Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతంలో అర్ధరాత్రి భరించలేని వాసన.. రాత్రంతా రోడ్లపైనే జనం జాగారం..!
ABN, First Publish Date - 2023-05-25T11:13:08+05:30
టప్పాచబుత్రలో అర్ధరాత్రి ఘాటైన వాసన రావడంతో కలకలం రేగింది. ప్రమాదకరమైన వాసన కారణంగా రాత్రంతా స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఆ వాసన భరించలేని విధంగా రావడంతో..
హైదరాబాద్: పాతబస్తీలోని టప్పాచబుత్రలో అర్ధరాత్రి ఘాటైన వాసన రావడంతో కలకలం రేగింది. ప్రమాదకరమైన వాసన కారణంగా రాత్రంతా స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఆ వాసన భరించలేని విధంగా రావడంతో టప్పాచబుత్ర, యూసుఫ్‌నగర్, కార్వాన్, నటరాజ్‌నగర్, మహేష్ కాలనీలో భయంతో రాత్రంతా స్థానికులు జాగారం చేయాల్సిన దురదృష్టకరమైన పరిస్థితి వచ్చింది. ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోలేని విధంగా ఆ వాసన రావడం కొసమెరుపు. వాంతులు చేసుకుంటూ చిన్నారులు, మహిళల తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు, డి.ఆర్.ఎఫ్ బృందం ఆ వాసన ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎంత వెతికినా ఈ వాసన ఎక్కడ నుండి వచ్చిందో పోలీసులు గుర్తించలేకపోయారు. సుమారు గంటన్నర తర్వాత వాసన రావడం ఆగిపోయిందని స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి నుంచి వాసన రావడంతో రాత్రంతా రోడ్లపైనే జనం జాగారం చేయడం గమనార్హం. ఆ వాసన ఎక్కడ నుంచి వచ్చిందో, గంటన్నర వ్యవధిలో ఎలా రాకుండా ఆగిందో స్థానికులకు కూడా అర్థం కాలేదు. ఇలాంటి ఘటన జరగడం నగరంలో కొత్తేం కాదు.
గతంలో పారిశ్రామికవాడలకు సమీపంలోని బాలానగర్, జీడిమెట్ల ప్రాంతాలకు సమీపంలోని కొన్ని బస్తీల్లో కూడా ఈ తరహా ఘటనలు హైదరాబాద్ నగరంలో గతంలో చోటుచేసుకున్నాయి. అయితే.. రసాయన వ్యర్థాలు కలవడం వల్ల ఈ తరహా ఘటనలు గతంలో వెలుగుచూశాయి. కానీ.. పాతబస్తీ సమీప ప్రాంతాల్లో ఇలాంటి ఘటన జరగడం మాత్రం ఆ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేసింది.
Updated Date - 2023-05-25T11:13:11+05:30 IST