Raghunandan Rao: నదినిచెరబట్టిన మంత్రి
ABN, First Publish Date - 2023-04-19T02:31:38+05:30
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపణలు చేశారు. నిరంజన్‌రెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించారని, కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని కబ్జా చేసి ..
కృష్ణా భూములను నిరంజన్‌రెడ్డి ఆక్రమించారు
నదిని కబ్జా చేసి ఫాంహౌస్ కట్టుకున్నారు
80 ఎకరాల కొనుగోలు.. మరో 80 ఎకరాలు కబ్జా
మొత్తం 160 ఎకరాల చుట్టూ కాంపౌండ్‌వాల్ నిర్మాణం
ఎస్టీ కోటా నిధులతో రహదారి వేయించుకున్నారు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపణలు
మంత్రుల ‘ఫాంహౌస్ ఫైల్స్’ వెల్లడిస్తామని ప్రకటన
రాజకీయ దుగ్ధతో ఆరోపణలు
ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న భూములే: మంత్రి
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపణలు చేశారు. నిరంజన్‌రెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించారని, కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని కబ్జా చేసి ఫాంహౌస్ నిర్మించుకున్నారని, భూమి చుట్టూ నదిలోనే ఆరడుగుల ఎత్తున కాంపౌండ్ వాల్ నిర్మించారని ఆరోపించారు. భూములకు గిరిజనుల పేరిట రూ. కోట్ల సబ్సిడీలు పొందారని, ఆ తరువాత ఆ భూములను తన కుటుంబసభ్యులకు బదిలీ చేయించుకున్నారని తెలిపారు. ఈ మేరకు రఘనందన్‌రావు మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కబ్జాకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. రఘునందన్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లా మానవపాడు మండలంలోని చండూరు తదితర గ్రామాల పరిధిలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో మంత్రి నిరంజన్‌రెడ్డి 80 ఎకరాల భూమిని ఒక వ్యక్తి నుంచి కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నారని, కానీ.. 160 ఎకరాలకు కాంపౌండ్ వాల్ నిర్మించారని తెలిపారు. ఇందులో కృష్ణానదిలోనే 6 అడుగుల ఎత్తున మట్టితో పూడ్చి ఈ కాంపౌండ్ వాల్ కట్టారని పేర్కొన్నారు. ఈ ఫాంహౌ్‌సలో ఒక గెస్ట్‌హౌస్ కూడా ఉందన్నారు. మూడున్నర ఎకరాల్లో సీసీ రోడ్లు కూడా వేశారని తెలిపారు. అంతేకాకుండా.. గిరిజనుల పేరిట సుమారు రూ.7 కోట్ల వ్యవసాయ, ఉద్యానవన సబ్సిడీలను పొందారని, ఆ తర్వాత ఆ భూములను మంత్రి కుటుంబసభ్యుల పేరిట బదిలీ చేయించుకున్నారని వివరించారు.
ఆర్డీఎస్ భూములూ కబ్జా..
ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కాల్వల నిర్మాణం కోసం సర్వేనెంబరు 60లో 17 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం సేకరించిందని రఘునందన్‌రావు తెలిపారు. 1973-74 పహాణీ రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ భూమి అని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న పహాణీ రికార్డుల్లో ఈ సర్వేనెంబరులో మంత్రి నిరంజన్ కుటుంబసభ్యుల పేర్లతోపాటు ఒక కంపెనీ పేరు కూడా ఉందన్నారు. ఈ భూమి చుట్టూ కాంపౌండ్‌వాల్ నిర్మించారన్నారు. దీనిపై తాము మానవపాడు మండల మండల రెనెన్యూ అధికారుల వివరణ కోరితే విచిత్రమైన సమాధానం వచ్చిందన్నారు. రెండేళ్ల కిందట తమ కార్యాలయం తగలబడిపోవడంతో రికార్డులన్నీ కాలిపోయాయని, అందుబాటులో లేవని సిబ్బంది చెప్పారని తెలిపారు. అయితే రెవెన్యూ కార్యాలయంలో 2021 అక్టోబరు 25న అగ్నిప్రమాదం జరిగిందని, షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని, రికార్డులన్నీ కాలిపోయాయని పేర్కొంటూ అప్పటి తహసీల్దారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారని రఘునందన్ వివరించారు. కానీ, దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా.. ఇప్పటివరకూ చార్జిషీట్ దాఖలు చేయలేదన్నారు. అంతేకాకుండా.. సర్వే నెంబరు 57లోని 20 ఎకరాలు 1973-74 పహాణీ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి అని, ఈ భూమి కూడా మంత్రి ఫాంహౌస్ కాంపౌండ్ లోపలే ఉందని వెల్లడించారు. ప్రభుత్వ, ఆర్డీఎస్ భూములను కబ్జా చేసే క్రమంలో.. తొలుత ఒక గిరిజన వ్యక్తి పేరిట వాటికి డాక్యుమెంట్లు సృష్టించారని, ఆ తర్వాత ఆ భూములను తమ కుటుంబ సభ్యుల పేరిట మార్చుకుని క్రమబద్ధీకరణ చేసుకున్నారని తెలిపారు.
మంత్రి ఫాంహౌస్ రోడ్డు కోసం ఎస్టీ కోటా నిధులు..
మంత్రి నిరంజన్‌రెడ్డి ఫాంహౌ్‌సకు బీటీ రోడ్డు కోసం ఎస్టీ కోటా నిధులు కేటాయించారని రఘునందన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి మార్చి 31న జీవో నెంబరు 147 జారీ చేశారని తెలిపారు. పెద్ద మందడి మండలంలోని సోలిపూర్ జడ్పీ రోడ్డు-వెల్టూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు (మోజర్ల గ్రామం) వరకు 4 కిలోమీటర్ల బీటీ రోడ్డు కోసం రూ.3.56 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ రోడ్డు నిజంగా గిరిజనుల కోసమే వేశారా? ఎన్ని తండాలు ఉన్నాయి? ఈ రోడ్డు ఎవరి ఫాంహౌ్‌సకు వెళుతుందో వనపర్తి జిల్లా కలెక్టర్ చెప్పాలని రఘునందన్ డిమాండ్ చేశారు. నిరంజన్‌రెడ్డికి కుటుంబ వారసత్వంగా వచ్చింది పానగల్ గ్రామంలో 16 ఎకరాల భూమి మాత్రమేనన్నారు. కానీ, ఆయన వంద ఎకరాల్లో ఫాంహౌస్, కోట్ల రూపాయలతో ప్యాలెస్ నిర్మించారని పేర్కొన్నారు. పెద్ద మందడి మండలంలోని వెల్టూరు-మోజర్ల మధ్య 50 ఎకరాల్లో మరో ఫాంహౌస్ ఉందని, ఇందులో ఇనాం భూములు, ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉన్నాయని ఆరోపించారు.
వీటిని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ‘‘మంత్రి కబ్జా చేయకపోతే.. గట్టుకాడిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చి ప్రకటిస్తారా? నేను వెల్లడించిన వివరాలు తప్పని నిరూపిస్తారా? మానవపాడు తహసీల్దారు ఆఫీసు అగ్ని ప్రమాదానికి గురికావడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం లేదని చెప్పగలరా?’’ అని రఘునందన్ సవాల్ చేశారు. తప్పుచేసిన వారిని, కబ్జాదారులను కఠినంగా శిక్షిస్తానన్న సీఎం కేసీఆర్.. మంత్రి నిరంజన్‌రెడ్డి కబ్జాలపై స్పందించాలన్నారు. రాష్ట్ర మంత్రుల ఫాంహౌస్ ఫైల్స్ ను దశలవారీగా వెల్లడించబోతున్నట్లు, వాటికి సంబంధించిన అన్ని ఆధారాలూ సేకరిస్తున్నట్లు చెప్పారు. ఏ మంత్రికి ఎన్ని ఫాంహౌ్‌సలు ఉన్నాయో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ దుగ్ధతో రఘునందన్ ఆరోపణలు
చండూరు భూములు నా కూతుళ్లు స్వార్జితంతో కొన్నారు: నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్/వనపర్తి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు రాజకీయ దుగ్ధతోనే తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రఘునందన్ చేసిన ఆరోపణలకు నిరంజన్‌రెడ్డి పత్రికా ప్రకటన ద్వారా స్పందించారు. తన స్వగ్రామం పాన్‌గల్‌లో ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నవేనని మంత్రి తెలిపారు. ఆ వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన ఇల్లు తన సతీమణి సొంత డబ్బులతోపాటు బ్యాంకు రుణంతో నిర్మించుకున్నామని పేర్కొన్నారు. విదేశాల్లో చదువుకొని, అక్కడే ఉద్యోగాలు చేస్తున్న తన ఇద్దరు కూతుళ్ల స్వార్జితంతో చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసులు, ఇతరుల నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమి తప్ప.. మరొకటి కాదన్నారు. గిరిజనుల పేరుతో భూమి కొని.. తరువాత తన కుటుంబసభ్యుల పేరు మీదికి మార్చుకున్నామన్న రఘునందన్ ఆరోపణకు ఆయన జవాబిచ్చారు. ‘‘తల్లిదండ్రులు లేని గౌడనాయక్‌ను చేరదీసి.. నా కొడుకు వలే పెద్దచేశాను. కరోనా సమయంలో విదేశాల నుంచి మా కుమార్తెలు రాలేకపోవడంతో మా ఇంటి వ్యవహారాలు చూస్తున్న గౌడనాయక్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి.. వారు వచ్చాక వారి పేరిట మార్చాం’’ అని మంత్రి వివరించారు.
మూడు ఫాంహౌ్‌సలు ఉన్నాయనడం అవివేకమని, పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫామ్‌హౌ్‌సలేనా? అని ప్రశ్నించారు. వెల్టూరు గ్రామ పరిధిలోని 11.20 ఎకరాల భూమి.. లండన్‌లో ఉన్న తన మరదలు డాక్టర్ కవితది అని, దానిని 50 ఎకరాలు అని, అది తనదేనని చెప్పడం దుర్మార్గమన్నారు. మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనకు ఈ భూములకు ముడిపెట్టడం నీచపు ఆరోపణ అని మండిపడ్డారు. రఘునందన్‌రావు వచ్చి తన భూములను సర్వే చేయవచ్చని, న్యాయంగా కొనుగోలు చేసిన భూమి కంటే ఒక్క గుంట ఎక్కువ ఉన్నా తమ పిల్లలు వాటిని వదిలేస్తారని, తాను పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు రఘునందన్‌రావు క్షమాపణ చెప్పాలని, తాను తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
Updated Date - 2023-04-19T03:03:06+05:30 IST