Dr. Hanumantha Rao: నెరవేరని చిరకాల కోరిక
ABN, First Publish Date - 2023-01-28T07:23:35+05:30
మానవ సేవే.. మాధవ సేవ అనే పదానికి పరమార్థంగా నిలిచారు. ఆయన సేవలకు పద్మశ్రీ
హైదరాబాద్/మారేడుపల్లి: మానవ సేవే.. మాధవ సేవ అనే పదానికి పరమార్థంగా నిలిచారు. ఆయన సేవలకు పద్మశ్రీ వరించింది. ఆయనే డాక్టర్ పసుపులేటి హనుమంతరావు. కేంద్ర ప్రభుత్వం తన సేవలను గుర్తించి పద్మశ్రీ ప్రకటించడం సంతోషమే అంటున్న ఆయన తన చిరకాల కోరిక నెరవేరలేదని అన్నారు. నగరంలో చదువును అభ్యసించిన ఆయన కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. ఉస్మానియా వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే పునరావాసం, సరైన శిక్షణ అందిస్తే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సైతం సాధారణ జీవితం గడిపే అవకాశం ఉందని గుర్తించారు. ఈ క్రమంలోనే పికెట్ జూబ్లీ బస్‌స్టేషన్ సమీపంలో 1977లో ఐదుగురు బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న పిల్లల కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వీకార్ అకాడమీ నెలకొల్పారు. 45 సంవత్సరాలుగా లక్షల మంది దివ్యాంగులకు సేవలు అందిస్తున్నారు.
హనుమంతరావుకు ఆరు గౌరవ ప్రెసిడెంట్ అవార్డులతో పాటు 37 రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. శుక్రవారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ‘‘స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా ఇప్పటికే 85.75 లక్షల మందికి చికిత్సను అందించడం గర్వంగా ఉంది. ప్రత్యేక సమస్యలున్న పిల్లలకు వైద్యం అందించేందుకు 30 కోర్సుల ద్వారా 8 వేల మంది డాక్టర్లను తయారు చేశాను. పద్మశ్రీ వచ్చిన్నప్పటికీ చిరకాల కోరిక నెరవేరలేదు. స్పెషల్ పిల్లల కోసం యూనివర్సిటీ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్సె్‌సను రాష్ట్రంలో నెలకొల్పాలనేదే ఆ కోరిక. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఈ విషయమై గతంలో పలు మార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరినా ఫలితం కనిపించ లేదు.’’ అన్నారు.
Updated Date - 2023-01-28T07:23:38+05:30 IST