YSS:వైఎస్ఎస్ సంగంతో భాగ్యనగరానికి ఆధ్యాత్మిక శోభ
ABN, First Publish Date - 2023-02-04T20:11:35+05:30
ఫిబ్రవరి 12 నుంచి హైదరాబాద్ నగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది.
హైదరాబాద్: ఫిబ్రవరి 12 నుంచి హైదరాబాద్ నగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు స్వామి చిదానంద గిరి భారత పర్యటనలో భాగంగా భాగ్యనగరానికి వస్తున్నారు. ఫిబ్రవరి 12 నుంచి 16 హైదరాబాదులో జరగనున్న 5 రోజుల ఆధ్యాత్మిక సంగమం కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమానికి భారత్‌తో పాటు ప్రపంచం నలుమూలలనుంచి 3500 మంది భక్తులు హాజరౌతారు. సామూహిక ధ్యానాలు, పరమహంస యోగానంద బోధనల ఆధారంగా వైఎస్ఎస్ స్వాములు ఇచ్చే ఆధ్యాత్మిక ప్రసంగాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి. వై.ఎస్.ఎస్. వెబ్ సైట్ ద్వారా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. హాజరుకాలేని భక్తులు, ఆధ్యాత్మిక సాధకులు తమ ఇంటి నుంచి కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. yssi.org/Sangam2023
స్వామి చిదానంద గిరి పరిచయం:
(వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్ అధ్యక్షులు)
స్వామి చిదానంద గిరి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థలకు అధ్యక్షులు. చిదానందకు అంటే, అనంత దివ్యచైతన్యం (చిత్) ద్వారా పరమానందాన్ని పొందడం. ఆయన 40 సంవత్సరాలకు పైగా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసిగా ఉన్నారు. 2009 నుంచి వై.ఎస్.ఎస్, ఎస్.ఆర్.ఎఫ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యులుగా ఉన్నారు. అమెరికా, కెనడా, ఐరోపా, భారతదేశంలో చేసిన పర్యటనలలోనూ, రిట్రీట్ కార్యక్రమాలలోనూ, లాస్ ఏంజిలిస్‌లో జరిగే వార్షిక ఎస్.ఆర్.ఎఫ్. సమావేశాలలోనూ, ఆయన పరమహంస యోగానంద బోధనలు వివరిస్తుంటారు.
స్వామి చిదానంద గిరి తన సన్యాస జీవన ఆరంభం నుంచి మృణాళినీ మాతాజీతో (మాజీ సంఘమాత, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. నాల్గవ అధ్యక్షురాలు) సన్నిహితంగా పనిచేశారు. పరమహంస యోగానంద రచనలు, ఇతర వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్ ప్రచురణల ఎడిటింగ్‌లోనూ, ప్రచురణలోనూ ఆమెకు సహకరించేవారు. ఆ సమయంలోనే ఆమె వద్ద శిక్షణ పొందారు.
స్వామి చిదానంద గిరికి పరమహంస యోగానంద బోధనలతో మొదటి పరిచయం, ఎన్సినిటాస్, కాలిఫోర్నియాలో (అక్కడ ఎస్.ఆర్.ఎఫ్‌కు ఒక రిట్రీట్, ఆశ్రమ కేంద్రం ఉన్నవి) 1970 ప్రథమార్థంలో జరిగింది. అప్పుడు ఆయన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ, ఫిలాసఫీ అధ్యయనం చేస్తున్న విద్యార్థి. 1975లో ఆ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన కొన్ని నెలల తరువాత “ఒక యోగి ఆత్మకథ” ప్రతిని ఆయన చూశారు. 1977లో దరఖాస్తు చేసి ఎన్సినిటాస్‌లోని ఎస్.ఆర్.ఎఫ్. ప్రవేశార్థుల ఆశ్రమంలో చేరారు. ప్రవేశార్థిగా తమ శిక్షణను 1979లో పూర్తి చేశాక మౌంట్ వాషింగ్టన్‌లోని ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. అక్కడ ప్రచురణల విభాగంలో సంపాదకీయ కార్యకలాపాలలో నియమితులయ్యారు.
స్వామి చిదానంద గిరి ఇంతకు ముందు 2007, 2017, 2019 సంవత్సరాలలో భారతదేశాన్ని సందర్శించారు. 2019లో చేసిన భారతదేశ పర్యటనలో నోయిడా, ముంబై, హైదరాబాదు, రాంచీ, దక్షిణేశ్వరంలో పరమహంస యోగానంద వారి క్రియాయోగ బోధనల గురించి వివరించారు. శాస్త్రీయమైన యోగధ్యాన మార్గాన్వేషకులు వేలాది మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామి చిదానంద చేసిన ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రముఖ భారతీయ సమాచార ప్రచురణ సంస్థలు విస్తృతంగా ప్రచురించాయి.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పరిచయం:
భారతదేశంలో వేల ఏళ్ల క్రితం ఆవిర్భవించిన ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక శాస్త్రమైన సార్వజనీన క్రియాయోగ బోధనలను భారతదేశానికి, పొరుగు దేశాలకు అందుబాటులోకి తేవడానికి పరమహంస యోగానంద 1917లో వై.ఎస్.ఎస్‌ను స్థాపించారు. యోగానంద 1920లో పశ్చిమ దేశాలకు వెళ్ళినప్పుడు స్థాపించిన ఎస్.ఆర్.ఎఫ్ ద్వారా ఆయన బోధనలు ప్రపంచ వ్యాప్తంగా అందించబడుతున్నాయి.
క్రియాయోగ ధ్యానశాస్త్రాన్ని, సమతుల్య ఆధ్యాత్మిక జీవనమనే కళను బోధించడానికి ఇంట్లోనే చదువుకునేలా పరమహంస యోగానంద తయారుచేసిన యోగదా సత్సంగ పాఠాల గురించి తెలుసుకోవడానికి దయచేసి సందర్శించండి:
పరమహంస యోగానంద పరిచయం:
ఆధ్యాత్మిక గ్రంథరాజమైన ఒక యోగి ఆత్మకథ రచయిత, యోగదా సత్సంగ సొసైటీ వ్యవస్థాపకులు పరమహంస యోగానంద (1893-1952), ఇటీవలి కాలంలోని ప్రముఖమైన ఆధ్యాత్మికవేత్తలలో ఒకరుగా విస్తృతంగా గౌరవించబడుతున్నారు. భారతదేశపు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి పశ్చిమ దేశాలలో మరింత అవగాహనను, గుర్తింపును తేవడానికి కలకాలం నిలిచేలా ఎంతో దోహదం చేశారు. “పశ్చిమదేశాలలో యోగపితామహుడు”గా పరిగణించబడుతున్న పరమహంస యోగానంద ఆధ్యాత్మికతపై చెరగని ముద్ర వేశారు.
‘‘ఒక యోగి ఆత్మకథ’’ పుస్తక పరిచయం:
అత్యంత ప్రశంసలు పొందిన ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటైన పరమహంస యోగానందుల ‘‘ఒక యోగి ఆత్మకథ’’ ప్రచురణ ఈ ఏడాది 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ పుస్తకం 14 భారతీయ భాషలతో సహా 50 పైచిలుకు ప్రపంచ భాషలలోకి అనువాదమైంది. ఈ రచన పరమహంస యోగానందుల జీవితచరిత్ర మాత్రమే కాక, సమకాలీనులైన గొప్ప ఆధ్యాత్మికవేత్తల గురించిన ఒక మనోహరమైన చిత్రం కూడా. ఇంకా సనాతన వేదాంతము, యోగ శాస్త్రము, ధ్యాన సాంప్రదాయాలకు సంబంధించిన ఒక లోతైన పరిచయం.
YSS website: yssofindia.org
Updated Date - 2023-02-04T20:19:30+05:30 IST