Murders: చిన్న కారణాలకే చంపేస్తున్నారు
ABN, First Publish Date - 2023-07-19T03:57:59+05:30
చిన్న చిన్న కారణాలు.. క్షణికావేశంలో హత్యలు జరుగుతున్నాయి. కత్తులు, తల్వార్లు మాత్రమే కాకుండా తుపాకులతో సైతం దాడులు చేస్తూ నిండు ప్రాణాలను బలిగొంటున్నారు.
క్షణికావేశంలో నేరాలు
కుటుంబాలకు శోకాలు మిగులుస్తున్న కొందరు
బీదర్‌కు చెందిన యువతి.. ఢిల్లీకి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో షెల్టర్ తీసుకొని ఉన్నారు. వారి వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో ఎలాగైనా సంపాదించాలనే ఆలోచనతో ఏకంగా ఓ మర్డర్ ప్లాన్ చేశారు. ప్లాన్‌లో భాగంగా అఫ్జల్‌గంజ్ నుంచి బీదర్ వరకు ట్యాక్సీ మాట్లాడుకొని బయలుదేరారు. దారిలో మరొకరు కారులో కూర్చున్నారు. సగం దూరం వెళ్లిన తర్వాత ఏదో సాకుతో కారు ఆపిన యువతి బయటకు వెళ్లిపోగా... కారులో ఉన్న మిగతా ఇద్దరు కారు డ్రైవర్‌ను వైరుతో గొంతుబిగించి హతమార్చారు. ఆ కారును తీసుకొని స్ర్కాప్ గోడౌన్‌లో విక్రయించగా రూ. 14వేలు లభించాయి. ఇలా ఓ హత్య చేసిన ఆ ముగ్గురికి దక్కింది కేవలం రూ. 14వేలు మాత్రమే. కానీ ఆ డ్రైవర్ మరణం ఓ కుటుంబానికి తీరని లోటు.
ఏడాది క్రితం...
ఏడాది క్రితం... జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన స్కూటీ ఢీకొట్టింది. సాధారణ ప్రమాదమే.. అయినా వెనుక స్కూటీపై ఉన్న వ్యక్తికి ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. చేతికి అందిన రాయితో కారులో ఉన్న వ్యక్తి తలపై కొట్టాడు. ఊహించని దాడికి ఆ వ్యక్తి అక్కడే కుప్పకూలాడు. కోమాలోకి వెళ్లి నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయాడు.
హైదరాబాద్ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): చిన్న చిన్న కారణాలు.. క్షణికావేశంలో హత్యలు జరుగుతున్నాయి. కత్తులు, తల్వార్లు మాత్రమే కాకుండా తుపాకులతో సైతం దాడులు చేస్తూ నిండు ప్రాణాలను బలిగొంటున్నారు. ఆగ్రహం, క్షణికావేశపు ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మద్యానికి బానిసై విచక్షణ కోల్పోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా దాడులకు తెగబడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబాలు తమలోని ఒకరిని కోల్పోతుండగా, నేరాలు చేసిన వారు జైలు పాలు కావాల్సి వస్తోంది.
లాక్‌డౌన్ సమయంలో ..
లాక్‌డౌన్ సమయంలో స్నేహితుడు ఆపదలో ఉన్నాడని మరో స్నేహితుడు అప్పు ఇచ్చాడు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత.. తన అప్పు తీర్చాలని స్నేహితుడు కోరాడు. తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వడం ఇష్టం లేని యువకుడు ఏకంగా తన స్నేహితుడినే కడతేర్చాడు. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని పిల్లర్ నంబర్ 223 వద్ద నడి రోడ్డుపై మరో ఇద్దరు స్నేహితులతో కలిసి దాడి చేసి హతమార్చాడు.
ఓ యువకుడు బీరు సీసాలు తీసుకొని వెళ్తుంటే అతని వద్ద ఉన్న సీసాల కోసం కత్తులతో దాడి చేశారు. తీవ్రగాయాలైన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మీర్‌పేట్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. టప్పా చబుత్ర పీఎస్ పరిధిలోనూ చిన్న వివాదం కారణంగా విద్యార్థుల మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చి ఒకరికొకరు దాడులకు పాల్పడ్డారు.
Updated Date - 2023-07-19T03:57:59+05:30 IST