IT Hyderabad : ఐటీ హైదరాబాద్‌షా

ABN, First Publish Date - 2023-01-15T03:08:39+05:30

‘‘మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందటగా. పనిచేయాల్సింది ఎక్కడో?’’ అంటే మొన్నటిదాక ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తల్లిదండ్రులు చెప్పే మాట ‘‘బెంగళూరు’’. కానీ, ఇకపై ఆ సమాధానం.. ‘‘హైదరాబాద్‌’’ కానుంది.

IT Hyderabad : ఐటీ హైదరాబాద్‌షా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2021-22లో కొత్త ఉద్యోగాల్లో టాప్‌!..

2022-23 తొలి త్రైమాసికంలోనూ నంబర్‌వన్‌

బెంగళూరును వెనక్కునెట్టి తొలిసారి అగ్రస్థానం

‘ఆఫీస్‌ స్పేస్‌లోనూ’ అధిగమించేందుకు చాన్స్‌

కంపెనీల విస్తరణ, కొత్త పెట్టుబడులే కారణం

అక్కడితో పోలిస్తే ఇక్కడ పనికే టెకీల మొగ్గు

మెరుగ్గా ప్రభుత్వ విధానాలు, మౌలిక వసతులు

హైదరాబాద్‌, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ‘‘మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందటగా. పనిచేయాల్సింది ఎక్కడో?’’ అంటే మొన్నటిదాక ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తల్లిదండ్రులు చెప్పే మాట ‘‘బెంగళూరు’’. కానీ, ఇకపై ఆ సమాధానం.. ‘‘హైదరాబాద్‌’’ కానుంది. ‘‘అవకాశాలకు తగినట్లు మరింత విస్తరిద్దాం’’ అనుకునే అన్ని కంపెనీలకు మున్ముందు భాగ్యనగరం వేదికగా మారనుంది. ‘‘ఖర్చు తక్కువలో అవ్వాలి.. సమర్థ మానవ వనరులు కావాలి.. మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలి’’ అని కోరుకునే సంస్థలకు తెలంగాణ రాజధాని గమ్యస్థానంగా మిగలనుంది. సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా, ఐటీ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రసిద్ధి చెందిన బెంగళూరుకు నిన్నటివరకు దీటుగా నిలిచిన మన హైటెక్‌ సిటీ ఇకమీదట దూకుడుగా దాటేయనుంది. ఈ క్రమంలో తొలి అడుగుపడింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో దేశవ్యాప్తంగా ఏటా కొత్త ఉద్యోగాల కల్పనలో టాప్‌లో ఉంటున్న బెంగళూరును తొలిసారి హైదరాబాద్‌ వెనక్కునెట్టేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌ -జూన్‌) కొత్త ఉద్యోగాల కల్పనలో 34ు వాటాతో మొదటి స్థానంలో నిలిచింది.

33ుతో బెంగళూరు రెండో స్థానానికి పరిమితమైంది. 2021- 22 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన కొత్త కొలువుల్లోనూ బెంగళూరును మన హైదరాబాద్‌ అధిగమించింది. కొవిడ్‌ అనంతరం ఐటీ రంగం వేగంగా కోలుకుని సాధారణ స్థితికి రావడంతో గతేడాది దేశవ్యాప్తంగా కొత్త నియామకాలు భారీగానే సాగాయి. వీటిలో బెంగళూరు కంటే హైదరాబాద్‌లో ఒక శాతం నియామకాలు అధికంగా జరిగాయి. ముంబై (12 శాతం), పుణె (9), చెన్నై (5) తర్వాతి స్థానాల్లో నిలిచాయని సర్వే చేసిన ‘క్వెస్‌ ఐటీ స్టాఫింగ్‌ గ్రూప్‌’ తెలిపింది. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా 4.5 లక్షల కొత్త ఉద్యోగాలు భర్తీ కాగా ఇందులోనూ హైదరాబాదే (1,49,506) టాప్‌. బెంగళూరు (1,48,500)ది ద్వితీయ స్థానం. మన నగరంతో పోలిస్తే బెంగళూరులో ఐటీ ఉద్యోగుల సంఖ్య దాదాపు రెట్టింపు ఉంటుంది. ఏటా వృద్ధి నమోదవుతుంది. దానిని అధిగమించడం ఏ నగరానికీ ఇప్పట్లో సాధ్యం కాదు. అయితే, కొత్త ఉద్యోగాల్లో మాత్రం బెంగళూరుకు హైటెక్‌ సిటీ సవాల్‌ విసురుతోంది.

ఆఫీస్‌ స్పేస్‌ వినియోగంలోనూ..

‘సమర్థ మానవ వనరులు సహా పూర్తి వసతులతో కూడిన ఆఫీస్‌ స్పేస్‌..’ కార్యాలయం నెలకొల్పే ముందు ఐటీ సంస్థలు చూసే అత్యంత కీలక అంశమిది. బెంగళూరులో ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటుచేసి ఆహ్వానం పలుకుతుండడంతో కంపెనీలు ఆసక్తి చూపించేవి. అయితే, ఈ దిశగా హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ కొన్నేళ్లలో ఎంతో వృద్ధి సాధించింది. కంపెనీలు కొలువైన ప్రాంతాల్లో మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు కావాల్సిన ఆఫీస్‌ స్పేస్‌ సైతం ఇక్కడ గణనీయంగా పెరుగుతోంది. గతంలో బెంగళూరు, హైదరాబాద్‌ మధ్య ఆఫీస్‌ స్పేస్‌ వినియోగంలో ఎక్కువ వ్యత్యాసం కనిపించేది. కానీ, గతేడాదిలో భాగ్య నగరం ఎంతో వృద్ధి సాధించింది. 2021-22లో బెంగళూరులో ఐటీ కంపెనీలు కొత్తగా 90.05 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ను వినియోగించగా.. హైదరాబాద్‌లో అది 80.96 లక్షలుగా ఉంది. ఈ అంశంలోనూ వచ్చే ఏడాది కల్లా బెంగళూరును అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వ్యాపార విస్తరణకు అనువు..

ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు హైదరాబాద్‌లో కార్యాలయాలు ఉన్నాయి. వీటిని గతంలోనే ప్రారంభించినా.. ఇక్కడ ఉన్న అనుకూలతల దృష్ట్యా పెద్దఎత్తున విస్తరణకు వెళ్లాయి. ఇలా ఏర్పడినవాటిలో ఒకటి.. అమెజాన్‌ రెండో అతి పెద్ద కార్యాలయం. గూగుల్‌ సైతం ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థగా ఉంది. టీసీఎ్‌సకు వివిధ నగరాల్లో కార్యాలయాలున్నా.. ఎక్కువమంది పనిచేసేది హైదరాబాద్‌లోనే. టీసీఎస్‌ తొలుత ఒక కార్యాలయాన్ని మాత్రమే ప్రారంభించినా నాలుగుకు విస్తరించింది. మైక్రోసాఫ్ట్‌ అతి పెద్ద డేటా సెంటర్‌ను నెలకొల్పుతోంది. టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌ మరిన్ని కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, స్థిరత్వం, మౌలిక వసతుల వృద్ధితో కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెడుతున్నాయి. కొత్త ఉద్యోగాలూ పెరుగుతున్నాయి.

హిజాబ్‌, హలాల్‌ వివాదాలకూ దూరం..

ఐటీ ఉద్యోగులు ఇష్టపడే నగరాల్లో బెంగళూరుతో పాటు హైదరాబాద్‌ కూడా ఉంది. కానీ, కంపెనీలు కూడా అక్కడ ఉద్యోగులపై ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. బెంగళూరులో జీతాలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి తగినట్లే ఖర్చు ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో పనిచేసేందుకు ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. కొత్తగా నియామక పత్రాలు అందుకున్నవారిలో బెంగళూరులో 60 శాతం మందే ఉద్యోగాల్లో చేరుతుండగా.. హైదరాబాద్‌లో అది 90 శాతం వరకూ ఉంటోందని ఓ ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. గతేడాది బెంగళూరులో హిజాబ్‌, హలాల్‌ లాంటి అంశాలు చర్చనీయాంశమయ్యాయి. అది శాంతి భద్రతల సమస్య గానూ మారింది. కిరణ్‌ మజుందార్‌ షాలాంటి పారిశ్రామికవేత్త బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనూ.. మత ఘర్షణలకు దూరంగా, మెరుగైన శాంతిభద్రతలున్న హైదరాబాద్‌ వైపే అత్యధికులు మొగ్గుచూపుతున్నారని నిపుణులు అంటున్నారు.

భవిష్యత్తులోనూ ఇదే జోష్‌!

మన్ముందు కూడా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాల జోష్‌ ఇదే తరహాలో కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఇప్పటివరకు ఐటీ అంటే హైటెక్‌ సిటీ అని పేరుంది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ పేరుతో అక్కడ ఐటీ కారిడార్‌ను విస్తరిస్తూ పోతున్నారు. నగరానికి పశ్చిమాన ఉన్న ఈ ప్రాంతమే కాకుండా.. నలువైపులా ఐటీని వృద్ధి చేయాలన్న లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ‘లుక్‌ ఈస్ట్‌’ పేరుతో తూర్పు దిశగా విస్తరిస్తోంది. ఉప్పల్‌లో ప్రముఖ కంపెనీ జెన్‌ప్యాక్ట్‌ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేసింది. 15 వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. గతంలో పోచారం దగ్గర మాత్రమే ఐటీ కార్యకలాపాలు ఉండేవి. ఇప్పుడు అదనంగా మరిన్ని కంపెనీలు తెచ్చే దిశగా అడుగులు పడ్డాయి ఉత్తరం, దక్షిణ ప్రాంతాల్లోనూ ఐటీ పార్కులు నెలకొల్పి, కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు/పట్టణాలైన వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌, నల్లగొండ, సిద్దిపేటలో ఐటీ హబ్‌లను నెలకొల్పిన ప్రభుత్వం.. అక్కడ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాలంటూ ప్రోత్సహిస్తోంది. ఈ పరిణామాలతో సమీప భవిష్యత్తులో బెంగళూరును మించి హైదరాబాద్‌ వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ నాలుగు దిశలకూ ఐటీ: కేటీఆర్‌

టెక్నాలజీతో పాటు ప్రపంచం వేగవంతంగా మారుతోంది. దీనికితగ్గట్లే సత్వర నిర్ణయాలు, సమర్ధ విధానాలతో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాం. హైదరాబాద్‌ నలుమూలలా ఐటీ జోన్‌లను విస్తరిస్తున్నాం. మహా నగరాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చన్న దృక్పథం కంపెనీల్లోనూ పెరుగుతోంది. ‘‘జోహో’’ సంస్థ.. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్యాలయాలు నెలకొల్పింది. ఈ విధానం భవిష్యత్తులో విస్తరిస్తుంది. గ్రామీణ యువకుడు ఐటీ ఉద్యోగం కోసం మహా నగరానికే రావాల్సిన అవసరం ఉండదు. ఇదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ విస్తరిస్తోంది. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ హబ్స్‌ ప్రారంభించాం. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సిద్దిపేట, ఆదిలాబాద్‌లో సిద్ధమవుతున్నాయి. ఇతర పట్టణాల్లోనూ ఐటి కంపెనీలు విస్తరిస్తాం.

నిర్వహణ ఖర్చు 30ు తక్కువ..

సమర్ధ మానవ వనరులు, సామాజిక సామరస్యం, కార్యాలయ నిర్వహణ వ్యయం.. పెట్టుబడులు పెట్టేముందు కంపెనీలు చూసే మూడు అంశాలు. వీటిలో గతంలో బెంగళూరు మెరుగ్గా ఉండగా.. ఇప్పుడు హైదరాబాద్‌ అధిగమిస్తోంది. అక్కడి కంటే ఆఫీస్‌ స్పేస్‌ ఇక్కడ 30శాతం తక్కువకే లభిస్తోంది. ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీలతో సమర్ధమైన మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. సామాజిక సామరస్యత బెంగళూరు కంటే ఎంతో మెరుగ్గా ఉంది. మత కలహాలు, శాంతిభద్రతల సమస్యలు లేవు. నాణ్యమైన విద్యను అందించే పాఠశాలలు, కళాశాలలు అందుబాటులో ఉండడంతో అత్యధికులు హైదరాబాద్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.

- తిరుమల్‌రావు చామళ్ల,

కో ఫౌండర్‌, ఈఎస్‌ యంత్ర ఐటి సొల్యూషన్స్‌

2021-22లో ఐటీ ఎగుమతుల్లో టాప్‌-6 రాష్ట్రాలు (రూ.లక్షల కోట్లలో)

కర్ణాటక 3.95

మహారాష్ట్ర 2.36

తెలంగాణ1.80

తమిళనాడు1.58

ఉత్తరప్రదేశ్‌0.55

హరియాణా0.52

Updated Date - 2023-01-15T03:08:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising