ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi : మోదీ మాటే గ్యారెంటీ!

ABN, First Publish Date - 2023-11-26T01:37:48+05:30

ప్రత్యేక తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ మాట తప్పడంతో రాష్ట్రంలో వేల మంది యువకులు ఆత్మ బలిదానాలు చేశారని, ఇప్పుడేమో ఉద్యోగ నియామకాల్లో బీఆర్‌ఎస్‌ అక్రమాల కారణంగా

తెలంగాణ సమగ్రాభివృద్ధికి బీజేపీది పూచీ: ప్రధాని మోదీ

మా ప్రభుత్వం వస్తే సకాలంలో జీతాలు, పెన్షన్లు

బీఆర్‌ఎస్‌ అవినీతి పాలనపై ప్రజలంతా విసిగిపోయారు

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపేలా తీర్పు ఇవ్వండి

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటే.. విమర్శలన్నీ డ్రామాలే

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీకి వ్యతిరేకంగా ఒకటయ్యారు

టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారితే ఏంటి?

తెలంగాణపై కాంగ్రెస్‌ మాట తప్పడంతోనే బలిదానాలు

నియామకాల్లో అక్రమాల వల్లే యువత ఆత్మహత్యలు

కాళేశ్వరంలో నాణ్యత లేదు.. కేసీఆర్‌ ఫ్యామిలీకి ఏటీఎం

దళిత సీఎంపై దగా.. దళితబంధు అస్మదీయులకే

కామారెడ్డి, తుక్కుగూడ విజయ సంకల్ప సభల్లో

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై మండిపడిన నరేంద్ర మోదీ

వారిద్దరూ కామారెడ్డికి వచ్చింది ఇందుకే..

కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజల మూడ్‌ స్పష్టంగా తెలుస్తోంది. గజ్వేల్‌లో కేసీఆర్‌కు, కొడంగల్‌లో రేవంత్‌కు ఓటమి భయం పట్టుకుంది. తమ నియోజకవర్గాల్లోని ప్రజల మనోభావాలు వారికి తెలుసు. అందుకే ఇద్దరూ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలనూ కామారెడ్డి ప్రజలు చిత్తుగా ఓడించాలి.

- నరేంద్ర మోదీ

కామారెడ్డి, హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ మాట తప్పడంతో రాష్ట్రంలో వేల మంది యువకులు ఆత్మ బలిదానాలు చేశారని, ఇప్పుడేమో ఉద్యోగ నియామకాల్లో బీఆర్‌ఎస్‌ అక్రమాల కారణంగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఏళ్ల తరబడి రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని, ఉద్యోగాలు భర్తీచేయకుండా కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. యూపీఏగా ఉన్న కాంగ్రెస్‌ విపక్ష కూటమి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ‘ఇండియా’గా పేరు మార్చుకుందని, టీఆర్‌ఎస్‌ కూడా హఠాత్తుగా బీఆర్‌ఎ్‌సగా మారిందని.. పేర్లు మార్చుకున్నంత మాత్రాన ప్రజలు వారివైపు ఉండబోరని, ఈ కుట్రలన్నీ వారు గమనిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాను తెలంగాణకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చానని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పలు హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని, కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలతో ప్రజల ముందుకు వస్తోందని.. అయితే తెలంగాణ ప్రజలకు తానిచ్చే మాటలే గ్యారెంటీ అని, తెలంగాణ సమగ్రాభివృద్ధికి బీజేపీ గ్యారెంటీ అని పేర్కొన్నారు. ‘‘రైతులు, యువత, మహిళలు, ఆదివాసీలు, కార్మికులు, వెనుకబడిన వర్గాలు, ఎస్సీలకు నేను గ్యారెంటీ ఇస్తున్నా. మీ కలలను సాకారం చేసే బాధ్యత నాది. ఇది నా సంకల్పం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు, పెన్షన్లు ఇస్తా. నేను మాటిస్తున్నా రాసి పెట్టుకోండి.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మా ట్రాక్‌ రికార్డు’’ అని వ్యాఖ్యానించారు.

బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రి చేస్తానని తాను హామీ ఇచ్చానని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఆ పని చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. బీసీ నేతను ప్రధానమంత్రిని చేసింది.. కేంద్ర క్యాబినెట్‌లోకి ఎక్కువమంది బీసీలను మంత్రులుగా తీసుకుందీ బీజేపీనే అనేది గుర్తుంచుకోవాలని చెప్పారు. తాను ఇది వరకే ప్రకటించినట్లుగా తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నామని, గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పబోతున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ పాలననే కోరుకుంటున్నారన్నారు. కామారెడ్డిలో ప్రజల మూడ్‌ స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. కేసీఆర్‌, రేవంత్‌కు ప్రజల మనోభావాలు తెలుసునని, గజ్వేల్‌లో కేసీఆర్‌, కొండగల్‌లో రేవంత్‌ ఓటమి భయంతోనే కామారెడ్డిలో పోటిచేస్తున్నారని విమర్శించారు. ఈ ఇద్దరు నేతలనూ కామారెడ్డి ప్రజలు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో, హైదరాబాద్‌లోని తుక్కుగూడలో నిర్వహించిన సభల్లో మోదీ ప్రసంగించారు. అనంతరం ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌.. దళితుడిని సీఎం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటిదాకా అమలు చేయలేదని.. దళితబంధు స్కీం బీఆర్‌ఎస్‌ నేతలకు వరంగా మారిందని విమర్శించారు. బీఆర్‌ఎ్‌సది అవినీతి, అక్రమ పాలన అని.. ఈ పాలనపై ప్రజలు విసిగిపోయారని, విముక్తి పొందాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. 30న జరిగే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపేలా తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే.. బీఆర్‌ఎ్‌సకు కార్బన్‌ కాపీ అవుతుందని హెచ్చరించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నిజాం షాహీలకు, కాంగ్రెస్‌ సుల్తాన్‌ షాహీలకు చోటు లేదని స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలు పరస్పరం చేసుకుంటున్న విమర్శలన్నీ డ్రామాలేనని.. తమ జేబులు నిండకపోతే కేంద్రం నుంచి వచ్చే ప్రాజెక్టులను అడ్డుకుంటాయని ఆరోపించారు.

కేసీఆర్‌కు అసలైన దోస్తు ఎవరు?

కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలది 40-50 ఏళ్ల బంధం అని, కేసీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిందే కాంగ్రెస్‌ నుంచి అని మోదీ అన్నారు. 2004లో ఆయన, యూపీఏలో కేబినెట్‌ మంత్రిగా చేశారని, తెలంగాణ రాగానే ఆయన వెళ్లిందీ కాంగ్రెస్‌ నేతల వద్దకేనని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ కాంగ్రె్‌సకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందని, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై కాంగ్రె్‌సకు సపోర్ట్‌ చేసిందని.. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా అడ్డుకునేందుకు రెండు పార్టీలూ ఒక్కటయ్యానని, వీటన్నింటి బట్టి కేసీఆర్‌కు అసలైన దోస్తు ఎవరనేది స్పష్టమవుతుందని చెప్పారు. ‘‘గత ఎన్నికల్లో మహేశ్వరంలో బీఆర్‌ఎ్‌సను ఓడించి కాంగ్రెస్‌ అభ్యర్థిని మీరు గెలిపిస్తే ఆమె ఏం చేశారు? తాను గెలిచిన పార్టీని వదిలిపెట్టి బీఆర్‌ఎ్‌సలో చేరిపోయారు. అంటే.. కాంగ్రె్‌సకు వేసే ప్రతీ ఓటు బీ ఆర్‌ఎ్‌సను బలోపేతం చేస్తుందని, ఈ రెండు పార్టీలూ నాణేనికి బొమ్మ, బొరుసు అనేగా అర్థం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలు, కేసీఆర్‌ స్వార్థపరులని.. నిజాయితీ రాజకీయాలకు, అభివృద్ధికి వారు వ్యతిరేకం అని మోదీ మండిపడ్డారు. వారికి అభివృద్ధి విధానమే తెలియదని, ప్రత్యర్థులను దూషించడమే వారి పని అని ఆరోపించారు.

ఇరిగేషన్‌ స్కీంలను స్కాంలుగా మార్చారు

కాంగ్రెస్‌ కుట్ర రాజకీయాలను, అవినీతి పాలనను కేసీఆర్‌ ముందుకు తీసుకువెళుతున్నారని.. ఇరిగేషన్‌ స్కీంలను, ఇరిగేషన్‌ స్కాంలుగా మార్చారని మోదీ ధ్వ జమెత్తారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం నీటి ప్రాజె క్టు పథకాల పేరిట లక్షల కోట్లతో పనులు ప్రారంభించిందని, అయితే ఆ ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటీ నాణ్యతగా లేవని విమర్శించారు. ఈ నీటి ప్రాజెక్ట్‌లన్నీ కేసీఆర్‌కు ఆయన కుటుంబసభ్యులకు ఏటీఎంలుగా మారిపోయాయని ఆరోపించారు. బీఆర్‌ఎ్‌సకు, కేసీఆర్‌ కుటుంబానికి డబ్బులు అవసరమైతే కొత్త నీటి ప్రాజెక్టు పథకాలను ప్రారంభిస్తారని.. వాటి పేరుతో తెలంగాణ ప్రజల సొమ్ము కేసీఆర్‌ కుటుంబసభ్యుల జేబుల్లోకి వెళ్తోందని విమర్శించారు. హుజూరాబాద్‌, దుబ్బాక ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను ఓడించింది బీజేపీనే అని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు చావు తప్పి కన్నులొట్టబొయేలా చేసిందీ తమ పార్టేనని.. అందుకే బీజేపీ అంటే బీఆర్‌ఎ్‌సకు భయం అని మోదీ పేర్కొన్నారు.

ఆది నుంచీ బీజేపీకి తెలుగు ప్రజల అండ

ప్రజల ఆశీర్వాదంతో దేశవ్యాప్తంగా బీజేపీకి 300ల ఎంపీలు ఉన్నారని మోదీ అన్నారు. దేశంలో ఒకప్పుడు బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారని, వారిలో ఒకరు తెలంగాణకు చెందిన వారని మోదీ గుర్తుచేశారు. బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు తెలుగు ప్రజలు పార్టీకి అండగా నిలిచారని, తెలుగు ప్రజలమేలును తానెప్పుడూ మర్చిపోనని పేర్కొన్నారు. బీజేపీ మద్దతు తెలుగు ప్రజలకు ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు.

అభ్యర్థుల పేర్లు ప్రస్తావించకపోవడంతో నిరుత్సాహం

కామారెడ్డి సభలో మోదీ తన ప్రసంగంలో బీజేపీ అభ్యర్థుల్లో ఎవ్వరి పేరూ ప్రస్తావించలేదు. దీనిపై ఆ అభ్యర్థుల్లో కొంత నిరాశ నెలకొన్నట్లు తెలిసింది. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ, జహీరాబాద్‌, ఆందోల్‌, నారాయణఖేడ్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను మోదీ ప్రస్తావించి.. ఓట్లు వేయాలని కోరి ఉంటే ఉత్సాహం నిండి ఉండేందనే చర్చ జరిగింది.

ప్రధాని పర్యటనలో స్వల్ప మార్పు

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో స్వల్ప మార్పు జరిగింది. ప్రధాని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తూప్రాన్‌, 1.30 గంటలకు నిర్మల్‌లో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొంటారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం, మోదీ మధ్యాహ్నం 2 గంటలకు తూప్రాన్‌, ఆ తర్వాత 3.30 గంటలకు నిర్మల్‌ సభలో పాల్గొనాల్సి ఉంది.

ఎస్సీ వర్గీకరణపై రెండ్రోజుల క్రితమే అధికారులతో మాట్లాడా

సామాజిక న్యాయం, సామాజిక సాధికరత బీజేపీతోనే సాధ్యం అని మోదీ అన్నారు. రాష్ట్రంలో మాదిగల రిజర్వేషన్లకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఎస్సీ వర్గీకరణ సత్వరం పూర్తిచేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు మోదీ వెల్లడించారు. రెండ్రోజుల క్రితం ఢిల్లీలో తానే స్వయంగా మాదిగల రిజర్వేషన్లపై కేంద్ర అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసు త్వరగా పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు అనుగుణంగా, ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు వెంటనే పూర్తిచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

Updated Date - 2023-11-26T01:37:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising