Vijayashanthi : సామాన్య ప్రజలకి ప్రవేశం ఉందా... లేదా?
ABN, First Publish Date - 2023-05-01T12:20:06+05:30
సుమారు రూ.1,000 కోట్ల ప్రజల సొమ్ముతో నిర్మించినట్టు చెబుతున్న తెలంగాణ నూతన సచివాలయంలో ఆ సామాన్య ప్రజలకి ప్రవేశం ఉందా... లేదా? అనేది ఇప్పుడొక మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు.
హైదరాబాద్ : సుమారు రూ.1,000 కోట్ల ప్రజల సొమ్ముతో నిర్మించినట్టు చెబుతున్న తెలంగాణ నూతన సచివాలయంలో ఆ సామాన్య ప్రజలకి ప్రవేశం ఉందా... లేదా? అనేది ఇప్పుడొక మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. ఫేస్‌బుక్ వేదికగా ఆమె నూతన సచివాలయంపై స్పందించారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాసంలో గాని, సచివాలయంలోగాని గత సీఎంలు, మంత్రులు ప్రజల్ని కలుసుకోవడం, వారి సమస్యల్ని ఆలకించి సత్వర పరిష్కారాలు సూచించడం తరచుగా కనిపించేదని వెల్లడించారు. ఇంకా రాములమ్మ మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ వచ్చి కేసీఆర్ గారు సీఎం అయ్యాక ప్రగతి అంతా ప్రగతిభవన్‌కి, ఎర్రవల్లి ఫాంహౌస్‌కి మాత్రమే పరిమితమై ప్రజలు అధోగతి పాలయ్యారు. ఇంకా మంత్రులు సైతం ఆయన బాటలోనే నడిచి ప్రజలకు దూరమయ్యారు. గత తొమ్మిదేళ్లుగా అటు ప్రగతి భవన్‌లో గాని, నాటి సచివాలయంలో గాని ప్రజలకు ముఖం చూపించని కేసీఆర్ గారు ఇప్పుడు కట్టించిన ఈ కొత్త సచివాలయంలోనైనా ప్రజలకు అందుబాటులోకి వస్తారా... ప్రజల్ని లోపలికి రానిస్తారా? అనేది అటు మీడియాలోను, జనసామాన్యంలోను చర్చనీయాంశంగా మారింది. పేద ప్రజల త్యాగాల, కష్టాల, ఉద్యమాల స్వార్జితమైన మన తెలంగాణ రాష్ట్రం ఎందుకో మరల అహంకార, నియంతృత్వ విధాన స్థితికి తీసుకెళ్లబడుతూ మరోపక్క అప్పుల రాష్ట్రం చెయ్యబడుతున్నదని అర్థం అయ్యేట్లు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మనకు ఉందనేది వాస్తవం’’ అని పేర్కొన్నారు.
Updated Date - 2023-05-01T12:20:06+05:30 IST