వ్యాపార పెద్దన్న.. వినోద్ అదానీ
ABN, First Publish Date - 2023-02-28T03:58:02+05:30
వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి ఆస్తి కోసమే అన్నదమ్ముల మధ్య అనేక వివాదాలు రావడం చూస్తుంటాం. తల్లిదండ్రులు కూడబెట్టిన దాంట్లో వాటాల కోసం కుటుంబసభ్యులు గొడవలు పడటం వింటుంటాం.
కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచిన దిగ్గజం.. దుబాయ్ కేంద్రంగా సామ్రాజ్య విస్తరణ
ఆయన మార్గనిర్దేశంలోనే గౌతం అదానీ,ఇతర కుటుంబ సభ్యుల వ్యాపారాలు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి ఆస్తి కోసమే అన్నదమ్ముల మధ్య అనేక వివాదాలు రావడం చూస్తుంటాం. తల్లిదండ్రులు కూడబెట్టిన దాంట్లో వాటాల కోసం కుటుంబసభ్యులు గొడవలు పడటం వింటుంటాం. కానీ రూ.లక్షల కోట్ల సంపద ఉన్నా అదానీ పరివారం వివాదాలకు ఆమడ దూరంలో ఉంటోంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆ కుటుంబ సభ్యుల తీరు ఎలా ఉన్నా.. ఇప్పటికీ ఫ్యామిలీ అంతా ఉమ్మడిగానే ఉంటోంది. ఇలా కుటుంబ సభ్యులంతా కలసి ఉండటంలో వినోద్ అదానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. అదానీ గ్రూప్‌లో రోజువారీ వ్యాపార లావాదేవీలను గౌతం అదానీ నిర్వహిస్తున్నప్పటికీ ఆ కుటుంబంలో వినోద్ అదానీది నిజంగా పెద్దన్న పాత్రే. అధికారికంగా ఎలాంటి హోదాలు లేకున్నా అదానీ గ్రూప్‌లో అత్యధిక షేర్లు ఆయన పేర ఉన్నట్లు సమాచారం. దుబాయ్‌లో నివసించే వినోద్ అదానీ అక్కడి నుంచే సంస్థను విస్తరించారు. ఆయన మార్గనిర్దేశంలోనే గౌతం అదానీ, ఇతర కుటుంబ సభ్యులు వ్యాపారాలు చేస్తారని చెబుతుంటారు. భారత్ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సిమెంట్ మార్కెట్. ఇక్కడ అంబుజా, ఏసీసీ సిమెంట్ సంస్థలను సుమారు రూ.80వేల కోట్ల విదేశీ నిధులతో అదానీ గ్రూప్ కైవసం చేసుకుంది. ఈ సంస్థల షేర్లన్నీ వినోద్ అదానీ కొనుగోలు చేసినట్లుగా సంచలన కథనం వెల్లడైంది. ఎలాంటి అధికారిక హోదా లేకున్నా అత్యధిక షేర్లు వినోద్, ఆయన భార్య పేరిట ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పన్నులు, ఇతర కేసుల భయంతో బిర్లా గ్రూప్ సిమెంట్ రంగ విస్తరణలో వెనకబడిపోగా, విదేశీ పెట్టుబడులతో అదానీ కుటుంబం అనూహ్యంగా దేశ సిమెంట్ పరిశ్రమపై ఆధిపత్యాన్ని సంపాదించింది.
దుబాయ్ నుంచే కార్యకలాపాలు..
1970వ దశకంలో ముంబై, భీవండిలలోని పవర్ లూంలలో పని చేయడానికి తెలంగాణ నుంచి భారీగా తరలివెళ్లారు. అదే సమయంలో అదానీ ఈ కార్మికుల ద్వారా కొన్నాళ్లు వస్త్ర పరిశ్రమను నిర్వహించారు. ఆపై దుబాయ్ వచ్చి ఆహార వస్తువుల దిగుమతి వ్యాపారాన్ని ప్రారంభించారు. తర్వాత దాన్ని ఇతర రంగాలు, దేశాలకూ విస్తరించారు. దుబాయ్ నుంచే సింగపూర్, ఇండోనేషియాల్లో కూడా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పన్నుల మినహాయింపు కోసం ఆయన భారత పౌరసత్వం వదులుకుని సైప్రస్ పౌరసత్వాన్ని పొందారనే ఆరోపణలున్నాయి. సైప్రస్ పౌరుడిగా దుబాయ్‌లో ఉంటున్న వినోద్ అదానీ సంపద మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనూహ్యంగా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల్లో అందరి కంటే సంపన్నుడిగా వినోద్ రికార్డు సృష్టించారు. గత ఏడాది వరకు లక్షా 69వేల కోట్ల డాలర్ల సంపద ఆయన వద్ద ఉంది. రోజుకు సగటున రూ.102 కోట్లు సంపాదిస్తున్న వినోద్ అదానీ దుబాయ్‌లో సాదాసీదా జీవితం గడుపుతారు. ఇతర భారత వ్యాపారవేత్తల తరహాలో ఏ సందర్భంలోనూ బయట కనిపించరు. ఒక దశలో అదానీ కుటుంబ వ్యాపార ప్రధాన కార్యాలయాన్ని దుబాయ్‌కి తరలించే ప్రయత్నం జరిగినా, తర్వాత అది ముందుకు కదలలేదు. అదానీ గ్రూప్‌లోని ఉద్యోగులంతా గుజరాత్‌కు చెందిన వారే కావడం విశేషం.
Updated Date - 2023-02-28T03:58:49+05:30 IST