TS News: తెలంగాణ సెక్రటేరియట్‌లోకి రాష్ట్ర రైతాంగానికి నో ఎంట్రీ
ABN, First Publish Date - 2023-05-11T16:04:21+05:30
రాష్ట్ర పరిపాలన కేంద్రమైన తెలంగాణ నూతన సచివాలయం (New Secretariat)లోకి ఎవరెవరికో ప్రవేశం ఉంటుంది కానీ.. ఈ గడ్డకు చెందిన బిడ్డలకు ఉండదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: రాష్ట్ర పరిపాలన కేంద్రమైన తెలంగాణ నూతన సచివాలయం (New Secretariat)లోకి ఎవరెవరికో ప్రవేశం ఉంటుంది కానీ.. ఈ గడ్డకు చెందిన బిడ్డలకు ఉండదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ పనుల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వారిని నిబంధనల పేరిట సెక్రటేరియట్ సిబ్బంది అడ్డుకుంటున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలవారిని సచివాలయ ద్వారాలు బార్ల తెరిచి ఆహ్వానిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ జర్నలిస్టులలో ఎంపిక చేసిన కొందరిని మాత్రమే అనుమతించిన సంగతి ఇంకా మరిచిపోకుండానే... బుధవారం మాల్దీవుల నుంచి వచ్చిన జర్నలిస్టులకు తెలంగాణ సచివాలయం చూపించారు.
గురువారం మహారాష్ట్ర రైతులను (Maharashtra Farmers) ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.).. సెక్రటేరియట్ కొత్త భవనం ఆమూలాగ్రం చూపించే ఏర్పాట్లు చేసింది. అదే భవంతిలోకి రాష్ట్ర రైతాంగానికి మాత్రం ప్రవేశం లేదంటున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పరిపాలన పక్కకుపెట్టి సెక్రటేరియట్‌ను టూరిస్టు ప్లేస్‌గా మార్చేస్తున్నారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
Updated Date - 2023-05-11T16:04:21+05:30 IST