Secunderabad FIRE Accident: ఆరుగురి దుర్మరణం
ABN, First Publish Date - 2023-03-17T03:45:32+05:30
ఇటీవల జరిగిన దక్కన్‌మాల్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. మరో విషాదం చోటుచేసుకుంది! దానికి సమీపంలోని సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
12 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది.. 8వ అంతస్తులో మొదలైన మంటలు
ఏడు, ఆరు, ఐదు అంతస్తులకు వ్యాప్తి.. భవనంలో చిక్కుకున్న వారి హాహాకారాలు
3 గంటలపాటు చెలరేగిన మంటలు.. పదిహేను ఫైరింజన్లతో పరిస్థితి అదుపులోకి
కింది నుంచి రాకెట్‌లా ఒక మంట పైకెళ్లింది.. కొద్దిసేపటికే 8వ అంతస్తులో జ్వాలలు
ప్రత్యక్ష సాక్షి వెల్లడి.. ఘటనా స్థలికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
సికింద్రాబాద్, రెజిమెంటల్ బజార్, అడ్డగుట్ట, రాంగోపాల్‌పేట, హైదరాబాద్ సిటీ, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన దక్కన్‌మాల్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. మరో విషాదం చోటుచేసుకుంది! దానికి సమీపంలోని సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా 20 నుంచి 24 ఏళ్లలోపు వారే. వారంతా ఐదో అంతస్తులోని కాల్ సెంటర్ సిబ్బంది. కాగా.. ఈ ఘటనలో 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిప్రమాదం కారణంగా చుట్టుముట్టిన పొగను పీల్చి అపస్మారక స్థితికి చేరుకున్న ఆరుగురినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది! సికింద్రాబాద్ ఆర్పీ రోడ్‌లో ఉన్న ఎనిమిది అంతస్తుల వాణిజ్య సముదాయం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో.. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎనిమిదో అంతస్తులో మొదలైన మంటలు 7, 6, 5 అంతస్తులకు వ్యాపించాయి. ఒకవైపు వర్షం కురుస్తున్నా.. అగ్నిజ్వాలలు వ్యాపించడంతో ఆ సమయంలో భవనంలో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
చాలా మంది బయటకు వచ్చేసినప్పటికీ.. దాదాపు 16 మంది లోపలే చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది స్కై లెవల్ క్రేన్‌తో భవనంలో చిక్కుకున్న వారిని కిందకు దించారు. పలు అంతస్తుల్లో ఉన్న అద్దాలు పగులగొట్టారు. చుట్టుపక్కల నివాసాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు. 10 మందిని తొలుత వెనుకవైపు నుంచి సురక్షితంగా కిందకు తీసుకువచ్చినప్పటికీ.. ఇంకా లోపల ఎందరున్నారు? ఎవరు బయటకు వచ్చారనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. మంటలు వ్యాపించిన అంతస్తుల్లో ఉన్న వారు తెలిసిన వారికి ఫోన్లు చేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ‘‘మా వాళ్లు ఫోన్లు చేశారు.. పైన ఉన్నార’’ని చెప్పడంతో అప్రమత్తమైన అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్ సిబ్బంది మరోసారి భవనంలోకి వెళ్లి చెక్ చేశారు. ఈ క్రమంలోనే.. ఐదో అంతస్తులోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేసే ఆరుగురు పైనే ఉన్నారని తెలియడంతో ఓ బృందం మళ్లీ భవనంలోకి వెళ్లింది. కానీ, అప్పటికే మంటలు, పొగ వ్యాపించడంతో వారు ఎక్కడున్నారో గుర్తించేందుకు సమయం పట్టిందని అధికారులు తెలిపారు. ఆ ఆరుగురిలో ఇద్దరు సురక్షితంగా ఉండగా.. మరో నలుగురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితికి చేరుకున్న, గాయపడ్డ పలువురిని గాంధీతోపాటు, సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.
దాదాపు మూడు గంటలపాటు మంటలు తగ్గినట్టే తగ్గి మళ్లీ వ్యాపిస్తుండడంతో అప్రమత్తమైన అగ్నిమాపక అధికారులు.. అదనపు ఫైరింజన్లను రప్పించారు. మొత్తం 15 అగ్నిమాపక శకటాలను ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాద సమాచారం తెలియగానే.. నార్త్‌జోన్ డీసీపీ చందనాదీప్తి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా.. మంత్రి తలసాని శ్రీనివా్‌స కూడా ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. సాయంత్రం 7 గంటల సమయంలో.. రాకెట్‌లా (టపాకయ) ఒక మంట కింది నుంచి పైకి వెళ్లినట్టు అనిపించిందని.. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎనిమిదో అంతస్తులో మంటలు మొదలయ్యాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అయితే.. భవనం కింది అంతస్తులో ప్యానెల్ బోర్డు నుంచి వైర్ల ద్వారా మంటలు ఎనిమిదో అంతస్తుకు వెళ్లాయని, ఇదే ప్రమాదానికి కారణమైందనిసమాచారం.
ఆయనతో వచ్చి ఉంటే.. ఆ నలుగురూ బతికేవాళ్లే!
మంటలు చుట్టుముట్టిన సమయంలో.. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని ఐదో అంతస్తులో ప్రాణాలు కోల్పోయిన నలుగురు కాల్ సెంటర్ సిబ్బందితోపాటు సుధీర్‌రెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నారు. తనతో వస్తే సురక్షితంగా తీసుకెళ్తానని ఆయన ప్రమీల, త్రివేణి, శ్రావణి, వెన్నెలకు చెప్పారు. తనతోపాటు కొద్దిదూరం వచ్చిన ఆ నలుగురూ.. పొగలు దట్టంగా వ్యాపించడంతో మధ్యలో ఆగిపోయారని, అదే వారి ప్రాణాలు తీసిందని సుధీర్ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
మృతులు వీరే!
ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురినీ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న త్రివేణి, శ్రావణి, వెన్నెల, ప్రమీల, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. వీరిలో ప్రశాంత్ అపోలో ఆస్పత్రిలో మరణించగా.. మిగతా ఐదుగురూ గాంధీ ఆస్పత్రిలో మరణించారు.
Updated Date - 2023-03-17T03:45:41+05:30 IST