Cantonment: ఆగస్టులో కంటోన్మెంట్ ఎన్నికలు?
ABN, First Publish Date - 2023-03-31T10:39:28+05:30
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు(Secunderabad Cantonment Board) పాలక మండలికి ఆగస్టులో ఎన్నికలు జరగవచ్చంటూ స్థానికంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి.
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు(Secunderabad Cantonment Board) పాలక మండలికి ఆగస్టులో ఎన్నికలు జరగవచ్చంటూ స్థానికంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. కంటోన్మెంట్ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ వేసవికాల సమావేశాల్లో ఆమోదం పొందడం ఖాయమని, కొత్త చట్టం ప్రకారం పార్టీల ఆధారంగా, గుర్తింపు పొందిన చిహ్నాలతో బోర్డు ఎన్నికలు జరుగుతాయంటూ గురువారం విస్తృతంగా ప్రచారం ప్రారంభమైంది. కొత్త చట్టం అమలులోకి రాకపోయినా, పాత చట్టం ప్రకారమే పార్టీలకు అతీతంగా దేశంలోని అన్ని కంటోన్మెంట్లకు ఎన్నికలు జరపాలని రక్షణ శాఖ నిర్ణయించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దేశ వ్యాప్తంగా కంటోన్మెంట్లకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరపాలని షెడ్యూల్ విడుదల చేసిన రక్షణ శాఖ(Department of Defense) ఆ తర్వాత యూ టర్న్ తీసుకొని.. ఎన్నికలు వాయిదా వేస్తూ గెజిట్ విడుదల చేసిన సంగతి విదితమే. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కంటోన్మెంట్ల ఎన్నికలు సత్వరమే నిర్వహించాలని కొద్ది నెలల క్రితమే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. తాజాగా మరి కొందరు కోర్టుకు వెళ్లనుండడంతో ఎన్నికల నిర్వహణపై రక్షణ శాఖ మరోసారి దృష్టి సారించినట్టు చెబుతున్నారు. సికింద్రాబాద్(Secunderabad Cantonment Board) కంటోన్మెంట్ బోర్డు( అధికారులు దీనిపై అధికారికంగా స్పందించడం లేదు.
రక్షణ శాఖ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేమని, కంటోన్మెంట్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా రక్షణ శాఖ తలచుకుంటే ఎన్నికలు ఏ క్షణంలోనైనా నిర్వహించవచ్చంటూ అనధికారికంగా వ్యాఖ్యానించారు. ఎన్నికలు వాయిదా పడడంతో నిరుత్సాహంతో ప్రజాక్షేత్రాన్ని విడిచిపెట్టిన పలువురు ఆశావహులు తాజా ఊహాగానాల నేపథ్యంలో శ్రీరామ నవమి వేడుకల్లో దర్శనమివ్వడం గమనార్హం.
Updated Date - 2023-03-31T10:39:28+05:30 IST