ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర సర్కారు ఆశలు ఎన్నో!!

ABN, First Publish Date - 2023-02-01T03:31:01+05:30

ఇది ఎన్నికల సంవత్సరం! రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి! ముందస్తు వస్తే.. గిస్తే లోక్‌సభకూ ఎన్నికలు ఉండొచ్చు! దీనికితోడు, తెలంగాణపై బీజేపీ కన్నేసింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు డిమాండ్లు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం..

బడ్జెట్లో రిక్తహస్తాలు చూపుతున్న కేంద్రం

ఏటా అడుగుతున్నా నిధుల కేటాయింపు నిల్‌

ఎన్నికల ఏడాదిలోనైనా పెద్దపీట వేసేనా!?

హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఇది ఎన్నికల సంవత్సరం! రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి! ముందస్తు వస్తే.. గిస్తే లోక్‌సభకూ ఎన్నికలు ఉండొచ్చు! దీనికితోడు, తెలంగాణపై బీజేపీ కన్నేసింది! ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని పావులు కదుపుతోంది! అందుకే, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.. చుడుతున్నారు! ఈ నేపథ్యంలోనే.. బడ్జెట్లో తెలంగాణను కేంద్రం కనికరిస్తుందా!? ఈసారైనా నిధులను విదిలిస్తుందా!? ఎప్పట్లాగే, మొండిచెయ్యి చూపిస్తుందా!? ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రశ్నలివి! రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లోనూ ఇదే ఆందోళన నెలకొంది. ప్రతిసారీ తాము పలు డిమాండ్లను కేంద్రానికి పంపడం, బడ్జెట్‌లో రిక్తహస్తాలను చూపడం పరిపాటిగా మారిందని మండిపడుతున్నాయి. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ సహా పలు పథకాలకు నిధులు కేటాయించాలంటూ ఏటా బడ్జెట్‌కు ముందు తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద పెండింగ్‌లో ఉన్న రూ.1,350 కోట్లను విడుదల చేయాలని కోరుతూనే ఉంది.

రాష్ట్రం కోరే ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానికీ పూర్తి స్థాయిలో నిధులు రావడం లేదు. గిరిజన యూనివర్సిటీకి రూ.10 లేదా రూ.50 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు కొంతమేర నిధులను కేటాయించి కేంద్రం చేతులు దులుపుకొంటోంది. అందుకే ఈసారి పెద్దగా డిమాండ్లు పెట్టకుండా ప్రభుత్వ పెద్దలు ఊరకుండిపోయారు. గత ఏడాది బడ్జెట్‌కు ముందు మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్‌ కేంద్రానికి లేఖలు రాశారు. ఎలాగూ నిధులు ఇవ్వడం లేదన్న నిర్లిప్తతతో ఈసారి ఎలాంటి లేఖలు రాయలేదు. మంత్రి కేటీఆర్‌ మాత్రం రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయాలంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్టవ్‌కు సోమవారం లేఖ రాశారంతే! ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్రమైన వైరం నెలకొంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిధులను కేటాయిస్తుందా అన్న సందేహాలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కోరిన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో బడ్జెట్‌ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ప్రెస్‌ మీట్‌ పెట్టి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈసారి మాత్రం వినతులు ఏమీ చేయలేదు. కేంద్రం వద్ద తమ డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని, నిధులిస్తే చూద్దాం అని ప్రభుత్వం వేచి చూస్తోంది.

రాష్ట్రం డిమాండ్లు ఇవీ..

రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు పేరిట రాష్ట్ర ప్రభుత్వం రూ.40వేల కోట్లతో మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టింది. దీనికి రూ.19,205 కోట్లను కేటాయించాలంటూ నీతి ఆయోగ్‌ సిఫారసు చేసింది. ఈ నిధులను కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్రం ప్రతిసారీ కోరుతోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ పథకాన్ని కొనియాడాయని చెబుతోంది. ప్రత్యేక గ్రాంటు కింద మంజూరు చేయాల్సిన ఈ నిధులపై కేంద్రం ఈసారైనా కనికరిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురై, ఆనవాళ్లు కోల్పోయిన 46,531 చెరువులను పునరుద్ధరించడానికి ప్రభు త్వం మిషన్‌ కాకతీయ పథకాన్ని చేపట్టింది. ఈ పథకానికి రూ.5000 కోట్లు ఇవ్వాలంటూ నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిందని కేంద్రానికి ప్రతిసారీ గుర్తు చేస్తోంది. ఈ నిధులనూ ఇవ్వడం లేదు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని, అదే మాదిరి తెలంగాణలోనూ ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. అయినా, కేంద్రం నుంచి స్పందన లేదు.

వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించే గ్రాంటు కింద రాష్ట్రానికి మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ.1,350 కోట్లు రావాల్సి ఉందని, వీటిని కూడా వెంటనే విడుదల చేయాలని సర్కారు కోరుతోంది. ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున హైదరాబాద్‌ మినహా పాత 9 ఉమ్మడి జిల్లాలకు ఏటా రూ.450 కోట్ల చొప్పున ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిందని గుర్తు చేస్తోంది. దీనికింద 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాలకు సంబంధించి మొత్తం రూ.1,350 కోట్లను కేటాయించాలని పదే పదే అడుగుతోంది. పైగా.. కొత్తగా ఏర్పడిన 32 జిల్లాలకు దీనిని వర్తింపజేయాలని కోరుతోంది.

ప్రత్యేక గ్రాంటు కింద రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.723 కోట్లను కూడా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 2019-20 కంటే 2020-21 సంవత్సరంలో పన్నుల వాటా కింద రాష్ట్రానికి నిధుల కేటాయింపులు తగ్గాయని, ఈ దృష్ట్యా ఆ ఏడాదికి రూ.723 కోట్లను విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించిందని వివరిస్తోంది.

విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా.. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, వెంటనే రూ.5000 కోట్లు ఇవ్వాలని అడుగుతోంది. బయ్యారం స్టీల్‌ ప్లాంటుకు రూ.3000 కోట్లు, ఎయిమ్స్‌, గిరిజన, ఉద్యానవన విశ్వవిద్యాలయాలకు నిధులను కేటాయించాలని కోరుతోంది.

వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు నిధులివ్వాలని, ఐఐఎం, కరీంనగర్‌కు ట్రిపుల్‌ ఐటీతోపాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎ్‌సఈఆర్‌) వంటి కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయాలని అడుగుతోంది.

రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరుతోంది.

రీజినల్‌ రింగు రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌), బీబీనగర్‌ ఎయిమ్స్‌కు మరిన్ని నిధులు కేటాయించాలంటూ ప్రతిసారీ కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తోంది.

జహీరాబాద్‌ నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌), హైదరాబాద్‌ ఫార్మా సిటీకి నిధులు కేటాయించాలని అడుగుతోంది.

Updated Date - 2023-02-01T08:50:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising