weddings: భర్తలతో పాటు భార్యలకు కూడా తప్పడం లేదు..
ABN, First Publish Date - 2023-03-17T01:53:13+05:30
దేశంలో మహిళల వలసలకు ప్రధానంగా పెళ్లిళ్లే కారణమవుతున్నాయి. ఉపాధి వెతుక్కుంటూ భర్తలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండడంతో వారితో పాటే భార్యలు వెళ్లక తప్పడం లేదు.
దేశంలో 93.4% వలసలకు వివాహాలే కారణం
ఒక్క వ్యక్తి వలసల్లో ఐదు, ఆరు స్థానాల్లో తెలంగాణ, ఏపీ
నేషనల్ శాంపిల్ సర్వే’లో వెల్లడి
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): దేశంలో మహిళల వలసలకు ప్రధానంగా పెళ్లిళ్లే కారణమవుతున్నాయి. ఉపాధి వెతుక్కుంటూ భర్తలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండడంతో వారితో పాటే భార్యలు వెళ్లక తప్పడం లేదు. దేశంలోని 87 శాతం మహిళలు వివాహాల కారణంగా వలస వెళ్లాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 93.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 71.5 శాతం మంది మహిళలు పెళ్లి కారణంగా వలస వెళ్లారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన 78వ రౌండ్ ‘నేషనల్ శాంపిల్ సర్వే’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మహిళల వలసలకు ప్రధాన కారణాలేమిటి అన్న కోణంలో ఈ సర్వే జరిగింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్య, పెళ్లిళ్లు, సామాజిక/రాజకీయ సమస్యలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పోషణ.. వీటిలో దేని మూలంగా మహిళలు ఎక్కువగా వలస వెళ్లాల్సి వస్తుందని ఈ సర్వే చేయగా, పెళ్లిళ్లే అందుకు కారణమని తేలింది. ఒక వ్యక్తి 6 నెలలకు మించి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే, దానిని వలస కింద పరిగణిస్తూ ఈ సర్వే చేశారు. దేశంలో ఒక వ్యక్తి(పర్సన్) వలసల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఐదు, ఆరు స్థానాల్లో ఉండగా, మొదటి స్థానంలో హిమాచల్‌ప్రదేశ్, రెండో స్థానంలో పంజాబ్, మూడో స్థానంలో కేరళ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి.
Updated Date - 2023-03-17T09:50:03+05:30 IST