ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

land grazing : ఫలితాలకు ముందు.. భూ మేత

ABN, First Publish Date - 2023-12-11T03:04:56+05:30

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబరు 74లో 104 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది.

హైదరాబాద్‌లో రూ.400 కోట్ల విలువైన భూమి హాంఫట్‌

ఎన్నికల కోడ్‌ వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రారంభం..!

3 విడతల్లో 21 మందికి 12,879 గజాలు బదలాయింపు

ఈసీకి రేవంత్‌ ఫిర్యాదు చేసిన రోజునే 3,820 గజాలు

నవంబరు 4న 3,540 గజాలు, 25న 5,519 గజాలు..

జీవో 59 కింద క్రమబద్ధీకరణ.. చేతులు మారిన రూ.కోట్లు

ఊపిరి సలపని ఎన్నికల విధుల్లోనూ భూ మాయాజాలం

గతంలో కూల్చేసిన ఇళ్ల మొండి గోడలకు నంబర్లు సృష్టి

గోపనపల్లి జర్నలిస్టు కాలనీ ఆనుకుని 6 ఎకరాలు పరాధీనం

బీఆర్‌ఎస్‌ కీలక మంత్రి, ఎమ్మెల్యే కనుసన్నల్లో వ్యవహారం

ఏపీలోని ఓ కార్పొరేషన్‌ చైర్మన్‌, నిర్మాణ సంస్థ ప్రమేయం

ఓవైపు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చివరి రోజుల్లో భూములను బినామీలకు కట్టబెడుతున్నదంటూ ఎన్నికల సంఘానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేస్తుండగా, మరోవైపు.. అదేరోజు మూడు వేల గజాలకు పైగా భూమి అన్యాక్రాంతం అయ్యింది. అటు ఎన్నికల కోడ్‌ వెలువడిన మరుసటి రోజు నుంచి అధికారులంతా హడావుడిలో ఉండగా, ఇటు ఓ కార్యాలయంలో ఫైళ్లు చకచకా కదిలి మరో మూడు వేల గజాలు పరాధీనమయ్యాయి.. పోలింగ్‌ తేదీ దగ్గరపడుతోందని అందరూ ఉరుకులు పరుగులు పెడుతుండగా.. ఇంకో ఐదు వేల గజాలు హాంఫట్‌ అయ్యాయి. అక్రమమంటూ గతంలో కూల్చేసిన ఇళ్ల మొండి గోడలపై ఉన్న నంబర్ల ఆధారంగా క్రమబద్ధీకరణ సాగిపోయింది. కొంత భాగానికి డెవల్‌పమెంట్‌ ఒప్పందాలూ జరిగిపోయాయి. వెరసి హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతమైన గోపన్‌పల్లిలో రూ.400 కోట్ల భూమి అన్యాక్రాంతమైంది. దీనివెనుక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని కీలక మంత్రి, హైదరాబాద్‌ ఎమ్మెల్యే ఒకరు, ఏపీలోని కార్పొరేషన్‌ చైర్మన్‌, ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఉన్నట్లుగా తెలుస్తోంది. కోడ్‌ వెలువడిన మరుసటి రోజు నుంచి ఎన్నికల ఫలితాల ముందు రోజు వరకు సాగిన భారీ భూ మేతపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

(ఆంధ్రజ్యోతి నిఘా విభాగం) : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబరు 74లో 104 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 60 ఎకరాలను ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీకి కేటాయించారు. నాలుగేళ్ల క్రితం బ్రాహ్మణ సదన్‌కు 9 ఎకరాల దాకా కేటాయించడంతో భారీ భవన సముదాయం ఏర్పాటు చేశారు. వివిధ సంఘాలు, సంస్థలకు ఇచ్చింది పోగా 20 ఎకరాలకు పైగా మిగిలింది. దీనిపై కబ్జాదారులు కొన్నాళ్లుగా కన్నేశారు. ఐటీ కారిడార్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ విప్రో కూడలి నుంచి గోపనపల్లికి వెళ్లే ప్రధాన రోడ్డులోని గౌలిదొడ్డి గురుకుల పాఠశాల వెనుక రూ.400 కోట్ల విలువ చేసే ఆరు ఎకరాల స్థలం ఉంది. జర్నలిస్టు కాలనీ ప్రధాన రోడ్డు నుంచి 450 మీటర్ల దూరంలో ఎడమ వైపున, పంచతంత్ర పార్కును ఆనుకుని ఉన్న ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. 59 జీవో కింద క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. రాత్రికిరాత్రే నిర్మించిన ఇళ్లను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు జేసీబీలతో కూల్చేశారు. 6 ఎకరాల స్థలాన్ని ఆనుకుని ఉన్న గేటెడ్‌ కమ్యూనిటీలో ఒక్కో విల్లా రూ.5 కోట్ల విలువ చేస్తుంది. ఈ భూమిని ఏవిధంగానైనా దక్కించుకోవడానికి ఓ ఎమ్మెల్యే అనుయాయులు తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే పలుకుబడితో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని కీలక మంత్రి ఆదేశాలు వెళ్లడంతో.. శేరిలింగంపల్లి తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు అక్రమానికి తలూపారు.

కోడ్‌ ఉన్నా.. యథేచ్ఛగా బదలాయింపు

వంబరు 3 నుంచి ఈ నెల 5 వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. అధికార యంత్రాంగమంతా ఎన్నికల విధులకే పరిమితమైంది. కానీ, శేరిలింగంపల్లి తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు మాత్రం గోపన్‌పల్లి జర్నలిస్టు కాలనీ సమీపంలో ఉన్న ఆరు ఎకరాలలో 12,879 గజాల స్థలాన్ని 59 జీవో కింద మూడు విడతల్లో 21 మందికి రిజిస్ట్రేషన్‌ చేశారు. నవంబరు 4న 3,540 గజాలను తహసీల్దార్‌ కార్యాలయ అధికారి కన్వేయన్స్‌ డీడ్‌ కింద (ఆస్తి టైటిల్‌ను ఒకరి నుంచి మరొకరికి బహుమతిగా, మార్పిడిగా ఇచ్చే చట్టపరమైన పత్రం) ఏడుగురు వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇదే అధికారి నవంబరు 25న 5,519 గజాలను ఏడుగురికి, ఎన్నికల ఫలితాలకు ముందు.. ఈనెల 2న మరో ఏడుగురికి 3,820 గజాలను కన్వేయన్స్‌ డీడ్‌ కింద రిజిస్ట్రేషన్‌ చేశారు. కాగా, ఆరు ఎకరాల్లో ఈ 12,879 గజాల స్థలం పోగా 16,161 గజాల స్థలం ఉంది. ఇందులోనూ అధిక భాగం ఆక్రమణకు గురైంది.

రేవంత్‌ బృందం ఫిర్యాదు చేస్తుండగానే..

నవంబరు 30న పోలింగ్‌ జరగ్గా మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్‌ కాంగ్రె్‌సదే అధికారమని తేల్చాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో విలువైన భూములను బినామీలకు కట్టబెడుతున్నారని, ధరణిలో నిషేధిత జాబితాలో ఉన్నవాటిని తొలగిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ బృందం ఈ నెల 2న రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసింది. విలువైన భూములు పరాధీనం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. అదే రోజు శేరిలింగంపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో 3,820 గజాలు రిజిస్ట్రేషన్‌ జరిగిపోవడం గమనార్హం.

ఖాళీ స్థలంలో ఇళ్లు ఉన్నట్లుగా..

గోపనపల్లి సర్వే నంబరు 74లో ఇటీవల శేరిలింగంపల్లి తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు క్రమబద్ధీకరించినదంతా ఖాళీ స్థలమే. దాన్ని పరిశీలిస్తే ఏవిధంగా కొట్టేశారనేది స్పష్టంగా తెలుస్తున్నది. గతంలో అక్కడోటి ఇక్కడోటి చిన్న రేకులతో గదులు వేయగా.. అక్రమమంటూ ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారులే కూల్చేశారు. అయితే, మిగిలిపోయిన గోడలకు ఇంటి నంబర్లు రాసుకున్నారు. వాటి ఆధారంగా చేసుకుని అధికారులు క్రమబద్ధీకరించారు. గమనార్హం ఏమంటే 4 నెలల క్రితం వచ్చిన తహసీల్దార్‌.. అక్రమ నిర్మాణాలంటూ కూల్చేసినవాటినే ఇప్పుడు 59 జీవో కింద క్రమబద్ధీకరించారు. అక్రమంగా బదలాయింపు జరిగిన ప్రభుత్వ భూమిలోకి జేసీబీలు దిగాయి. ఖాళీ స్థలంలో ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. గుంతలను పూడ్చేస్తున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సాక్షిగా అగ్రిమెంట్‌ జరగడంతో జీహెచ్‌ఎంసీ అనుమతితో అపార్ట్‌మెంట్లను నిర్మించనున్నారు.

కన్వేయన్స్‌ డీడ్‌ చేసిన రోజే అమ్మకం..

గోపనపల్లిలో భూమిని అప్పనంగా కొట్టేసిన వైనం, రిజిస్ట్రేషన్‌ చేసిన సంబంధిత అధికారుల తీరు విస్మయానికి గురిచేస్తోంది. నవంబరు 25 న 5,519 గజాలను ఏడుగురికి రిజిస్ట్రేషన్‌ చేయగా, అందులో లబ్ధి పొందిన కొందరు వ్యక్తులు 2940 గజాలను అదే రోజు ప్రముఖ నిర్మాణ సంస్థకు చెందిన వ్యక్తికి డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ కింద జీపీఏ చేశారు. ఈ వ్యక్తి ఏపీలోని ఓ కార్పొరేషన్‌ సంస్థ ఛైర్మన్‌ అని తెలిసింది. ఎమ్మెల్యే అండదండలతోనే ఈ స్థలాన్ని కైవసం చేసుకున్నట్లు సమాచారం. స్థానికంగా కొందరు వ్యక్తులతో ప్రభుత్వ స్థలంలో ఇళ్ల నిర్మాణం, నంబర్లు సంపాధించడం, ఒక్కొక్కరు 980 గజాల వరకు కబ్జాలో ఉన్నట్లు 59 కింద దరఖాస్తు చేయడం, మార్కెట్‌ విలువలో 75 శాతం దాకా చెల్లింపుల ప్రక్రియ ప్రముఖ నిర్మాణ సంస్థ కనుసన్నల్లోనే జరిగినట్లు తెలిసింది. తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు కన్వేయన్స్‌ డీడ్‌ చేయగానే, డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ పూర్తవడమే దీనికి నిదర్శనం. ఎన్నికల ప్రక్రియ సాగుతుండగా ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో జరిగిన ఈ వ్యవహరంపై స్థానిక అధికారులెవరూ స్పందించడం లేదు.

Updated Date - 2023-12-11T03:04:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising