ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Etala Rajender : ఈటలపై సీనియర్ల గుస్సా!

ABN, First Publish Date - 2023-06-12T02:38:51+05:30

తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యవహారశైలిపై సీనియర్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీకి వెళ్లి లీకులివ్వడమేంటని ఆగ్రహం..

జితేందర్‌రెడ్డి నివాసంలో నేతల ప్రత్యేక భేటీ

హైదరాబాద్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యవహారశైలిపై సీనియర్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నియమావళిని ఈటల పాటించడంలేదని, పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఉండగా ఢిల్లీకి వెళ్లి పదవులపై లీకులివ్వాల్సిన అవసరమేంటని మండిపడుతున్నారు. ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఇస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పలువురు సీనియర్లు ఆదివారం మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌, విజయశాంతి, వివేక్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. బీజేపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. తనకు చేరికల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు ఇస్తే ఇరవై, ముప్పై మందిని తీసుకొస్తానని పార్టీ జాతీయ నాయకత్వానికి ఈటల రాజేందర్‌ చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగిందని సమావేశంలో నేతలు గుర్తు చేశారు. మరి ఎంత మంది బీజేపీలో చేరారని, చేరికల కమిటీ చైౖర్మన్‌గానే సక్సెస్‌ కాలేకపోయిన వ్యక్తికి మరో పదవి ఇస్తే మాత్రం సక్సెస్‌ అవుతారన్న గ్యారంటీ ఏముందని అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రొటోకాల్‌ను పాటించకుండా లీకులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని, క్యాడర్‌కు ఇది ఎలాంటి సంకేతాలనిస్తుందని ప్రశ్నించారు. నేతల మధ్య వ్యక్తిగత విభేదాలుంటే వాటిని పార్టీకి ఆపాదించడం సమర్థనీయమా? అని వారు ఆక్షేపించారు. తాము కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశామని గుర్తు చేశారు. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న తమకు రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతుందో తెలియకపోవడం బాధాకరమన్నారు.

బీఆర్‌ఎస్‌ వ్యూహాత్మక ప్రచారం

సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో విచారణ ఎదుర్కొన్న నేపథ్యంలో.. తాము, బీజేపీ ఒక్కటే అనేలా విస్తృతంగా ప్రచారం జరగాలని బీఆర్‌ఎస్‌ నాయకత్వం కోరుకుంటోందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రతి అవకాశాన్నీ వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇటీవల నిజామాబాద్‌ బీజేపీ జిల్లా అధ్యక్షుడి గృహప్రవేశం సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అనూహ్యంగా తారసపడటం ఆ పార్టీ వ్యూహంలో భాగంగా జరిగిందేనని నేతలు భావిస్తున్నారు. ఆ రోజు సంజయ్‌ ఆ కార్యక్రమానికి ఎప్పుడు వస్తున్నారు? ఎక్కడి నుంచి బయలుదేరారు? ఎక్కడి వరకు చేరుకున్నారు? అనే సమాచారాన్ని ఇంటెలిజెన్స్‌ అధికారులు, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎప్పటికప్పుడు కవితకు చేరవేశారని, అందుకనుగుణంగా ఆమె కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌కు కూడా బీజేపీయే టార్గెట్‌ అని, అందుకే అవి పక్కా పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నాయని అన్నారు. బీజేపీని బలహీనపరచడం ద్వారా బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవాలన్నది కాంగ్రెస్‌ ఉద్దేశమని, తద్వారా ఆ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారంతా తిరిగి వస్తారన్న లక్ష్యంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. బీజేపీలో ఒకరిద్దరి మధ్య విభేదాలున్న మాట వాస్తవమేనని, కానీ.. కాంగ్రెస్‌లో తమ కంటే ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు.

రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండదు..!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండదని, ఈ విషయాన్ని జాతీయ నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసిందని సీనియర్ల సమావేశంలో ఒకరిద్దరు ముఖ్యులు గుర్తు చేశారు. కొద్దిరోజులుగా రాష్ట్ర పార్టీలో జరిగిన సంఘటనలపై జాతీయ నాయకత్వం స్పందించిన అంశాలను సమావేశంలో వారు వివరించారు. స్థానికంగా జరుగుతున్న ప్రచారం, పార్టీ క్యాడర్‌ కొంత అయోమయానికి గురవుతున్న వైనాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లామని, దీంతో అసలు తమకు సంబంధం లేకుండా ఎలా లీకులిస్తున్నారని వారు ప్రశ్నించారని చెప్పారు. ఎన్నికల వేళ అధ్యక్షుడి మార్పు అంటూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దీనిని గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారని కూడా సమావేశంలో ముఖ్యలు చెప్పినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

మార్పు ఊహాగానాలే: విజయశాంతి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారన్న కథనాలు ఊహాగానాలేనని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకు బండి సంజయ్‌ అధ్యక్షుడిగా కొనసాగుతారని తరుణ్‌చుగ్‌ గతంలో చెప్పిన అంశం మాత్రమే ఇప్పటికీ అధికారిక ప్రకటన అని తెలిపారు. నేతల భేటీపై ఊహాగానాలతో వెలువడే మీడియా కథనాలు, సమాచారం సరికాదని, అవి ఎప్పటికీ అధికార ప్రకటనలు కావని అన్నారు. పార్టీ అధికార ప్రతినిధుల నుంచి మాత్రమే కచ్చితమైన సమాచారం వస్తుందని, అదే కచ్చితమైనదని స్పష్టం చేశారు.

15న అమిత్‌షా రాక ఖరారు

ఖమ్మం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. 15న ఉదయం 8:50 గంటలకు షా ఢిల్లీ నుంచి బయలుదేరి 11 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. 12:45 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 1:10గంటలకు భద్రాచలం చేరుకుంటారు. సీతారామచంద్రస్వామి దర్శనం అనంతరం 3:20 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి సాయంత్రం 4గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మం బైపాస్‌రోడ్డులోని ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. తరువాత బీజేపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగసభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌ తిరుగుపయనమవుతారు.

Updated Date - 2023-06-12T02:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising