ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: ఎకరాకు 10 వేలు

ABN, First Publish Date - 2023-03-24T05:22:12+05:30

ఇటీవలి అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎకరానికి రూ.10 వేలు సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పంట నష్ట పరిహారం ప్రకటించిన సీఎం

ఇంత మొత్తం ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి

2,28,258 ఎకరాల్లో నష్టం.. రూ.228 కోట్లు మంజూరు

కౌలు రైతుకూ న్యాయం చేస్తాం.. సాగులో ఉన్నవారికే సాయం

కేంద్రం పైసా ఇవ్వట్లేదు.. పంట నష్టంపై నివేదిక ఇవ్వబోం

గతంలో జరిగిన నష్టానికే ఏమీ ఇవ్వలే.. ఏకాణా కూడా అడగం

కేంద్రంలో రాజ్యమేలేది చదువు, సంస్కారం లేని సన్నాసులే

బీమా స్కీంలతో కంపెనీలకే లాభం.. పరిహారంపై జీవో సవరిస్తా

అధైర్యపడకండి.. నేనున్నాను.. ఆదుకుంటా: కేసీఆర్‌

ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటన

దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. అన్నదాతలకు భరోసా

ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, బోనకల్‌, పెద్ద వంగర, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఇటీవలి అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎకరానికి రూ.10 వేలు సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. సాగులో వాస్తవ రైతు ఉంటే అతనికి, కౌలు రైతులుంటే వారికే పరిహారాన్ని ఇస్తామని చెప్పారు. కేంద్ర పథకంలో ఎకరం మొక్కజొన్నకు రూ.3,333 పరిహారాన్ని చూపించారని, వరికి రూ.5400, మామిడికి రూ.7 వేలు సూచించారని, ఇవి రైతులకు ఏ మూలకు సరిపోవని, పెరిగిన పెట్టుబడులు, జరిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని రైతులు కోలుకునేలా ఎకరానికి రూ.10 వేలు అందిస్తామని ప్రకటించారు.

గతంలో పంట నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిహారం కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, దీనికి నిరసనగా ఈసారి నివేదికలను కూడా పంపించబోమని స్పష్టం చేశారు. వర్షాలు, ఈదురు గాలులు, వడగళ్లకు ధ్వంసమైన పంటలను పరిశీలించేందుకు గురువారం ఆయన ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటించారు. తొలుత, ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతల గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని వట్టికొండ రామకృష్ణ పొలం పరిశీలించారు.

అక్కడి నుంచి గార్లపాడు గ్రామానికి చేరుకుని కొచ్చర్ల కృష్ణ మొక్కజొన్న చేనును పరిశీలించారు. ఆ తర్వాత మహబూబాబాద్‌ జిల్లా పెద్ద వంగర మండలం రెడ్డికుంట తండాలో దెబ్బతిన్న మామిడి, మిర్చి, మొక్కజొన్న పంటలను పరిశీలించి, రైతులు జాటోతు సోమ్లా నాయక్‌, నెహ్రూ నాయక్‌, చిన్న సోమ్లా నాయక్‌లతో మాట్లాడి నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం, వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురం వెళ్లారు. గ్రామానికి చెందిన భూంపెల్లి రజనీకర్‌రెడ్డి, ఆయన సోదరులకు చెందిన దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు. తమ పదెకరాల మొక ్కజొన్న, వరి, టమాటా తోటలు వడగళ్ల వర్షంతో అక్కరకు రాకుండా దెబ్బతిన్నాయని వారు సీఎంకు వివరించారు. వారి ఆవేదనను ఆలకించిన సీఎం కేసీఆర్‌ ‘అధైర్యపడకండి నేనున్నాను. అండగా నిలిచి ఆదుకుంటా’నని భరోసా ఇచ్చారు.

చివరిగా, కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌, రాంచంద్రాపూర్‌ గ్రామాల్లో దెబ్బతిన్న పంట చేలు, పండ్ల తోటలను సందర్శించారు. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లను తిలకించారు. పర్యటనలో భాగంగా రైతులతోనూ, విలేకరుల సమావేశంలోనూ కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘ఇటీవలి వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 2,28,258 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న, 72,709 ఎకరాల్లో వరి, 8,865 ఎకరాల్లో మామిడి తోటలు, 17,238 ఎకరాల్లో ఇతర పంటలు ఉన్నాయి. ఇందుకు తక్షణ సహాయం కింద రూ.228 కోట్లు వెంటనే మంజూరు చేస్తున్నాం’’ అని వెల్లడించారు. ఉపద్రవాలు ఇప్పుడే అయిపోలేదని, మరో రెండు రోజులు రాళ్లు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెప్పారని, మరింత పంట నష్టం జరగవచ్చని, అయినా, ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

దేశంలో కొత్త వ్యవసాయ విధానం అమల్లోకి రావాలన్నది బీఆర్‌ఎస్‌ విధానమని, తద్వారా పంట నష్టం జరిగితే రైతులు బీమా పాలసీ పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ‘‘ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులను ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ పథకాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. గతంలో చాలామంది మూర్ఖులు వ్యవసాయం దండగ అన్నారు. కానీ, వ్యవసాయం కారణంగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.05 లక్షలకు పెరిగింది. అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది’’ అని వివరించారు. అకాల వర్షాలు, రాళ్ల వానతో దెబ్బతిన్న రైతులకు ధైర్యం చెప్పి, భరోసా కల్పించడానికే తాను వచ్చానన్నారు.

గతంలో ఒక్క రూపాయీ ఇవ్వలేదు

పూర్తిగా రాష్ట్ర నిధుల నుంచే పంట పరిహారం అందిస్తామని, కేంద్రాన్ని ఏకాణా కూడా అడగదల్చుకోలేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ‘‘ఈ సాయంలో కేంద్రానిది ఏమీ లేదు. పంట నష్టాల గురించి కేంద్రానికి నివేదిక పంపించదల్చుకోలేదు. కేంద్రానికి చెప్పినా, దున్నపోతుకు చెప్పినా ఒక్కటే. వాళ్లకు చెప్పినా.. దొంగలు పడ్డాక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కేంద్ర బృందాలు వచ్చి తిరిగి డ్రామాలు చేయడం మినహా ఏకాణా ఇచ్చేది లేదు. కేంద్రంలో చదువు, సంస్కారం లేని సన్నాసులే రాజ్యమేలుతున్నారు. వారికి చెప్పినా కూడా అర్థం కాదు. కనీసం సమస్యలను అర్థం చేసుకునే సంస్కారం వారికి లేదు. ఇప్పటికే రెండు, మూడుసార్లు నివేదికలు పంపించాం. ఎన్నిసార్లు అడిగినా ఏమీ ఇవ్వలేదు. కాబట్టి, అడుక్కున్నట్లు వారి ముందర చేయి చాపినట్లు నిలబడబోం’’ అని విమర్శించారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా ఉందని, దౌర్భాగ్యంగా రాజకీయాలు తప్ప ప్రజలు, రైతుల్ని ఆదుకునే విధానమే లేదని దుయ్యబట్టారు.

దేశంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని, వాటికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకుంటోందని చెప్పారు. తాను హైదరాబాద్‌ నుంచే పరిహారం ప్రకటించవచ్చని, కానీ, రైతుల కష్టాలు, పంట నష్టాన్ని స్వయంగా తెలుసుకుని, రైతులను ఓదార్చాలనే వచ్చానని అన్నారు. మునుపటిలాగా అగో అంటే ఆరు నెలలు కాకుండా త్వరలోనే పరిహారం అందేలా చూస్తానన్నారు. దేశంలో వ్యవసాయ విధానాలు పద్ధతిగా లేవని, బీమా పథకాలు సదరు ఇన్సూరెన్సు కంపెనీలకు లాభాలు కలిగించేలా ఉన్నాయని, పంటలకు నష్టం జరిగినప్పుడు రైతులకు లాభం జరిగేలా లేవని విరుచుకుపడ్డారు.

వరి.. మనకు గర్వకారణం

దేశంలో ఏ రాష్ట్రంలోనూ 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయడం లేదని, ఒక్క మన రాష్ట్రంలోనే 56 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని, ఇదెంతో గర్వకారణమని సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతులు ఏమాత్రం నిరాశకు గురి కావద్దని, ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భగవంతుడు రాష్ట్రానికి ఆర్థిక శక్తినిచ్చాడని, తమ రైతులను తామే కాపాడుకుంటామని చెప్పారు. ఇది నష్ట పరిహారం కాదని, సహాయ పునరావాస చర్యని, పూర్తి పరిహారం ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని కేసీఆర్‌ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రంగాన్ని నిర్వీర్యం కానివ్వబోమని, విపత్తులు వచ్చినప్పుడు రైతుల్ని నిరాశపడనివ్వమని స్పష్టం చేశారు.

పాత జీవోను సవరిస్తాం

పంటలు నష్టపోయినప్పుడు పరిహారానికి సంబంధించి 2015లో ఇచ్చిన జీవోను పూర్తిగా సవరించి రైతులకు అందించే సహాయాన్ని ఎకరానికి రూ.10 వేలుగా పెంచుతామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 2015నాటి జీవోలో పేర్కొన పరిహారానికి, ఇప్పటి పెట్టుబడులకు పొంతన లేదన్న విషయమై ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’ అడిగిన ప్రశ్నకు సీఎం సానుకూలంగా స్పందించారు. కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా కొత్త జీవో తీసుకొస్తామని తెలిపారు. సాగుకు పెట్టుబడులు బాగా పెరిగాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త జీవోలో రైతులకు సహాయం ఉంటుందని వివరించారు. అలాగే, ఖమ్మం జిల్లా బోనకల్‌ ప్రాంతంలో కౌలు రైతులు అధికంగా ఉన్నారని, ఇప్పుడు నష్టపోయిన వారిలో కౌలు రైతులే ఎక్కువని, ఆర్థిక సాయాన్ని వారికి కూడా అందించేలా చూడాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అంతకుముందు ముఖ్యమంత్రికి విన్నవించారు.

Updated Date - 2023-03-24T05:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising