BRS MLC Candidates : ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేశపతి
ABN, First Publish Date - 2023-03-08T02:19:05+05:30
ఎమ్మెల్యేల కోటాలో త్వరలో భర్తీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్‌ఎస్ తరఫున అభ్యర్థులు ఖరారయ్యారు. సీఎం ఓఎస్డీ, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలను అభ్యర్థులుగా బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం ప్రకటించారు.
నవీన్‌కుమార్‌కు మరోసారి చాన్స్
బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కోటాలో త్వరలో భర్తీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్‌ఎస్ తరఫున అభ్యర్థులు ఖరారయ్యారు. సీఎం ఓఎస్డీ, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలను అభ్యర్థులుగా బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం ప్రకటించారు. ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డిల పదవీకాలం ఈ నెలాఖరుకు ముగియనుండటంతో.. 3 స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నవీన్‌కుమార్‌కు మరోసారి ఎమ్మెల్సీగా చాన్స్ దక్కగా.. మిగిలిన రెండు స్థానాలకు దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ఖరారు చేశారు. వీరిని ఈ నెల 9న నామినేషన్ వేయాల్సిందిగా అధినేత సూచించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను సీఎం ఆదేశించారు.
కాగా, తమను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసినందుకు నవీన్‌కుమార్, దేశపతి, వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, ఫారుఖ్ హుస్సేన్‌ల పదవీకాలం మే నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఆ 2 స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. గురువారం క్యాబినెట్ భేటీ తర్వాత వీరి పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థులూ అగ్రకులాలకు చెందినవారే కావడంతో.. గవర్నర్ కోటాలో ఒకరిని ఎస్సీ, మరొకరిని బీసీ సామాజికవర్గానికి చెందినవారికి ఎంపిక చేయనున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే ఎస్సీ వర్గం నుంచి రాజేశ్వర్‌రావుకు మరోసారి అవకాశం దక్కవచ్చని, బీసీ వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌ను ఎంపిక చేయవచ్చని అంటున్నారు.
మలిదశ ఉద్యమంలో.. దేశపతి శ్రీనివాస్
తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ నిర్వహించిన పలు సభలు, సమావేశాల్లో.. కవి, గాయకుడు, వ్యాఖ్యాతగా పాటలు, ప్రసంగాలతో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు దేశపతి శ్రీనివాస్ కృషి చేశారు. సిద్దిపేట జిలా, గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఆయన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తన ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి సీఎం ఓఎస్డీగా కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని దేశపతి అన్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి నవీన్ కుమార్
2001లో టీఆర్‌ఎస్ ప్రస్తుత బీఆర్‌ఎస్ పార్టీ ప్రారంభమైన నాటి నుంచి నవీన్‌కుమార్ క్రియాశీలంగా పనిచేశారు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న నవీన్‌కుమార్ వ్యాపారం, రాజకీయాలతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు.
మాజీ రాష్ట్రపతి మనవడు చల్లా
మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి మనవడు (కూతురి కొడుకు)గా చల్లా వెంకట్రామిరెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2004 నుంచి 2009 వరకు అలంపూర్ ఎమ్మెల్యేగా కొనసాగిన వెంకట్రామిరెడ్డి గత ఏడాది కాంగ్రె్‌సకు రాజీనామా చేసి, కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ క్రమంలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల సీఎం కేసీఆర్‌కు చల్లా కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2023-03-08T02:19:05+05:30 IST