రూ. 30 లక్షలిచ్చి పోస్టింగ్ కొట్టేశా..!
ABN, First Publish Date - 2023-02-14T03:32:54+05:30
‘‘30 లక్షలు ఇచ్చి, ఈ పోస్టింగ్ కొట్టేశా..! ఉన్నతాధికారులంతా దోస్తులే..! నన్నెవరూ ఏమీ చేయలేరు..
సంపాదనకు ఎవరూ సహకరించడం లేదు..
అధికారులు దోస్తులే.. ఎవరూ ఏమీ చేయలేరు
క్రైం రివ్యూలో ఏసీపీ వ్యాఖ్యలు.
ల్యాండ్ సెటిల్మెంట్లే టార్గెట్.. నేరుగా ఎస్సైలకు ఆదేశాలు
60 కోట్ల ఎన్నారై భూమికి ఎసరు.. 30 లక్షల కమీషన్!
రాచకొండలో సంచలనంగా ఏసీపీ తీరు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ‘‘30 లక్షలు ఇచ్చి, ఈ పోస్టింగ్ కొట్టేశా..! ఉన్నతాధికారులంతా దోస్తులే..! నన్నెవరూ ఏమీ చేయలేరు..! పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు సంపాదించుకోవాలి..! మీరెవరూ సహకరించడం లేదు’’ఇదీ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేసే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్(ఏసీపీ) అన్న మాటలు. తన పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలతో నిర్వహించిన క్రైమ్ రివ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ఇలా లక్షలు ఖర్చుచేసి, బదిలీ అయినట్లు బాహాటంగా చెప్పుకొంటున్న సదరు ఏసీపీ.. గతంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసినప్పుడు శాఖాపరమైన విచారణలు, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవడం గమనార్హం..!
భూవివాదాలంటే.. మహా ఇష్టం
‘‘నేను భారతదేశానికి, భారత రాజ్యాంగానికి విధేయుడినై ఉంటాను. విధి నిర్వహణలో ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా, పక్షపాతం లేకుండా, నిబద్ధత, నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తాను’’ అంటూ ప్రమాణం చేసి, విధుల్లో చేరిన సదరు ఏసీపీ.. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను పూర్తిగా విస్మరించాడు. ఒట్టును తీసి గట్టున పెట్టేశాడు. సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. తన పరిధిలోని రియల్‌ఎస్టేట్ కార్యకలాపాలు జోరందుకున్న ప్రాంతాలపై గురిపెట్టాడు. భూవివాదాలు అంటే.. ఎగిరి గంతేస్తాడు. రెండుపార్టీల నుంచి అందినకాడికి దండుకుని, ఎక్కువ మొత్తం ముట్టజెప్పేవారికి అనుకూలంగా పనిచేస్తాడు. ‘‘రియల్ ఎస్టేట్ సంబంధించిన వివాదాలేమున్నా.. నాకు సమాచారం అందించాల్సిందే’’ అంటూ తన పరిధిలోని ఇన్‌స్పెక్టర్లకు, ఎస్సైలకు హుకుం జారీ చేశాడు. అంతేకాదు.. భూవివాదాలపై డయల్-100కు వచ్చే కాల్స్‌పై స్పందించాలన్నా.. ముందుగా ఈ అధికారికి సమాచారం అందించాల్సిందే..! మూడువారాల క్రితం జరిగిన క్రైమ్ సమీక్షలో.. తన కింది సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాడు.
అంతేకాదు.. ఇన్‌స్పెక్టర్లు మాట వినకుంటే.. నేరుగా ఎస్సైలతో పని చేయించుకుంటున్నాడు. ఇక్కడ బాధ్యతలు స్వీకరించగానే.. అన్ని ఠాణాల్లోని భూవివాదాలపై రివ్యూ నిర్వహించడం గమనార్హం..! పోలీసు ఠాణాకు ఏదైనా కేసులు వస్తే.. ప్రాథమికంగా జనరల్ డైరీ(సీడీ)లో నమోదు చేస్తారు. ఆ డేటాను కూడా ఆయన తనకు పంపాలని ఎస్సైలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. మాట వినని ఎస్సైలను వేధింపులకు గురిచేస్తున్నారని కొందరు సిబ్బంది చెబుతున్నారు. ఈయన వేధింపులతో చాలా మంది మానసికంగా క్షోభకు గురవుతున్నట్లు తెలిసింది. తన పరిధిలోని ఓ ఠాణా ఎస్‌హెచ్‌వో సెలవుపై వెళ్లగా.. ఈ ఏసీపీ అన్నీతానై ప్రతి కేసులో తలదూర్చినట్లు సమాచారం. ఓ కేసు విషయంలో ఉన్నతాధికారులు ఆయనకు మెమో జారీ చేశారు.
రెండుసార్లు క్రమశిక్షణ చర్యలు
సివిల్ వివాదాలే ధ్యేయంగా పనిచేస్తున్న సదరు ఏసీపీ.. గతంలో రెండుసార్లు క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఓ ఠాణాలో ఎస్‌హెచ్‌వోగా పనిచేస్తున్నప్పుడు.. తోటి మహిళా ఉద్యోగిని వేధించారనే ఫిర్యాదు ఉన్నతాధికారులకు అందింది. దీంతో.. అంతర్గతంగా శాఖాపరమైన విచారణ జరిపించిన అప్పటి సీపీ.. క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. రాచకొండలోనూ ఓ ఠాణాలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఆరోపణలు ఎదుర్కొని, క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. అయినా.. ఆ ఏసీపీ తన రూటుమార్చుకోవడం లేదు. సివిల్ వివాదాలకే ప్రాధాన్యమిస్తున్నారు.
ఉన్నతాధికారులతో దోస్తీ?
డీసీపీ నుంచి సీపీదాకా ఉన్నతాధికారులంతా తనకు దోస్తులేనని చెప్పే ఆ ఏసీపీ.. సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని సమాచారం. తనపై ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు ఉండరని, తనను ఎవరూ ఏమీ చేయలేరని బాహాటంగా చెబుతున్నట్లు కొందరు ఎస్సైలు చెబుతున్నారు. అయితే.. భూవివాదానికి సంబంధించి ఓ బాధితుడు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. సదరు ఎస్సైకి చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. అయితే, ఫిర్యాదు చేస్తే ఎక్కడ కొంపలు మునుగుతాయోననే భయంతో.. ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు వెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది.
రూ. 60 కోట్ల భూమి కబ్జాకు సహకారం
ఈ ఏసీపీ పరిధిలో ఓ ఎన్నారైకు 9-14 ఎకరాల భూమి ఉంది. దీని విలువ రూ. 60 కోట్లకు పైనే..! అయితే.. ఓ కబ్జాదారుడు ఆ భూమిపై కన్నేశాడు. భూయజమాని అయిన ఎన్నారైను ఆ స్థలంలో కాలు పెట్టకుండా చేయడానికి ఏసీపీతో రూ. 30 లక్షల డీల్ మాట్లాడుకున్నాడు. నకిలీ పత్రాలను సృష్టించుకునేందుకు తనకు కొంత సమయం పడుతుందని, అప్పటిదాకా ఎన్నారైని కట్టడి చేయాలని కోరాడు. అందుకు సై అన్న ఏసీపీ రంగంలోకి దిగాడు. తన స్థలంలో బౌన్సర్లు ఉండడం.. తనను రానీయకపోవడంపై ఆ ఎన్నారై నేరుగా ఇదే ఏసీపీకి ఫిర్యాదు చేశారు. దాంతో.. ఏసీపీ అతని నుంచి కూడా రూ. 5 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయినా.. బౌన్సర్లను తన భూమి నుంచి పంపకపోవడంతో.. ఆ ఎన్నారై ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది.
Updated Date - 2023-02-14T03:32:55+05:30 IST