BRS : తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీ
ABN, First Publish Date - 2023-04-11T02:43:41+05:30
విస్తున్న భారత్ రాష్ట్ర సమితి(గతంలో టీఆర్‌ఎస్) గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం కేవలం తెలంగాణకే పరిమితం చేసింది.
ఏపీలో రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేసిన ఈసీ
పలుమార్లు నోటీసులిచ్చినా స్పందించలేదు.. 2024 ఎన్నికలకు కొనసాగించాలని లేఖ ఇచ్చింది
నిబంధనల మేరకే రద్దు: ఈసీ.. సీపీఐ జాతీయ పార్టీ హోదా గల్లంతు.. ఎన్సీపీ, టీఎంసీ కూడా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రాష్ట్ర పార్టీ హోదా అనుభవిస్తున్న భారత్ రాష్ట్ర సమితి(గతంలో టీఆర్‌ఎస్) గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం కేవలం తెలంగాణకే పరిమితం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎ్‌సకు ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజనకు ముందు టీఆర్‌ఎస్ ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ అంతకుముందే ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదాను అనుభవిస్తూ వస్తోంది. 2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్ పోటీ చేయలేదు. దాంతో నిబంధనల ప్రకారం ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని టీఆర్‌ఎ్‌సకు 2019 జూలైలో షోకాజ్ నోటీసులు జారీ చేశామని, ఆ పార్టీ స్పందించలేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. 2021 డిసెంబరు 27న వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరై వాదనలు వినిపించాలని, అదే నెల 16న నోటీసులు జారీ చేశామని, కానీ ఆ పార్టీ ప్రతినిధులు హాజరు కాలేదని స్పష్టం చేసింది.
చివరికి గత నెల 20న హాజరు కావాలని లేఖ రాసినా ఎవ్వరూ హాజరు కాలేదని తెలిపింది. అయితే, రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపును కొనసాగించాలని లేఖ రాసిందని వెల్లడించింది. వాస్తవాలు, ఎన్నికల గుర్తుల ఉత్తర్వులు, ఎన్నికల్లో పనితీరును పరిశీలించి ఎన్నికల గుర్తుల ఆర్డర్, 1968లోని 6వ పేరాను అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎ్‌సకు ఉన్న రాష్ట్ర పార్టీ హోదా గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. కేవలం తెలంగాణలోనే ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఉన్నట్లుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.
ఆప్ ఇక జాతీయ పార్టీ
ఆమ్ ఆద్మీ పార్టీ కల నెరవేరింది. ఏర్పాటు చేసిన పదిన్నర ఏళ్లలో అది జాతీయ పార్టీ హోదాను సాధించింది. ఈ మేరకు సోమవారం ఎన్నికల సంఘం నుంచి ఆ పార్టీ ఆర్డర్ అందుకుంది. నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే ఆ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తారు. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవాల్లో ఆప్ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. ఒక పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే 6 శాతం ఓట్లు 2 సీట్లు గానీ/3 శాతం సీట్లు లేదా 3 సీట్లు గానీ/8 శాతం ఓట్లు కానీ... స్థానిక శాసనసభ ఎన్నికల్లో సాధించాలి. జాతీయ హోదా రావడంతో ఇక దేశ వ్యాప్తంగా ఆప్ అభ్యర్థులు చీపురు గుర్తుతో పోటీ చేయవచ్చన్న మాట. 2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే నేతృత్వంలో మొదలైన ఉద్యమాన్ని 2012 నవంబరులో కేజ్రీవాల్ రాజకీయ పార్టీగా(ఆమ్ ఆద్మీ పార్టీ) మార్చేశారు. పార్టీ 2015లో ఢిల్లీలో అధికారానికి వచ్చింది. రెండోసారి అధికారాన్ని నిలుపుకుంది. తాజాగా 2022లో పంజాబ్‌లో అధికారానికి వచ్చింది. పదిన్నరేళ్ల వ్యవధిలో ఇప్పుడది జాతీయ పార్టీగా మారింది. జాతీయ పార్టీ హోదా దేశ ప్రజల పట్ల తమ బాధ్యతను పెంచిందని పార్టీ అధినేత కేజ్రీవాల్ అన్నారు.
ఎన్‌సీపీ, టీఎంసీ, సీపీఐలు జాతీయ పార్టీలు కాదు
ఇప్పటిదాకా జాతీయ పార్టీల హోదాను అనుభవించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ), తృణమూల్ కాంగ్రెస్, సీపీఐలు ఆ హోదాను కోల్పోయాయి. ఈ మేరకు ఆ పార్టీలకు ఈసీ నుంచి ఆర్డర్లు అందాయి. వరుస ఎన్నికల్లో నిబంధనల ప్రకారం నాలుగు రాష్ట్రాల్లో నిర్దేశిత విజయాలను సాధించక పోవడంతో వాటికి ఈ పరిస్థితి ఏర్పడింది.
Updated Date - 2023-04-11T02:43:41+05:30 IST