Telangana Exit Poll Results 2023 : కాంగ్రెస్‌కు అనుకూలం!
ABN, First Publish Date - 2023-12-01T03:22:46+05:30
Telangana Exit Polls : తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పాలనకు ప్రజలు చరమ గీతం పాడబోతున్నారా!? తెలంగాణ ఇచ్చిన కాంగ్రె్‌సను ఈసారి ఆదరించనున్నారా!?
మెజారిటీ ప్రీ, ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థల అంచనా
హస్తానికి మ్యాజిక్ మార్కు ఇచ్చిన అత్యధిక సర్వేలు
ఒకట్రెండు సర్వే సంస్థలు మాత్రం హంగ్‌కు మొగ్గు
బీఆర్‌ఎస్‌కు మ్యాజిక్ మార్కు ఇచ్చిన 2 సంస్థలు
కారుకు అత్యల్పం 22.. హస్తానికి అత్యధికం 82
బీజేపీకి సింగిల్ డిజిట్‌నే ఇచ్చిన మెజారిటీ సర్వేలు
పోరు ముగిసింది..! అంచనాలకు తెర లేచింది!!.. పోలింగ్ పూర్తయింది..!
ఫలితాలపై ఉత్కంఠ మొదలైంది!!.. ఓటరు తన నిర్ణయం చెప్పేశాడు!
ఆ నిర్ణయం ఏమిటనే సస్పెన్స్ నెలకొంది!!
న్యూఢిల్లీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పాలనకు ప్రజలు చరమ గీతం పాడబోతున్నారా!? తెలంగాణ ఇచ్చిన కాంగ్రె్‌సను ఈసారి ఆదరించనున్నారా!? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రానుందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి గురువారం సాయంత్రం వెలువడిన ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రానుందని అత్యధిక ఫలితాలు స్పష్టం చేయగా.. కాంగ్రెస్ అధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ హంగ్ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ఒకటి రెండు సర్వే సంస్థలు అంచనా వేశాయి. థర్డ్ విజన్, పొలిటికల్ గ్రాఫ్ సర్వే సంస్థలు మాత్రమే బీఆర్‌ఎస్ మ్యాజిక్ మార్కును దాటుతుందని తెలిపాయి. ఆ పార్టీకి అత్యల్పంగా 22 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. ఇక, సౌత్ ఫస్ట్, ఇండియా టీవీ, న్యూస్-24, టైమ్స్ నై, చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్, స్మార్ట్ పోల్ సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మేజిక్ మార్కును దాటే సీట్లు వస్తాయని వివరించాయి.
ఆ పార్టీకి అత్యధికంగా 82 రావచ్చని స్మార్ట్ పోల్ అంచనా వేస్తే.. అత్యల్పంగా 34 రావచ్చని థర్డ్ విజన్ అభిప్రాయపడింది. రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా కాంగ్రె్‌సకు 63 నుంచి 69 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఒకటి రెండు మినహా మెజారిటీ సర్వే సంస్థలు బీజేపీకి సింగిల్ డిజిట్‌నే కట్టబెట్టాయి. ఆ పార్టీకి అత్యధికంగా 13 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్, జన్ కీ బాత్ అంచనా వేస్తే.. అత్యల్పంగా ఒక సీటు వచ్చే అవకాశం ఉందని రేస్ సర్వే సంస్థ తెలిపింది. తెలంగాణలో హంగ్ పరిస్థితిని తోసిపుచ్చలేమని ఏబీపీ న్యూస్, జన్ కీ బాత్, రిపబ్లిక్ టీవీ, టీవీ9 భారత్ వర్ష్, ఆరా (ప్రీ పోల్), ఆత్మసాక్షి, రేస్, సీఎన్‌ఎన్ సర్వే సంస్థలు అంచనా వేశాయి. గతంలో ఏడు స్థానాల్లో విజయం సాధించిన మజ్లిస్.. ఈసారి నాంపల్లి స్థానాన్ని కోల్పోయి మిగిలిన ఆరు సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపాయి. కాగా.. గత ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలూ బీఆర్‌ఎ్‌సకే ఆధిక్యం వస్తుందని అంచనా వేశాయి. ఆ పార్టీకి అత్యధికంగా 91 సీట్లు వస్తాయని ఇండియా టుడే స్పష్టం చేయగా.. అత్యల్పంగా 48 రావచ్చని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. అదే తరహాలోనే.. ఇప్పుడు మాత్రం దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలూ కాంగ్రె్‌సకే మెజారిటీని కట్టబెట్టడం విశేషం.
Updated Date - 2023-12-01T08:16:28+05:30 IST