Podu Lands: పోడుకు పట్టాభిషేకం
ABN, First Publish Date - 2023-02-11T03:53:20+05:30
రాష్ట్రంలో చాలాకాలంగా రగులుతున్న ‘పోడు’ భూముల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా విస్పష్టమైన ప్రకటన చేశారు.
11.5 లక్షల ఎకరాల పంపిణీకి సిద్ధం.. నెలాఖరున అందిస్తాం
సాగుదారులందరికీ హక్కు పత్రాలిస్తాం
అడవిని రక్షిస్తామంటూ హామీ ఇవ్వాలి
సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గిరిజన
ప్రతినిధులు,అఖిలపక్ష నేతలు సంతకం చేయాలి
‘పోడు’ హక్కుదారులే కాపలాదారులు
మళ్లీ ఆక్రమిస్తే హక్కులు రద్దు చేస్తాం
ఇకపై పోడు, ఆక్రమణలంటూ ఉండొద్దు
ఇంతటితో సమస్యకు స్వస్తి పలుకుదాం
ఆ రైతులకు రైతుబంధు, విద్యుత్తు కనెక్షన్లు
భూమి లేని గిరిజనులకు ‘గిరిజన బంధు’
అడవులకు హద్దులు పెట్టి సాయుధ గస్తీ
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన
హైదరాబాద్, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చాలాకాలంగా రగులుతున్న ‘పోడు’ భూముల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా విస్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో మొత్తం 11.50 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలు అందజేస్తామని తేల్చిచెప్పారు. ఈ నెలాఖరు నుంచే పత్రాల పంపిణీని ప్రారంభిస్తామని వెల్లడించారు. పోడు సాగుదారులకు రైతు బంధును అమలు చేస్తామని, విద్యుత్తు కనెక్షన్లు ఇస్తామని పేర్కొన్నారు. అవసరమైతే గిరి వికాసం కింద నీటి వసతిని కల్పిస్తామన్నారు. పోడు హక్కులు పొందిన వారు.. భవిష్యత్తులో అడవులకు పూర్తి కాపలాదారులుగా ఉంటామని, ఇకపై గజం భూమిని కూడా ఆక్రమించబోమని, చెట్లను నరకబోమంటూ లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుందని షరతు పెట్టారు. స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గిరిజన ప్రతినిధులు, అఖిలపక్ష నేతలందరూ ఈ మేరకు హామీ పత్రాలపై సంతకాలు చేయాలని చెప్పారు. అలా ముందుకురాని చోట పట్టాలు ఇవ్వమని పేర్కొన్నారు.
ఇక హామీని ఎవరైనా ఉల్లంఘిస్తే పోడు పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. సమస్యకు ఇంతటితో ముగింపు పలుకుదామని, ఎమ్మెల్యేలందరం కలిసి కృషి చేద్దామని సీఎం పిలుపునిచ్చారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, ధనసరి అనసూయ, పెద్ది సుదర్శన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ సమాధానమిచ్చారు. అంతలో.. సభలోకి ప్రవేశించిన సీఎం కేసీఆర్ పోడు భూములపై మాట్లాడారు. గతంలోని పోడు భూములు, ఇప్పుడు ఇచ్చేవి ఎన్ని ఎకరాలున్నాయనేది లెక్క చూసుకుని పట్టాలు ఇద్దామని అనుకుంటున్నామని చెప్పారు. ఆ వివరాలను అసెంబ్లీకి వెల్లడిస్తామని, ఎమ్మెల్యేలందరికీ లేఖలు రాస్తామని తెలిపారు. పట్టాలు ఇచ్చిన తర్వాత ఇంకా భూములు లేనివారుంటే.. గిరిజన బంధు అమలు చేస్తామన్నారు. ఇకపై అంగుళం భూమి కూడా ఆక్రమించనివ్వమని, ఒక్క చెట్టునూ కొట్టనివ్వమని అటవీ సరిహద్దులను నిర్ణయించి, సాయుధ గస్తీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్టీల్లో కొందరికి వంశపారంపర్యంగా వచ్చిన భూములున్నాయని, వారికి పోడు పట్టాలే కాక.. విద్యుత్తు, రైతుబంధు కూడా ఇస్తామని సీఎం చెప్పారు.
గిరిజనులతో గిల్లికజ్జాలొద్దు
రాష్ట్రంలో మొత్తం 66 లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని ఇందులో సుమారు 11.50 లక్షల ఎకరాలు పోడులో ఉందని.. అటవీ భూమిని కాపాడుకోవాలంటే గిరిజనులతో గిల్లికజ్జాలు పెట్టుకోవద్దని అధికారులకు చెప్పామని సీఎం వివరించారు. ‘సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వామపక్ష నాయకులు వచ్చి అడిగినప్పుడు.. పోడు భూముల విషయంలో మాకు స్పష్టత ఉందని చెప్పా. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వడంలో అభ్యంతరం లేదు. తప్పకుండా ఇస్తాం. సర్వే చేసి సిద్ధంగా పెట్టాం. చీఫ్ సెక్రటరీనే.. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలోనే సర్వే జరిగింది. గ్రామ, మండల, డివిజన కమిటీలు తేల్చి, జిల్లా కమిటీలు కూడా వివరాలు సిద్ధం చేసి పెట్టాయి’ అని తెలిపారు. ‘గత ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో పోడు సమస్య పెద్ద చిక్కులాగా మారింది. పోడు సమస్య కొనసాగాలా? ముగింపు కావాలా? అని గిరిజన పెద్దల సమావేశంలో అడిగా. భూముల పంపిణీ తర్వాత ఇంకా ఎవరైనా గిరిజన బిడ్డలు ఉపాధి, భుక్తి, అవకాశాలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా మిగిలి ఉంటే దళిత బంధు తరహాలో గిరిజన బంధు అమలు చేస్తామని చెప్పా. గిరిజనులు, ముస్లింలు, హిందువులు వేర్వేరు అన్న భావన రాష్ట్రంలో కొందరికి ఉంది. మాకు అలాంటి భేషజాలు లేవు. తెలంగాణలోని ఎవరైనా ఇక్కడి బిడ్డలే’ అని కేసీఆర్ అన్నారు. గిరిజనులకు త్రీ ఫేజ్ కరెంటు కూడా ఇస్తున్నామని చెప్పారు. ఎవరూ దరఖాస్తు చేయలేదని, తానే జోక్యం చేసుకుని, భద్రాచలం, ఇతర గిరిజన ఆవాసాల్లో గిరిజనుల కోసం రూ.400 కోట్లను వ్యయం చేస్తూ త్రీ ఫేజ్ కరెంటు ఇస్తున్నామని పేర్కొన్నారు.
అఖిలపక్ష సమావేశం తర్వాత
సర్వే చేసిన 11.50 లక్షల ఎకరాల పోడు భూములకు మనందరం కలిసి పట్టాలు పంచి పెడదామని సభ్యులను ఉద్దేశించి సీఎం పేర్కొన్నారు. ‘‘ఫిబ్రవరి చివరి వారంలో పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం. ఒకసారి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిర్ణయం తీసుకుందాం. ఇది కేవలం ఎన్నికల కోసం చేయడం లేదు. పదో పరకో ఎకరాలను పంపిణీ చేసి, తూతూమంత్రంగా చర్యలు తీసుకోం. ఆ దందాలు మేం చేయం. గత ప్రభుత్వాలు చేసిన తప్పుల పర్యవసానాలు సమస్యగా మారాయి’’ అని సీఎం వ్యాఖ్యానించారు.
అటవీ అధికారులనూ నియంత్రిస్తాం
గొత్తికోయలు మన రాష్ట్రంవారు కాదని.. కొంతమంది వారిని ఛత్తీ్‌సగఢ్ నుంచి తీసుకొచ్చి రాత్రివేళ అడవులను నరికిస్తున్నారని, అధికారులను చంపేందుకూ వెనుకాడడం లేదని సీఎం అన్నారు. ‘‘అటవీ భూములను కొట్టేసి మాకు ఇవ్వండంటే ఎలా ఇస్తారు? ఇది పూర్తిచట్ట వ్యతిరేకం. ప్రభుత్వం దయతలిచి ఇస్తే తీసుకోవాలి. గూండాగిరి తగదు. అధికారులు, గిరిజనులు ఎవరి హద్దుల్లో వారుండాలి. గిరిజనుల తరపున మాట్లాడడం, నటించడం కాదు. వారిని, అడవులను రక్షించుకోవాలి’’ అని సూచించారు. అటవీ అధికారి శ్రీనివా్‌సరావు హత్యను ప్రస్తావిస్తూ.. ఇలాంటివి సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ‘‘అటవీ అధికారులను పిలిచి సూచనలు చేస్తాం. గిరిజనులను నియంత్రిస్తామని చెబుతాం. కట్టె పుల్లలు ఏరుకొచ్చి శవ దహనాలు చేసేవారిపై కూడా దౌర్జన్యాలు చేస్తున్న ఉదంతాలున్నాయి. ఇలాంటి చిల్లర ప్రయత్నాలు జరగకుండా అధికారులను నియంత్రిస్తాం. ఇకనుంచి పోడు, అటవీ దురాక్రమణ ఉండదు. అనవసరంగా దౌర్జన్యం చేయొద్దని చెబుతాం’’ అని తెలిపారు.
రాజకీయం చేస్తామంటే కుదరదు..
పోడు భూములపై రాజకీయాలు చేస్తామంటే కుదరదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయాలకు 66 అంశాలు ఉన్నాయి.. కొన్ని పార్టీలు అదే పనిగా ధర్నాలు చేస్తుంటాయి. దీనిని పెద్ద డ్రామాగా మార్చారు. మా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప (సిర్పూర్ కాగజ్‌నగర్) ఈ విషయంలో జోక్యం చేసుకుంటే అధికారులు కేసు పెట్టి జైలుకు పంపారు’’ అని గుర్తుచేశారు.
కొన్ని పార్టీలకు ఆట వస్తువు.. మాకు కాదు
పోడు, అటవీ భూముల అంశాలు కొన్ని పార్టీలకు ఆట వస్తువుల్లా మారాయని, తమకు మాత్రం ప్రత్యేక విధానం ఉందని కేసీఆర్ అన్నారు. ‘పోడు భూములంటే గిరిజనుల హక్కులా మీరు మాట్లాడుతున్నారు. హక్కు కాదది, దురాక్రమణ అని భద్రాచలంలో పొదెం వీరయ్యకు చెప్పాను. అడవి బిడ్డలం మాకియ్యాలి.. అంటే మొత్తం అడవులను నరికేస్తే పీడ పోతుంది కదా? అడవంతా కొట్టేసి పంచేద్దాం’ అని సీఎం వ్యాఖ్యానించారు. కొందరు మాట్లాడితే నలుగురిని వెంటేసుకుని, జెండాలు పట్టుకుని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయడం, హీరోల్లా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ‘ఎమ్మెల్యేలుగా మనపై ఓ బాధ్యత ఉంటుంది. గిరిజనులు అడవి బిడ్డలు. వారి హక్కులు కాపాడాల్సిందే. వాళ్లపై ఎవరూ దౌర్జన్యం చేయకుండా చూడాల్సిందే. కానీ, అటవీ సంపద ఉండాలా? కనుమరుగు కావాలా? బ్రెజిల్, చైనా తర్వాత చాలా నిబంధనలు పెట్టి, సర్పంచులు, కౌన్సిలర్లు, చైర్మన్లకు ఉద్యోగాలు పోతాయని చెబుతూ ఇదే సభలో చట్టం చేసి, పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్ కాలం పెడితే తప్ప మొక్కలు నాటే పరిస్థితి రాలేదు. అడవులు ఎవరి పుణ్యాన నాశనమయ్యాయో అందరికీ తెలుసు. ఎన్నో సినిమా షూటింగులు జరిగే నర్సాపూర్ అడవి ఎలా ఎడారిగా మారిందో చూశాం. అలాంటి అడవులను పునరుజ్జీవింపజేయాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. దానికి అనేక అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కేంద్ర అటవీ శాఖ, ఇతర అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో 7.8 శాతం గ్రీన్ కవర్ పెరిగిందంటూ ప్రశంసించాయి’ అని కేసీఆర్ వివరించారు.
పోడు పట్టాలు సాధించుకున్నాం: కోనప్ప
పోడు భూములకు పట్టాలపై శాసనసభలో సీఎం ప్రకటన అనంతరం లాబీల్లో కొందరు మీడియా ప్రతినిధులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను కలిశారు. కేసీఆర్ నిర్ణయంపై స్పందన ఏమిటని అడగ్గా.. ‘ఎన్ని గొడవలు చేసినా.. అరెస్టులు అయినా చివరికి పోడు పట్టాలనైతే సాధించుకున్నాం కదా?’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎస్టీల్లో చేర్చడంపై సీఎంకు ధన్యవాదాలు
కొన్ని కులాలను ఎస్టీల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసినవారిలో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల), డాక్టర్ అబ్రహాం (అలంపూర్), వెంకటేశ్వరరెడ్డి (దేవరకద్ర), హర్షవర్థన్‌రెడ్డి (కొల్లాపూర్) ఉన్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రకటన చేయడంపై పోడు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల ప్రజాప్రతినిధులు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోనప్ప, దుర్గం చిన్నయ్య రేఖానాయక్, రాథోడ్ బాపూరావు, విఠల్‌రెడ్డి ఆత్రం సక్కు తదితరులు సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - 2023-02-11T03:55:07+05:30 IST