Revanth Reddy : కేసీఆర్ నమూనా అంటే.. మేడిగడ్డ కుంగడమేనా?
ABN, First Publish Date - 2023-11-21T02:50:36+05:30
మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు కుంగిపోవడమే కేసీఆర్ అభివృద్ధి నమూనా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెబుతున్నట్లు రాష్ట్రం బంగారు తెలంగాణ ..
బంగారు తెలంగాణ రాలేదు..
కేసీఆర్ కుటుంబం బంగారు పళ్లెంలో తింటోంది
దేశంలోనే నంబర్ వన్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు
మిత్రుడినే మోసం చేసిన కేసీఆర్‌కు ప్రజలంటే ఓ లెక్కనా?
ఇందిరమ్మ రాజ్యం లేకుంటే.. కేసీఆర్ బిచ్చమెత్తుకునేవారు
ఆయన సింగిల్‌విండో డైరెక్టర్ అయ్యింది ఆ రాజ్యంలోనే
ఇందిర వల్లే ఎస్సీ, ఎస్టీలకు లక్షల ఎకరాల భూ పంపిణీ
నర్సాపూర్, పరకాల బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి
మెదక్, పరకాల రూరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు కుంగిపోవడమే కేసీఆర్ అభివృద్ధి నమూనా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెబుతున్నట్లు రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదని, కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు పళ్లెంలో తింటోందని ఆరోపించారు. తెలంగాణను బెల్ట్ షాపుల రాష్ట్రంగా చేసి, దేశంలోనే నంబర్ వన్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. చేసినవి చెప్పుకోవడానికి ఏమీలేకనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారన్నారు. సోమవారం నర్సాపూర్‌లో, పరకాల పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ సింగిల్‌విండో డైరెక్టర్ అయి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది ఇందిరమ్మ రాజ్యంలోనేనని.. ఇందిరమ్మ రాజ్యం లేకున్నా, సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకున్నా కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో, బిర్లా మందిర్ దగ్గరనో భిక్షం ఎత్తుకునే వారని చెప్పారు. అలాంటి ఇందిరమ్మ పాలనను చీకటిరాజ్యం అంటూ కేసీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి నాడు దొరలు, జమీందారుల వద్ద ఉన్న వేలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచిపెట్టింది ఇందిరమ్మ రాజ్యంలోనే అని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. దళితులకు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు, గిరిజనులకు 12 లక్షల ఎకరాల పోడు భూములను పంచింది ఇందిరమ్మ రాజ్యంలోనేనన్నారు. రాష్ట్రంలో లక్షలాదిమంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ళ స్థలాలకు పట్టాలు ఇచ్చింది కూడా ఆ రాజ్యంలోనేనన్నారు. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులను కట్టి 75 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించింది కూడా ఇందిరమ్మ రాజ్యంలోనేని, చివరకు కేసీఆర్ సింగిల్‌విండో డైరెక్టర్ అయింది కూడా అదే రాజ్యంలో అని చెప్పారు. పలువురు దళితులు ఎంపీలు అయి దేశ పరిపాలనలో భాగస్వాములు అయింది ఇందిరమ్మ పాలన వల్లనేనని, పేదవారు ఈ రోజు కడుపు నిండా తింటున్నది.. ఆత్మగౌరవంతో బతుకుతున్నది నాడు ఇందిరాగాంధీ అనుసరించిన సుపరిపాలనా విధానాల వల్లనేనని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ఆత్మబలిదానాలు చేసుకోవడం చూడలేక సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, కానీ కాంగ్రెస్ పాలనలో ఉన్న స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఇప్పుడు కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా గొంతెత్తున్నవారిని, హక్కుల కోసం పోరాడుతున్న వారిని కేసీఆర్ నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. దొరల గడీల ముందు బానిసల్లా బతకడమా.. లేక కాంగ్రెస్ పాలనలో కాలరెగరేసుకొని జీవించడమా అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని రేవంత్‌రెడ్డి కోరారు. కేసీఆర్ పాలనను బొంద పెడితేనే రాష్ట్రానికి విముక్తి లభిస్తుందని, అభివృద్ధిలో ముందడుగు పడుతుందని చెప్పారు. నర్సాపూర్ సిటింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని మిత్రుడంటూ 50 ఏళ్లు వెంట తిప్పుకొని ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారని, మిత్రుడినే మోసం చేసిన కేసీఆర్‌కు ప్రజలంటే ఓ లెక్కనా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన సునీతా లక్ష్మారెడ్డికి నర్సాపూర్ బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చిన మిత్రద్రోహి కేసీఆర్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆరు గ్యారెంటీలు.. ఒక శాసనం
తాను రైతుబంధు వద్దన్నానని కేసీఆర్ మందేసి మాట్లాడుతున్నారో, మతి లేక మాట్లాడుతున్నారో తెలియదని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఏటా రూ.15వేలు, కౌలు రైతులకు రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామని పునరుద్ఘాటించారు. వృద్ధులకు రూ.4వేల పెన్షన్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి కాంగ్రెస్ హామీలను గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించడం అంటే సువర్ణాక్షరాలతో లిఖించిన శాసనం లాంటిదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలులోకి వస్తే రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, దళితులందరికీ లబ్ధి సమకూరుతుందని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేస్తామని ప్రకటించారు.
Updated Date - 2023-11-21T02:53:23+05:30 IST