BRS Election: ఎన్నికల సంక్షేమం!
ABN, First Publish Date - 2023-06-12T02:57:19+05:30
పదేళ్లుగా రాష్ట్రంలో ‘ఎన్నికల సంక్షేమం’ అమలవుతోంది. అంటే, ఉప ఎన్నికలో, సాధారణ ఎన్నికలో వచ్చినప్పుడు మాత్రమే కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడమో.. ఉన్న వాటిని అమలు చేయడమో జరుగుతోంది. మిగిలిన సందర్భాల్లో సంక్షేమం పడకేస్తోంది.
ఉప ఎన్నికలో, సాధారణ ఎన్నికలో వస్తేనే పథకాలకు మోక్షం
పింఛన్ల అర్హత వయసును తగ్గిస్తామని ముందస్తుకు ముందు హామీ
మూడున్నరేళ్ల తర్వాత మునుగోడు ఉప ఎన్నిక ముందు అమలు
ఆ వెంటనే ఆసరా వెబ్‌సైట్ క్లోజ్.. ఇప్పటికే 2 లక్షల దరఖాస్తులు పెండింగ్
హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు దళిత బంధు.. తర్వాత నత్తనడక
మునుగోడు ఉప ఎన్నిక ముందు ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ప్రకటన
ఎనిమిది నెలలు దాటినా ఇప్పటి వరకూ అమలు చేయకుండా జాప్యం
కేసీఆర్ కిట్ నగదు ప్రోత్సాహకాలు 400 కోట్లు మూడేళ్లుగా బకాయిలే
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఫీజులు, ఉపకార వేతనాలు అన్నీ ఇంతే
దేవుళ్లకిచ్చిన హామీలూ అటకపైకే!
వివిధ వర్గాల ప్రజల తరహాలోనే కొందరు దేవుళ్ల సంక్షేమాన్ని పట్టించుకుంటున్న సీఎం కేసీఆర్.. మరికొందరు దేవుళ్లను మాత్రం విస్మరిస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. మేడారం మహా జాతరకు 2018 ఫిబ్రవరి 2న కుటుంబ సమేతంగా హాజరైన కేసీఆర్.. విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచం అబ్బుర పడేలా జాతరను గొప్పగా జరుపుకొందామన్నారు. బడ్జెట్ (2018)లో రూ.200 కోట్లు కేటాయిస్తానన్నారు. జాతర ప్రాంతం ఇరుకుగా ఉందని, ప్రస్తుతం ఉన్న గద్దెల సాలారాన్ని ఎకరం వరకు విస్తరిస్తామని చెప్పారు. జాతర నిర్వహణకు 200 ఎకరాలు సేకరిస్తామని, జంపన్న వాగులో నీరు నిల్వ ఉండేలా ఆనకట్ట కట్టి, అక్కడి నుంచే డ్రింకింగ్ వాటర్‌ను ఫిల్టర్ చేసి భక్తులకు అందేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని హామీ ఇచ్చారు. 20 రోజుల్లో మళ్లీ మేడారం వస్తానని, కుర్చీ వేసుకొని కూర్చొని భూసేకరణ పూర్తి చేస్తానని మాటిచ్చారు. వెంటనే అధికారులు డీపీఆర్‌ను రూపొందించి సీఎంవోకు పంపారు. దాదాపు ఐదేళ్లుగా అది సీఎంవోలోనే మూలుగుతోంది. వన దేవతల సాక్షిగా ఇచ్చిన హామీ అటకెక్కింది.
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): పదేళ్లుగా రాష్ట్రంలో ‘ఎన్నికల సంక్షేమం’ అమలవుతోంది. అంటే, ఉప ఎన్నికలో, సాధారణ ఎన్నికలో వచ్చినప్పుడు మాత్రమే కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడమో.. ఉన్న వాటిని అమలు చేయడమో జరుగుతోంది. మిగిలిన సందర్భాల్లో సంక్షేమం పడకేస్తోంది. ఆ సమయంలో సంక్షేమ పథకాల అమలుకు కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ఒకవేళ, తీసుకున్నా వాటిని మంజూరు చేయడం లేదు. సరికదా.. ఆయా సంక్షేమ పథకాలకు సంబంధించిన బిల్లులు నెలలు, ఏళ్ల తరబడి పెండింగులో పడిపోతున్నాయి. మళ్లీ ఏదో ఒక ఎన్నిక వస్తేనే వాటికి మోక్షం లభిస్తోంది. ఉదాహరణకు, వృద్ధాప్య పింఛను అర్హత వయసును తగ్గిస్తామని గత ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పారు. దాంతో, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మళ్లీ గెలిచింది. 2019 జనవరిలో సర్కారు కొలువుదీరింది. అప్పటి నుంచి పెద్దఎత్తున వృద్ధులు పింఛను కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఏడాది, ఏడాదిన్నరపాటు వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు.
ఆ తర్వాత వాటిని కూడా తీసుకోవడం మానేశారు. చివరికి, మూడున్నరేళ్ల తర్వాత.. మునుగోడు ఉప ఎన్నిక ముందు 2022 ఆగస్టులో జరిగిన క్యాబినెట్ సమావేశంలో 10 లక్షల ఆసరా పింఛన్లు ఇవ్వడానికి ఆమోద ముద్ర వేశారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుక పేరిట 9.46 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి పాలు కావడంతో మునుగోడు ఉప ఎన్నిక ముందు పింఛన్లకు ఆమోద ముద్ర వేశారనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. ఇక, అప్పటి నుంచి మళ్లీ పింఛను కోసం దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌ను మూసివేశారు. మునిసిపల్, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ దరఖాస్తులు తీసుకోవడం లేదు. ఒకవేళ, కొన్నిచోట్ల తీసుకున్నా వాటిని మంజూరు చేయడం లేదు. ఇలా మళ్లీ 2 లక్షల వరకూ దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 26,836 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. దివ్యాంగ, వితంతు పింఛన్లకు సంబంధించి దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే.. పింఛను కింద ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచారు. కానీ, ఎప్పటికప్పుడు పింఛన్లు ఇవ్వడం లేదు. అంతేనా.. పింఛను వయసును 57 ఏళ్లకు తగ్గించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, చివరికి ఇచ్చేది 60 ఏళ్లు దాటిన తర్వాతే. ఉదాహరణకు, 2019లో 58 ఏళ్ల వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే అతనికి 2022లో పింఛను మంజూరు చేశారు. ఇలా పింఛను మంజూరు చేయడం ఆలస్యం అవుతుండడంతో రాష్ట్రంలో ఎవరికైనా 60 ఏళ్లు దాటిన తర్వాతే పింఛను అందుతోంది.
నిజానికి, తెలంగాణ ఆవిర్భవించేనాటికి రాష్ట్రంలో 29,21,282 మంది పింఛనుదారులు ఉన్నారు. కాలక్రమంలో కొంత మంది చనిపోయారు. అలా మరణించిన వారి బదులు కూడా మరొకరికి పింఛను ఇవ్వలేదు. నెలలు, ఏళ్లు గడిచిన తర్వాత మాత్రమే ఇతరులకు పింఛన్లు మంజూరు చేస్తున్నారు. ఇక, వృద్ధులకు పింఛన్ ఇవ్వడం మినహా వారికి అవసరమైన ఇతరత్రా సౌకర్యాలు, తమ బిడ్డల నుంచి ఎదురయ్యే మెయింట్‌నెన్స్ అంశాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. తల్లిదండ్రుల పోషణను పట్టించుకోని పిల్లలపై వృద్ధులు నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలను పట్టించుకోవడం లేదన్న కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో గతంలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకోగా, మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలంటూ వృద్ధులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అలాగే, దళిత బంధు పథకాన్ని కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు తెరపైకి తీసుకొచ్చింది. ఉప ఎన్నికకు ముందే ఆ నియోజకవర్గంలో సంతృప్త స్థాయిలో అందరికీ అమలు చేసింది. ఆ తర్వాత ఆ పథకం నత్తనడకన సాగుతోంది. ఇక, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో గొర్రెల పంపిణీ పథకం బదులు నగదు బదిలీ చేస్తామని ప్రకటించింది. ఉప ఎన్నికల తర్వాత ఆ ఊసే మరిచిపోయింది. అంతేనా, మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే టీఎ్‌సఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసే కసరత్తు మొదలైందని ప్రకటించింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అమలుకు అనుమతి కోరుతూ ఎన్నికల కమిషన్‌కు రోడ్లు భవనాలు, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు లేఖ రాశారని, అనుమతి వచ్చిన వెంటనే ప్రకటన ఉంటుందని వెల్లడించింది. మునుగోడు ఉప ఎన్నిక పూర్తయి ఎనిమిది నెలలు దాటుతోంది. ఇప్పటి వరకూ ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయలేదు.
స్వయం ఉపాధి పథకాలకు చెల్లుచీటీ
వివిధ వర్గాలకు భారీ పథకం ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్.. అప్పటి వరకూ వారికి అందుతున్న చిన్న చిన్న పథకాలకు చెల్లుచీటీ ఇచ్చేస్తున్నారు. అదే సమయంలో, ఆ భారీ పథకాన్ని సంతృప్త స్థాయిలో అమలు చేయడం లేదు. దాంతో, వివిధ వర్గాల యువత ఇబ్బంది పడుతోంది. ఉదాహరణకు, రైతు బంధును ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. అప్పటి వరకూ వారి సంక్షేమానికి అమలవుతున్న మిగిలిన పథకాలను నిలిపివేసింది. యాంత్రీకరణలో సబ్సిడీలు; విత్తన సబ్సిడీ, సున్నా వడ్డీ పథకం తదితరాలను ఎత్తేసింది. అలాగే, దళిత బంధును తెరపైకి తెచ్చిన సర్కారు.. దళితులకు కార్పొరేషన్ల ద్వారా గతంలో ఇచ్చిన రుణాల పథకాన్ని పక్కనబెట్టింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ల ద్వారా ఖర్చు చేయాల్సిన మొత్తాన్నీ విడుదల చేయడం లేదు. రాష్ట్రంలో 52 శాతంగా ఉన్న బీసీలను ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోంది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వారికి గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి వరకూ ఫెడరేషన్లకు చైర్మన్లు, పాలక మండళ్లను నియమించలేదు. బీసీ సబ్ ప్లాన్‌ను ఏర్పాటు చేయలేదు. స్పెషల్ ప్లాన్‌ను ప్రకటించినా దాని ఊసు ఎత్తడం లేదు.
కాళేశ్వరం ఆలయ అభివృద్ధి ఏదీ..?
మేడారం జాతర అభివృద్ధి తరహాలోనే కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి మోక్షం లభించటం లేదు. 2019 జనవరి 1, 2 తేదీల్లో కాళేశ్వరంలోనే సీఎం కేసీఆర్ బస చేశారు. కుటుంబ సమేతంగా కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే కాళేశ్వరాలయం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు మొదటి విడతలో రూ.100 కోట్లు ఈ బడ్జెట్(2019)లో కేటాయిస్తా.. వంద నుంచి రెండొందల ఎకరాల భూమిని సేకరించి కాటేజీలు, గార్డెన్లు, గోశాలలు, వేద పాఠశాలలు నిర్మాణం చేపడతా’ అని హామీ ఇచ్చారు. అదే ఏడాది 2019లో బడ్జెట్‌లో పైసా నిధులు కూడా కాళేశ్వరం ఆలయాభివృద్ధికి కేటాయించలేదు. ప్రతి బడ్జెట్‌లోనూ భక్తులు ఎదురుచూస్తున్నా నిధుల కేటాయింపు జరగడం లేదు. భూసేకరణకు ఊసే లేకుండా పోయింది. ఇక, యాదాద్రికి పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్ భద్రాద్రిపై శీతకన్ను వేశారు.
- ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి
దివ్యాంగులపై శీతకన్ను
ప్రస్తుతం దివ్యాంగులకు ఇస్తున్న రూ.3,016 పింఛన్‌కు అదనంగా మరో రూ.1000 పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించారు. కానీ, రాష్ట్రంలోని సగం మంది దివ్యాంగులకే పింఛన్లు అందుతున్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రంలో 10.48 లక్షల మంది దివ్యాంగులున్నట్టు తేలింది. కానీ, రాష్ట్రంలో కేవలం 5.90 లక్షల మంది దివ్యాంగులకే పింఛను అందుతోంది. వారికి కూడా నెలా నెలా పింఛన్ అందడం లేదు. సమయానికి పింఛన్ అందకపోవడంతో దివ్యాంగులు అప్పు చేసి మరీ తమకు అవసరమైన మందులు కొనుగోలు చేసుకుంటున్నారు.
ఇక, దివ్యాంగులు పింఛన్ పొందాలంటే అవసరమైన సదరం సర్టిఫికెట్ జారీ విషయంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒకవేళ సదరం సర్టిఫికెట్ వచ్చినా పింఛన్ అందడంలో ఆలస్యమవుతోంది. దీంతో, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద దాదాపు 2.50 లక్షల మేర దివ్యాంగుల పింఛన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే, దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా శాఖను ఏర్పాటు చేసినా ఇప్పటికీ జిల్లాల్లో ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా కార్పొరేషన్ ద్వారా అందాల్సిన సాయమూ వీరికి అందడం లేదు. కార్పొరేషన్ ద్వారా రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు అందించే సాయం అటకెక్కింది. దివ్యాంగులకు ప్రభుత్వ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినా.. అమలుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అలాగే, రాష్ట్రంలోని అనాధలకు ప్రభుత్వమే తల్లీ, తండ్రిగా ఉంటుందని, దేశం గర్వించేలా, ఇతర రాష్ట్రాలు అనుసరించేలా అనాధల కోసం ఓ కొత్త విధానాన్ని రూపొందించాలంటూ సీఎం కేసీఆర్ మహిళా, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ ఇంతవరకూ రాష్ట్రంలో ఎంతమంది అనాధలున్నారనే అంశాన్ని తేల్చలేదు. సరికదా.. కొత్త విధానమూ రూపొందించలేదు. దీనిపై ప్రతిపక్షాలు ప్రశ్నించినా కిమ్మనడంలేదు.
బకాయిల సంక్షేమం
ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం చూసినా ఏమున్నది గర్వకారణం.. ఏ ప్రభుత్వ పథకానికైనా బకాయిలే సమస్తం అన్నట్లు తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. ఫీజు రీయింబర్స్‌మెంట్ నుంచి మెస్ చార్జీల వరకూ అన్నీ పెండింగే. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం గురించి ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. కానీ, ఈ పథకం కింద ఇప్పటి వరకూ రూ.850 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ పథకానికి బడ్జెట్లో నిధులను కేటాయిస్తున్నా ఆ మేరకు విడుదల చేయడం లేదు. నిజానికి, పెళ్లికి ముందే ఈ పథకం కింద నిధులు అందాలి. కానీ, పెళ్లయిన తర్వాత ఏడాదికి కూడా డబ్బులు అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రస్తుతం కల్యాణ లక్ష్మి దరఖాస్తులు పెద్దఎత్తున పెండింగులో ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ నియోజకవర్గాల్లో మంజూరైన అన్ని కళ్యాణలక్ష్మి చెక్కులను ఎన్నికల ముందు ఇద్దామనే ఆలోచనలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు కూడా మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. సర్కారు ఘనంగా చెప్పుకొనే కేసీఆర్ కిట్ (అమ్మకు సాయం) పథకానిది కూడా ఇదే పరిస్థితి. పథకంలో భాగంగా ఆడపిల్ల పుడితే రూ.13 వేలు; అబ్బాయి పుడితే రూ.12 వేలు ఇస్తున్నట్లు గొప్పలు చెబుతోంది. కానీ, ఈ పథకం కింద నగదు ప్రోత్సాహకాలను రెండేళ్ల నుంచి చెల్లించడం లేదు.
హనుమకొండ వంటి కొన్ని జిల్లాల్లో మూడేళ్లుగా బకాయిలు పేరుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద రూ.400 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.87 కోట్లు; ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.85 కోట్లు; ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.9.72 కోట్లు; ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.రూ.27 కోట్లు; ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.10.18 కోట్లు; ఖమ్మం జిల్లాలో రూ.54 కోట్లు; నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో దాదాపు రూ.20 కోట్ల చొప్పున పెండింగులో ఉన్నాయి. అలాగే, విదేశీ విద్య కోసం చేసుకున్న దరఖాస్తులకు నిధుల గండం తప్పడం లేదు. ఇవన్నీ ఆర్థిక శాఖ వద్దే పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఇక, విద్యార్థుల స్కాలర్ షిప్‌లు, ఉపకార వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఫలితంగా కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. 2019-20 ఏడాది నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.4 వేల కోట్ల మేర బకాయిలున్నాయి. వీటికి సంబంధించి 2020-21లో కొంతమేర చెల్లింపులు చేసినా.. అవిపోను మళ్లీ రూ.4 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. ఒక్క 2022-23లోనే రూ.2,250 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దాంతో, అప్పో సప్పో చేసి తల్లిదండ్రులు తొలుత ఆ బకాయిలను చెల్లించాల్సి వస్తోంది. ఇది, వారికి తీవ్ర ఆర్థిక భారంగా మారుతోంది.
ఏళ్లు గడుస్తున్నా సాయం అందలేదు
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 2020 నవంబరు 23వ తేదీన డెలివరీ అయింది. పాప పుట్టింది. డెలివరీ సమయంలో ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా సర్కారు ఆర్థిక సాయం అందలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నాం.
- జుర్రు శ్యామల, పోతారం, సారంగపూర్ మండలం, జగిత్యాల జిల్లా
నగదు రాలేదు
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 2021 జూన్ 28వ తేదీన ప్రసవం పొందాను. అమ్మాయి పుట్టింది. ఇప్పటికీ ప్రోత్సాహక నగదు రాలేదు. కేసీఆర్ కిట్ మాత్రమే ఇచ్చారు. ఇప్పటివరకు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
- సుంకం తులసి, బుగ్గారం గ్రామం, జగిత్యాల జిల్లా
కాగితాల్లోనే బడ్జెట్..
ఎస్సీలకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు సర్కారు ప్రతీ బడ్జెట్‌లో అంకెలను చూపిస్తూ గారడీ చేస్తోంది. తప్పితే కేటాయింపుల మేర విడుదల చేయడం లేదు. ప్రచార ఆర్భాటం తప్ప.. ఎస్సీలకు ఎలాంటి ఫలాలు అందడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎస్సీల అభివృద్ధికి కేటాయిస్తోన్న నిధులను వారి కోసం ఖర్చు చేయాలి.
- స్కైలాబ్‌బాబు, కేవీపీఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ప్రభుత్వం సమయానికి రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడంతో కాలేజీల నిర్వహణ భారంగా మారుతోంది. విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి బకాయిలను విడుదల చేయాలి.
- గౌరీ సతీశ్, కేజీ టు పీజీ కన్వీనర్
పేదలను మోసం చేస్తున్న ప్రభుత్వం
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలను మోసం చేస్తోంది. ఆసరా పింఛన్ల వయసును 57 ఏళ్లకు తగ్గించి సాయం చేస్తున్నామని చెప్పి మధ్యలో వదిలేసింది. దరఖాస్తుకు కేవలం నెల రోజుల వరకూ మాత్రమే గడువు ఇచ్చింది. ఇప్పుడు చాలామంది అర్హులు ఎదురు చూస్తున్నారు. 2015 గ్రేటర్ ఎన్నికల సమయంలో బోయిగూడలో కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల మాదిరిగా నగరమంతటా కట్టించి ఇస్తామని, లేకపోతే, 2018లో ఓట్లు అడగమని చెప్పారు. ఈ హామీని ఇప్పటికీ నెరవేర్చలేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల ఆశ చూపి ఎన్నికలకు వెళ్లడం, ప్రజలను మభ్యపెట్టడం, తర్వాత వదిలేయడం బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఓట్ల కోసమే రాజకీయం చేస్తూ పేదలను నయ వంచనకు గురి చేస్తోంది.
- శ్రీనివాస్, హైదరాబాద్ నగర సీపీఎం కార్యదర్శి
Updated Date - 2023-06-12T04:00:16+05:30 IST