Telangana Mega Textile Park : తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్కు
ABN, First Publish Date - 2023-03-18T03:02:50+05:30
తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మెగా టెక్స్‌టైల్ పార్కులను కేటాయిస్తున్నట్లు తెలిపింది. పీఎం మిత్ర పథకంలో భాగంగా ఈ పార్కులను ఇస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయన్నుట్లు ప్రధాని మోదీ ట్విటర్‌లో వెల్లడించారు.
మరో 6 రాష్ట్రాలకు కూడా మంజూరు.. రూ.4445 కోట్లతో ఏర్పాటు
పీఎం మిత్ర పథకంలో ప్రకటించిన కేంద్రం
మేకిన్ ఇండియాకు గొప్ప ఉదాహరణ: మోదీ
70 వేల కోట్ల పెట్టుబడి.. 20 లక్షల కొలువులు
ఒక్కో పార్కుకు కనీసం 1000 ఎకరాలివ్వాలి
విద్యుత్తు, మౌలిక వసతులు కల్పించాలి
ఈ పనులన్నీ రాష్ట్రాలే చూసుకోవాలి: కేంద్రం
ఈ రాష్ట్రాల్లోనూ..తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర
న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మెగా టెక్స్‌టైల్ పార్కులను కేటాయిస్తున్నట్లు తెలిపింది. పీఎం మిత్ర పథకంలో భాగంగా ఈ పార్కులను ఇస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయన్నుట్లు ప్రధాని మోదీ ట్విటర్‌లో వెల్లడించారు. ఈ పార్కులతో రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని.. మేకిన్ ఇండియాకు ఇదో గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. 13 రాష్ట్రాల నుంచి 18 ప్రతిపాదనలు అందాయని, అందులో ఏడింటిని ఎంపిక చేశామని కేంద్ర జౌళి శాఖ తెలిపింది. కనెక్టివిటీ, ఎకోసిస్టమ్, టెక్స్‌టైల్ విధానం, మౌలిక సదుపాయాలు, ఇతర సేవలను పరిగణనలోకి తీసుకొని పార్కులను ఏర్పాటు చేసే ప్రాంతాలను ఎంపిక చేశామని వివరించింది. వీటి వల్ల విదేశీ పెట్టుబడులు పెరుగుతాయని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది. ఒక్కో పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం వెయ్యి ఎకరాల భూమిని కేటాయించాలని, విద్యుత్తు, నీటి వసతి, వ్యర్థ జలాల నిర్వహణ వ్యవస్థ, సింగిల్ విండో అనుమతులు వంటివి రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాల్సి ఉంటుందని వివరించింది.
ఈ సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ.. పీఎం మిత్ర పథకంలో భాగంగా ఏడు రాష్ట్రాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పూర్తి పారదర్శకమైన పద్ధతిలో ఎంపిక చేశామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్ ఎగుమతిదారుల్లో మనదేశం ఒకటి అని చెప్పారు. ‘‘టెక్స్‌టైల్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సామర్థ్యం మనకు ఉంది. నాణ్యత కూడా ఉంది. ఫామ్ టూ ఫైబర్, ఫైబర్ టూ ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టూ ఫ్యాషన్, ఫ్యాషన్ టూ ఫారిన్ అన్న సూత్రాన్ని పాటిస్తున్నాం’’ అని తెలిపారు. ఒక దగ్గర పత్తి ఉత్పత్తవుతుంటే ఇతర ప్రాంతాల్లో జిన్నింగ్ అవుతోందని, స్పిన్నింగ్ మిల్లులు మరో చోట ఉంటున్నాయని, ఈ సుదీర్ఘమైన ప్రక్రియ వల్ల వృథా ఎక్కువగా ఉంటుందని, వ్యయం కూడా పెరుగుతోందని అన్నారు. ఈ పద్ధతిని మార్చాలని ప్రధాని మోదీ నిర్ణయించారన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడడానికి పెద్దపెద్ద టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రూ.70 వేల కోట్ల పెట్టుబడులు..
రూ.4445 కోట్లతో ఏర్పాటు చేయనున్న మెగా టెక్స్‌లైట్ పార్కుల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు ఉంటాయని గోయల్ తెలిపారు. దాదాపు 20 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వివరించారు. రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. పార్కుల స్థాపన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేస్తామని, కొత్త పార్కులకు అభివృద్ధి మూల వ్యయం కింద రూ.500 కోట్లు చొప్పున, బ్రౌన్‌ఫీల్డ్ పార్కులకు రూ.200 కోట్ల చొప్పున అందిస్తామని ప్రకటించారు. ఇవి కాకుండా ప్రోత్సాహక మద్దతు కింద రూ.300 కోట్ల వరకు అందిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణకు ఐదేళ్లలో రూ.700 కోట్లు!
తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గుర్తించింది. వరంగల్ జిల్లా సంగెం, గీసుకొండ మండలాల పరిధిలోని దాదాపు 3 వేల ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే కేరళకు చెందిన ప్రముఖ టెక్స్‌టైల్ కంపెనీ కైటెక్స్, మలేషియాకు చెందిన యంగ్ వన్ కంపెనీలు భారీ పెట్టుబడులకు సిద్థమయ్యాయి. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును పీఎం మిత్ర పథకంలో చేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఎట్టకేలకు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు మెగా టెక్స్‌టైల్ పార్కులను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రానికి రాబోయే ఐదేళ్లలో రూ.700 కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పార్కులో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందనున్నాయి.
Updated Date - 2023-03-18T03:02:50+05:30 IST