Revanth reddy: కేసీఆర్ ధన దాహానికి మేడిగడ్డ కుంగింది
ABN, First Publish Date - 2023-11-04T15:38:04+05:30
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్ వేరు, నిర్మాణం వేరు కాబట్టే మునిగిపోతున్నాయి. కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ పాపం పండింది. కాళేశ్వరం కోసం తన మెదడును ఖర్చు చేశానని చెప్పిన కేసీఆర్.. లోపాలు
హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) కుటుంబం ఆర్థిక ఉగ్రవాద కుటుంబం అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ కుటుంబాన్ని శిక్షించడానికి కేంద్రం ముందుకు రావాలి. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలి అయింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. కాళేశ్వరంపై జాతీయ స్థాయిలో ఒక కమిటీ వేయాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఆ కమిటీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉండకూడదు. ప్రధాని మోదీ తెలంగాణకి వచ్చినప్పుడు కాళేశ్వరం సందర్శనకు వెళ్లి జరిగిన డ్యామేజ్‌పై చర్యలు తీసుకోవాలి. బండి సంజయ్‌ని అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. అవినీతి వాసనే పడని మోదీ ఈ కంపుని ఎలా బరిస్తున్నారు. మోదీకి కంపు కొట్టకుండా కేసీఆర్ ఏదైనా సెంటు కొట్టి వశీకరణ చేస్తున్నారా?, బీజేపీ అధికారంలోకి రాదు. విచారణ చేయదు. మేమిద్దరం ఒకటే అని కేసీఆర్, మోదీ (PM Modi) చెప్పదలచుకున్నారా?, కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆలోచనలు మారాయి. ఆశలు పెరిగాయి.’’ అని విమర్శించారు.
‘‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్ వేరు, నిర్మాణం వేరు కాబట్టే మునిగిపోతున్నాయి. కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ పాపం పండింది. కాళేశ్వరం కోసం తన మెదడును ఖర్చు చేశానని చెప్పిన కేసీఆర్.. లోపాలు బయట పడగానే తప్పించుకుంటున్నారు. నిర్మాణం నాణ్యత లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి. తప్పు చేసిన వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ప్రాజెక్టుల్లో ఇన్ని లోపాలు బయటపడుతుంటే కేసీఆర్ ఇప్పటిదాకా ఎందుకు నోరు తెరవలేదు. నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ అడిగే ప్రశ్నలకు సమాచారం ఇవ్వడం లేదు. ఈ అంశంపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇన్ని రోజులు కాళేశ్వరం అవినీతిపై ప్రశ్నిస్తే కేసీఆర్ గొప్పతనం ఒప్పుకోలేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎల్ అండ్ టీ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారు. రూ. 80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా అయిందని కేటీఆర్ మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమాధానం ఇస్తూ రూ.86 వేల కోట్ల అంచనా అని 2021లో చెప్పారు. ప్రాజెక్టు కోసం ప్రతి అంచనాలను పెంచారు. కమిషన్లు దొబ్బడానికి కేసీఆర్ ప్రణాళిక బద్దంగా ప్లాన్ వేశారు.’’ అని ఆరోపించారు.
కోదండరాంపై విమర్శలు చేస్తే..
‘‘కోదండరాం గురించి విమర్శలు చేస్తే జాగ్రత్త. కోదండరాంపై విమర్శలు చేసే స్థాయి ఎవరికీ లేదు. కోదండరాంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులకు సిగ్గు రాకపోతే ఎలా?, ప్రాజెక్టుల అంచనాలు, పెంచిన వ్యయం, ఖర్చు ఈ మూడు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.’’ అని రేవంత్ డిమాండ్ చేశారు.
Updated Date - 2023-11-04T15:38:05+05:30 IST