కాబట్టే ప్రస్తుతం ఆ సమస్య లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం ఇచ్చిందని, దాన్ని తాము గౌరవిస్తామని.. కేసీఆర్ పాలనలోలా తమ పాలనలో నిర్బంధాలు ఉండబోవన్నారు. తమ ఆరు గ్యారెంటీలు అసాధ్యమన్న కేసీఆర్.. వాటినే కొంత పెంచుతూ బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పెట్టి తమ గ్యారెంటీలకు రాజముద్ర వేశారని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ అనేది బంగారు గుడ్డు పెట్టే బాతు మాత్రమేనని, ఇంతకాలం గుడ్డు తిని.. ఇప్పుడు బాతును తినాలని చూస్తున్నారని విమర్శించారు. అందుకే వారిని బహిష్కరించేందుకు తెలంగాణ సమాజం సిద్ధమైందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-11-20T06:04:10+05:30 IST