రాష్ట్రంలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమే!
ABN, First Publish Date - 2023-02-16T04:10:25+05:30
అనేక మంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలెవరూ బాగుపడలేదని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
రైతులు, నిరుద్యోగులను మోసం చేశారు
ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్: షర్మిల
నేడు పాలేరుకు వైఎస్ విజయలక్ష్మి
పాలకుర్తి, ఖమ్మం, ఫిబ్రవరి 15: అనేక మంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలెవరూ బాగుపడలేదని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన పాదయాత్ర బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం క్రాస్ రోడ్డు నుంచి తొర్రూరు, లక్ష్మీనారాయణపురం మీదుగా పాలకుర్తికి చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు హరీశ్ రావు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. రైతులకు ఏక కాలంలో రుణమాఫీ అని, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎవరికీ ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు.
‘‘పాలకుర్తికి డిగ్రీ కళాశాల తెచ్చుకోలేనోడు మంత్రి అట’’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును విమర్శించారు. ఇదే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓటుకు నోటుకు కేసులో దొరికిన దొంగ అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అమ్ముడుపోయారని, మళ్లీ ఆ పార్టీకి ఓట్లు వేయడం అవసరమా? అని ప్రశ్నించారు. కాగా వైఎస్సార్టీపీ తెలంగాణ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి గురువారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి రానున్నారు. ఖమ్మం రూరల్ మండలం సాయిగణేశ్ నగర్‌లోని ఓ భవనంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్టీపీ పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించనున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేయనున్న నేపథ్యంలో ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని, విజయలక్ష్మి ఆ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించనున్నారని, షర్మిల వ్యక్తిగత సహాయకుడు రవీందర్‌రెడ్డి తెలిపారు.
కల్లు కమ్మగుంది
పాదయాత్రలో భాగంగా షర్మిల పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలోని కల్లు మండువ వద్దకు షర్మిల వచ్చారు. అక్కడ గూడ రవి అనే గీత కార్మికుడు కల్లు రుచి చూడాలని ఆమెను కోరాడు. తనకు అలవాటు లేదని చెప్పినా పదేపదే అడగడంతో కాదనలేక తాటి ఆకులో అప్పుడే తెచ్చిన కల్లును షర్మిల తాగారు. కల్లు కమ్మగా ఉందన్నారు.
Updated Date - 2023-02-16T04:10:26+05:30 IST