Hyderabad: బీజేపీ కార్పొరేటర్ హఠాన్మరణం
ABN, First Publish Date - 2023-01-14T11:51:21+05:30
బీజేపీ సీనియర్ నేత, గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ (58) హఠాన్మరణం పొందారు.
హైదరాబాద్/కార్వాన్: బీజేపీ సీనియర్ నేత, గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ (58) హఠాన్మరణం పొందారు. గురువారం రాత్రి పది గంటల సమయంలో ఇంట్లో మనవలు, మనవరాళ్లతో సరదాగా గడుపుతుండగా, పక్షవాతం లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ శుక్రవారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన కళ్లను దానం చేశారు. కొవిడ్ సమయంలో ఆయన కుమార్తె మృతి చెందారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. కరుణాకర్ మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్య, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు, నేతలు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. పార్టీకి తీరని లోటని అన్నారు. దేవర కరుణాకర్ పార్టీలకు అతీతంగా అందరితోనూ స్నేహశీలిగా మెలిగేవారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కార్యకర్తగా ప్రారంభమై..
కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో బీజేపీ క్రియాశీలక కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, అంచలంచెలుగా కరుణాకర్ ఎదిగారు. 2001లో మెహిదీపట్నం డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో భార్య దేవర దీపను గెలిపించుకున్నారు. 2009లో కార్వాన్ నుంచి, 2018లో నాంపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో గుడిమల్కాపూర్ కార్పొరేటర్‌గా మరోసారి గెలుపొందారు. ఆయనకు భార్య దేవర దీప, కుమారుడు వంశీ, కూతురు భవానీ ఉన్నారు.
మేయర్ సంతాపం
దేవర కరుణాకర్ మృతికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకే ష్ కుమార్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వెళ్లిన విజయలక్ష్మి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
Updated Date - 2023-01-14T11:51:24+05:30 IST