Electricity demand: విద్యుత్ ఛార్జీలకు కొత్త విధానం.. ఏప్రిల్ 1, 2025 నుంచి గృహ వినియోగదారులకు వర్తింపు...
ABN, First Publish Date - 2023-06-16T03:05:18+05:30
వినియోగ సమయాన్ని (డిమాండ్-సరఫరా) బట్టి కరెంట్ చార్జీల వసూలు ఉండాలని కేంద్ర విద్యుత్తు శాఖ స్పష్టం చేసింది. డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో విద్యుత్తును వినియోగించేవారిపై సాధారణ చార్జీల కన్నా కనీసం 10 శాతం అధికంగా వసూలు చేయాలని తెలిపింది.
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): వినియోగ సమయాన్ని (డిమాండ్-సరఫరా) బట్టి కరెంట్ చార్జీల వసూలు ఉండాలని కేంద్ర విద్యుత్తు శాఖ స్పష్టం చేసింది. డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో విద్యుత్తును వినియోగించేవారిపై సాధారణ చార్జీల కన్నా కనీసం 10 శాతం అధికంగా వసూలు చేయాలని తెలిపింది. అలాగే డిమాండ్ లేని సమయంలో (ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య- సౌరవిద్యుదుత్పత్తి జరిగేటప్పుడు) కరెంటును వాడుకునే వారికి సాధారణ చార్జీలపై 20 శాతం రాయితీతో అందించాలని పేర్కొంది. ఇప్పటిదాకా పారిశ్రామిక వినియోగదారులకే ఉన్న ‘టైమ్ ఆఫ్ డే టారిఫ్ విధానం అమల్లో ఉండగా.. దీన్ని 2025 ఏప్రిల్ 1 నుంచి గృహ వినియోగదారులకూ వర్తింపజేయాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు విద్యుత్తు సవరణ నిబంధనలు-2023 అమల్లోకి తెస్తూ గెజిట్ విడుదల చేసింది.
ఇక వాణిజ్య/పారిశ్రామిక వినియోగదారులకు వాడకాన్ని బట్టి చార్జీల అమలు విధానం 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని నిర్దేశించగా.. వ్యవసాయ వినియోగదారులు మినహా గృహ వినియోగదారులందరికీ 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని స్పష్టం చేసింది. ఇందుకోసం వినియోగదారులందరికీ స్మార్ట్/ప్రీ పెయిడ్ మీటర్లు బిగించాలని నిర్దేశించింది. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో కరెంట్ వినియోగిస్తే 20ు అధికంగా చార్జీలు విధించాలని పేర్కొంది.
Updated Date - 2023-06-16T13:10:38+05:30 IST