కర్మభూమిలో పుట్టినందుకు మాతృభూమి రుణం తీర్చుకోవాలి
ABN, First Publish Date - 2023-04-22T23:17:03+05:30
దక్షిణా పధ స్టడీస్ ఆధ్వర్యంలో అజ్ఞాత చారిత్రక వీరులపై ఉపన్యాసాల శీర్షికలో రెండవ ఉపన్యాసంగా "రెడ్డి రాజులు " అనే అంశం పై చరిత్ర శాఖాధిపతి , చరిత్రకారుడు శ్రీ అంజయ్య గారు ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు.
హైదరాబాద్: దక్షిణా పధ స్టడీస్ ఆధ్వర్యంలో అజ్ఞాత చారిత్రక వీరులపై ఉపన్యాసాల శీర్షికలో రెండవ ఉపన్యాసంగా "రెడ్డి రాజులు " అనే అంశం పై చరిత్ర శాఖాధిపతి , చరిత్రకారుడు శ్రీ అంజయ్య గారు ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. రెడ్డి రాజులు దాదాపు వంద సంవత్సరాలకు పైగా పరిపాలించారనీ వారి యుద్దాలు విజయాలు వంటి చర్వితచరణ చరిత్ర కాకుండా, ఆ కాలపు సాహిత్యం గమనిస్తే మనకు అనేక కొత్త విషయాలు తెలుస్తాయి అనీ, మనం చరిత్రను చూసే దృక్కోణంలో మార్పు వస్తుందనీ, రావాలనీ అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను రెడ్డి రాజులు కాపాడిన తీరు గమనార్హం అనీ వ్యాపార ఎగుమతుల కోసం రెడ్డి రాజులు ఓడరేవులను ఎలా అభివృద్ధి చేశారో ఇంకొంత అధ్యయనం జరిగితే బాగుంటుందీ అని అభిప్రాయపడ్డారు. ఈ కర్మభూమిలో పుట్టినందుకు మన చరిత్రను మనమే అధ్యయనం చేసుకొని మాతృభూమి రుణం తీర్చుకోవాలి అని పిలుపునిచ్చారు.
సురభారతి సమావేశ మందిరం లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన డా. భిన్నూరి మహేశ్వరి గారు మాట్లాడుతూ, తెలంగాణ చరిత్ర, ఆంధ్ర చరిత్ర, భారతీయ చరిత్ర మొత్తంగా గమనిస్తే అనేక మంది అజ్ఞాత వీరులు మనకు కనిపిస్తారని ఈ విషయంపై ఉపన్యాసాలు మంచి ప్రారంభమనీ పేర్కొన్నారు.. అఙాత చరిత్ర కారులపై అధ్యయనం జరగాలి అని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణా పధ స్టడీస్ అధ్యక్షులు డా. గోపాల్ రెడ్డి గారు, పరిశోధన విభాగం కో-ఆర్డినేటర్ కళ్యాణచక్రవర్తి, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్ధులు, చరిత్ర అధ్యయన కారులు అనేకమంది పాల్గొన్నారు. డా. లక్ష్మీ నారాయణ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
Updated Date - 2023-04-22T23:18:27+05:30 IST