women's Health Care: ఆమె ఆరోగ్యానికి అండ
ABN, First Publish Date - 2023-02-19T02:43:58+05:30
మహిళల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
మహిళల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు కొత్త కార్యక్రమం
మహిళా దినోత్సవం నాడు ప్రారంభించనున్న ప్రభుత్వం
ఐఏఎస్ శ్వేతా మహంతి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
మహిళా అధికారులు, సామాజిక కార్యకర్తలకు చోటు
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మహిళల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని కూడా వేసింది. ఈ కమిటీలో అన్ని శాఖల మహిళా అధికారులతో పాటు ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు, మహిళా సామాజిక కార్యకర్తలకు చోటు కల్పించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
మహిళల ఆరోగ్య సంరక్షణకు ఏ అంశాలపై దృష్టి సారించాలి, నెలవారీగా ఎలాంటి ఆరోగ్య సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ కార్యక్రమాన్ని ప్రభావంతంగా అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై కమిటీ చర్చిస్తుంది. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఒక మంచిపేరు సూచించాలని కూడా కమిటీని కోరింది. అన్ని వయసుల మహిళల సంపూర్ణ ఆరోగ్య రక్షణపై దృష్టి పెడుతూ ఈ కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. ఈ కమిటీ అందరి నుంచి అభిప్రాయాలు తెలుసుకుని నివేదిక తయారుచేసి మార్చి మొదటి వారంలో ప్రభుత్వానికి అందజేయనుంది.
ఒక్కో నెలా ఒక్కో సమస్యపై...
మహిళల ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రియంట్ కిట్, శానిటేషన్ కిట్, అమ్మఒడి, ఆరోగ్యలక్ష్మి ఉన్నాయి. అయితే ప్రస్తుత పథకాల్లో అన్ని వయసుల మహిళలు ఉండటం లేదు. పైగా స్త్రీల ఆరోగ్య సమస్యలు భిన్నంగా ఉంటాయి. అందరికీ చెప్పుకోలేరు. సమస్య తీవ్రమయ్యే వరకు చికిత్స కోసం ఆస్పత్రికి కూడా రారు. ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే సర్కారు కొత్త కార్యక్రమాన్ని అమలు చేయబోతోంది. రక్తహీనత, పౌష్టికాహార లోపం, మూత్రాశయ సంబంధ ఇన్ఫెక్షన్లు, మోనోపాసల్ మేనేజ్‌మెంట్, సుఖవ్యాధులు, గర్భాశయంలో కణితులు, అధిక బరువు, ఆర్థో సమస్యలు.. ఇలా అనేక రకాల ఆరోగ్య సమస్యలపై ఒక్కో నెలా ఒక్కోదానిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. క్యాన్సర్ స్ర్కీనింగ్ చేపడతారు.
చికిత్స ఎక్కడ?
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బోధనాస్పత్రుల వరకుఏడాది పాటు ఈ కార్యక్రమం నిర్వహణ ఉంటుందని తెలుస్తోంది. వ్యాధులను ముందుగానే గుర్తించి, సరైన చికిత్స అందించడం ద్వారా మహిళలను అనారోగ్యం బారి నుంచి కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఆరోగ్య సమస్యలపై పెద్దఎత్తున అవగాహన కల్పించడం, చికిత్స అందించడం, అవసరమైతే పెద్దాస్పత్రులకు కోసం పంపడం చేస్తారు. దీంతో పాటు మహిళలు వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఆస్పత్రుల్లో వారంలో ఒక రోజును కేటాయించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సదుపాయాలు, ఇంకా కావాల్సిన వాటిపై ప్రణాళిక రూపొందించాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.
ఎందుకంటే...
రాష్ట్రంలో ఆరోగ్య సమస్యల బారినపడే మహిళల సంఖ్య ఏటా పెరుగుతోంది. ముఖ్యంగా క్యాన్సర్ కేసులు ప్రమాదకర స్థితిలో పెరుగుతున్నాయి. ఐసీఎంఆర్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం 2019లో 34,568 మంది, 2020లో 35,457 మంది, 2021లో 36,334 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. రక్తహీనతతో బాధపడే మహిళల శాతం కూడా ఎక్కువగానే ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 మేరకు 52.7 శాతం మంది (19-49 మధ్య వయస్కుల్లో) అనీమియాతో బాధపడుతున్నారు. 51శాతం మంది అధికబరువుతో సతమతమవుతున్నారు. 16.7 శాతం మంది తీవ్రమైన షుగర్ లెవల్స్‌తో, 19.5 శాతం మంది రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారు. 32 శాతం మంది మహిళలు తమ ఆరోగ్య సమస్యలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు ఎన్‌ఎ్‌ఫహెచ్ సర్వే-4లో వెల్లడైంది. ఇక ఒక సర్వే ప్రకారం 35 శాతం మంది మహిళలు తమ ఆరోగ్య సమస్యల గురించి కనీసం కుటుంబ సభ్యులతో కూడా చర్చించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించింది.
Updated Date - 2023-02-19T02:43:59+05:30 IST