Bharat Bhavan : అంతా అడ్డగోలే!
ABN, First Publish Date - 2023-07-20T03:15:32+05:30
ప్రభుత్వం ఎవరికైనా భూమిని కేటాయించాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది! కేటాయింపు ప్రతిపాదనలను క్యాబినెట్ ముందు పెట్టాలి. సంబంధిత కలెక్టర్, సీసీఎల్‌ఏ నిర్ధారించిన మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని ఆ భూమికి ధరను నిర్ణయించి, ఆమోదించాలి. లబ్ధిదారులు
ఇష్టారీతిన ‘భారత్‌భవన్’కు భూకేటాయింపు
మంత్రివర్గ ఆమోదం లేదు.. జీవో జారీ చేయలేదు
భూమి ధర ఎంతో ఇంకా ఖరారు చేయనేలేదు
ఇవేవీ లేకుండానే భూమిపూజ చేసేసిన కేసీఆర్
డబ్బులు చెల్లించకుండా భూమి స్వాధీనం ఎలా?
సీసీఎల్‌ఏ ప్రస్తావించిన మార్కెట్ ధరకన్నా తక్కువ
ధరకే బీఆర్‌ఎస్‌కు భూమిని కేటాయించే అవకాశం
గతంలో కాంగ్రెస్‌కు భూకేటాయింపు వ్యవహారాన్నితన దరఖాస్తులోనే ప్రస్తావించిన బీఆర్‌ఎస్ పార్టీ
దాన్నే సాకుగా చూపి ‘కారు’చౌకగా ఇచ్చే చాన్స్?
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం ఎవరికైనా భూమిని కేటాయించాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది! కేటాయింపు ప్రతిపాదనలను క్యాబినెట్ ముందు పెట్టాలి. సంబంధిత కలెక్టర్, సీసీఎల్‌ఏ నిర్ధారించిన మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని ఆ భూమికి ధరను నిర్ణయించి, ఆమోదించాలి. లబ్ధిదారులు ఆ ధర చెల్లించి కలెక్టర్‌కు లేఖ రాస్తే.. అప్పుడు కలెక్టర్ పంచనామా నిర్వహించి, సరిహద్దులు నిర్ణయించి వారికి భూమి అప్పజెప్తారు. ఇది పద్ధతి. కానీ.. బీఆర్‌ఎస్ పార్టీ ‘భారత్ భవన్’ నిర్మించుకోవడానికి 11 ఎకరాల కేటాయింపు వ్యవహారం ఇంకా క్యాబినెట్ ముందు ఉన్నదని, మంత్రివర్గ నిర్ణయం తర్వాత జీవో జారీ చేస్తామని అదనపు అడ్వొకేట్ జనరల్ సాక్షాత్తూ హైకోర్టుకు తెలిపారు. ఆయన చెప్పింది నూటికి నూరుపాళ్లూ నిజమే అయితే.. ఇంకా ఈ అంశం మంత్రివర్గం వద్దే ఉంటే.. ధర కూడా ఖరారు కాలేదంటే.. ఇప్పుడు జరుగుతున్నది అడ్డగోలు వ్యవహారం కిందే లెక్క! భూకేటాయింపునకు ఇంకా క్యాబినెట్ ఆమోదం రాకుండానే.. జూన్ 5న సీఎం కేసీఆర్ ఆ భూమిలో ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎక్స్‌లెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవల్‌పమెంట్ (భారత్‌భవన్)’ నిర్మాణానికి భూమిపూజ చేయడం, ‘రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ (ఎస్‌ఈఐఏఏ)’ మంగళవారం పర్యావరణ అనుమతులు సైతం మంజూరు చేయడం దారుణమైన అక్రమం కిందే లెక్క! సొంతానికి భూమిని కేటాయించుకునే క్రమంలో ప్రభుత్వం నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కుతున్నట్టే లెక్క. గతంలో ఇలాంటి భూకేటాయింపులపై మంత్రులు వ్యతిరేక స్వరాన్ని వినిపించేవారు. ముఖ్యమంత్రితో పొసగని మంత్రులు క్యాబినెట్ భేటీలో నిలదీసేవారు. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో ఇలాంటి నిలదీతలు, ఆటంకాలు ఎక్కువగా ఉండేవి. అందుకే భూకేటాయింపుల విషయాల్లో గత ప్రభుత్వాలు కొంత జాగ్రత్తగా ఉండేవి. కానీ.. బీఆర్‌ఎస్ పార్టీకి ఎలాంటి ఆటంకాలు, అసంతృప్తులు ఎదురుకాకపోవడంతో భూకేటాయింపుల విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. సామాన్యులకు చిన్న స్థలాన్ని కేటాయించాలంటే ప్రభుత్వం సవాలక్ష నిబంధలను తెర పైకి తెస్తోంది. అలాంటిది భారత్‌భవన్‌కు భూకేటాయింపు వ్యవహారం ఇంకా క్యాబినెట్ ముందు ఉండగానే.. తీర్మానం ఆమోదం పొందకుండానే.. ధర ఖరారు చేస్తూ జీవో జారీ చేయకుండానే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయడం, స్థలాన్ని స్వాధీనం చేసేసుకోవడం, శంకుస్థాపన, చండీయాగం, పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. అత్యంత అరుదైన, అత్యవసర సందర్భాల్లో.. ఈ లాంఛనాలేవీ లేకుండానే భూములను లబ్ధిదారులకు స్వాధీనం (అడ్వాన్స్‌డ్ పొసెషన్) చేసే అవకాశం ఉంది. కానీ.. భారత్‌భవన్‌కు అలా భూమిని ముందస్తు స్వాధీనం చేయాల్సినంత అర్జెన్సీ ఏముందన్నది ప్రశ్న. ‘‘మనల్ని ఎవరూ అడగరు, ఎవరూ కోర్టు మెట్లెక్కరు, మనం అనుకున్నదంతా అనుకున్నట్లు జరిగిపోతుంది, మనకు అడ్డెవరు, అడిగేవారెవరు’’ అని భావించడం వల్లనే ప్రభుత్వం ఇలా వ్యవహరించిందా అనేది అసలు ప్రశ్న!
కోట్లల్లో కాదు.. లక్షలకే కేటాయింపు?
అధికార బీఆర్‌ఎస్ పార్టీకి ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎక్స్‌లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవల్‌పమెంట్’ నిర్మాణం కోసం కేటాయించిన 11 ఎకరాల భూమి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో ఉంది. అది అత్యంత విలువైన ప్రాంతం. అక్కడ మార్కెట్ విలువ ఎకరం రూ.3,41,25,000గా ఉందని కలెక్టర్ సీసీఎల్‌ఏకు తెలిపారని.. కాబట్టి 11 ఎకరాలకు రూ.37.53 కోట్లు బీఆర్‌ఎస్ పార్టీ కట్టాలని ప్రచారం జరుగుతోంది. విపక్షాలు కూడా ఆ ప్రచారమాయలో పడ్డాయి. వాస్తవంగా ఆ ప్రాంతంలో ఎకరానికి రూ.50 కోట్ల మేర ధర ఉండగా.. రూ.3.41 కోట్ల చొప్పున కేటాయించారంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. కానీ.. కలెక్టర్ సీసీఎల్‌ఏకు, సీసీఎల్‌ఏ మంత్రివర్గానికి ఇచ్చింది సమాచారం మాత్రమే. అదే తుది ధర కాదు. ఆ భూమిని ఎంత ధరకు కేటాయించాలో మంత్రివర్గమే తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ సీసీఎల్‌ఏ ముఖ్యమంత్రికి ప్రతిపాదన పంపారు. ఇటీవలికాలంలో జరుగుతున్న ఇలాంటి వ్యవహారాలను బట్టి చూస్తే.. మార్కెట్ ధర మాట దేవుడెరుగు, ఆ భూమిని రూ.కోట్లకు కాక.. రూ.లక్షలకే బీఆర్‌ఎస్ పార్టీకి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. హెటిరో పార్థసారథిరెడ్డికి చెందిన సాయిసింధు ట్రస్టుకు.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో 15 ఎకరాల భూమిని అడ్డగోలు ధరకు కేటాయిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 59 ఇందుకు ఉదాహరణ. ఆ ప్రాంతంలో మార్కెట్ రేటు చదరపుగజానికి రూ.75 వేలు అని కాంపిటెంట్ అథారిటీ చెప్పినప్పటికీ.. ప్రభుత్వం దాన్ని విస్మరించి 1989లో బసవతారకం ఆస్పత్రికి కేటాయించిన లీజు ధరనే సాయిసింధు ట్రస్టుకు కేటాయించిన భూమికీ ఇప్పుడు వర్తింపజేస్తూ ఆ జీవో ఇచ్చింది. దరిమిలా హైకోర్టు దాన్ని కొట్టేసింది.
బీఆర్‌ఎస్ పార్టీకి భూకేటాయింపు వ్యవహారంలోనూ ధర ఖరారు నిర్ణయం మంత్రివర్గం చేతుల్లోనే ఉండడంతో అదే తరహాలో రూ.లక్షల్లోనే ధర నిర్ణయించి కట్టబెట్టే ప్రమాదం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు పూర్వరంగంగా.. గతంలో కాంగ్రెస్ పార్టీ తన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కోసం బోయినపల్లిలో 10 ఎకరాల 15 గుంటలను కేటాయించుకున్న విషయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తన దరఖాస్తులో ఉదాహరించడం గమనార్హం. అదే ఉదాహరణ చూపి ఈ భూమిని ఎకరానికి కొన్ని లక్షల రూపాయల చొప్పున కట్టబెట్టినా ఆశ్చర్యం లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంజారాహిల్స్‌లో తెలంగాణ భవన్‌కు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా భూమిని కేటాయించింది. ఆ పార్టీ వద్ద నిధులు కూడా పుష్కలంగా ఉన్నాయని.. ఏ పార్టీకీ లేనంత స్థాయిలోదాదాపు రూ.1000 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని.. అలాంటి పార్టీకి మళ్లీ ఖరీదైన 11 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడమేమిటని.. మార్కెట్ ధరకు కొనుక్కోవచ్చుగా అని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచి ఇన్ని విమర్శలు వస్తున్నా.. ఆ భూమిని ‘ఇంత ధర’కు కేటాయించామంటూ ధర విషయంలో స్పష్టతనిస్తూ ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా వెలువడకపోవడమే అనుమానాలకు తావిస్తోంది! ఈ వ్యవహారం ఇంకా క్యాబినెట్ ముందు ఉందన్న విషయం సైతం.. దీనిపై ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ హైకోర్టులో కేసు వేశాకగానీ బయటకు రాకపోవడం గమనార్హం.
Updated Date - 2023-07-20T03:15:32+05:30 IST