ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Loan waiver 45 Days : 45 రోజుల్లో 20వేల కోట్లు సాధ్యమేనా!?

ABN, First Publish Date - 2023-08-03T03:00:21+05:30

రైతులకు రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తాం.. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఇది.

రుణమాఫీకి నిధులపై సందేహాలు

నాలుగున్నరేళ్లుగా బడ్జెట్‌లో కేటాయింపులే!

పెద్దగా నిధులు ఇవ్వని ప్రభుత్వం

మొత్తంగా విడుదలైంది రూ.1,026 కోట్లే

ప్రస్తుత ఆదాయం నెలకు రూ.12వేల కోట్లు

వేతనాలు, పింఛన్లకే రూ.4 వేల కోట్ల ఖర్చు

మిగతా నిధులతో రుణమాఫీ చేసేదెలా?

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రైతులకు రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తాం.. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఇది. కానీ, రెండో సారి అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా ఆ హామీని ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయించడమే తప్ప.. విడుదల చేసిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 45 రోజుల్లోనే సుమారు రూ.20వేల కోట్ల మేర నిధులు సర్దుబాటు చేయాలని, రుణమాఫీ ప్రక్రియను విడతల వారీగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కేసీఆర్‌ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ ప్రక్రియ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. అడపాదడపా ఐదున్నర లక్షల మంది రైతులకు రూ.1,206 కోట్లు మాఫీ చేసినా.. అవి బ్యాంకు వడ్డీలకు కూడా సరి పోలేదు. ఇంకా సుమారుగా 31 లక్షల మంది రైతులకు రూ. 20,351 కోట్ల మేర మాఫీ చేయాల్సి ఉంది. అయితే వేల కోట్లు నిధులు సర్దుబాటు చేయలేక రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా సతమతవుతోంది. రుణమాఫీ కోసం 2019- 20 బడ్జెట్‌లో రూ.4,528 కోట్లు, 2020- 21 బడ్జెట్‌లో రూ.6,225 కోట్లు, 2021- 22 బడ్జెట్‌లో 5,225 కోట్లు, 2022-23 బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లు, 2023- 24 బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు కేటాయించారు. కేటాయింపుల మేరకు నిధులు విడుదల చేసి ఉంటే రుణమాఫీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయి ఉండేది. కానీ, కేటాయింపులకు తగినట్లుగా ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయలేదు. దీంతో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రుణ బకాయులున్న రైతులను బ్యాంకులు డిఫాల్టర్ల జాబితాలో చేర్చాయి. సుమారుగా 20 లక్షల మంది బ్యాంకు ఖాతాలను నిలిపివేశాయి. అప్పుల బాధ తాళలేక వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ అపప్రదను తొలగించుకోవాలన్న ఉద్దేశంతోనే హడావుడిగా ‘రుణమాఫీ’ పథకాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారన్న వాదన వినిపిస్తోంది.

సర్దుబాటు చేసేదెలా?

రుణమాఫీ పథకాన్ని పునః ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో ఆర్థికశాఖ నిధులు ఎలా సర్దుబాటు చేస్తుందనే చర్చ మొదలైంది. ఏడాదికి ఐదారు వేల కోట్లు కూడా సర్దుబాటు చేయలేక ఇంతకాలం చేతులెత్తేసిన ఆర్థిక శాఖ.. 45 రోజుల్లోనే రూ.20వేల కోట్లను ఎలా సమీకరిస్తుందన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రతి నెలా రాష్ట్ర ఖజానాకు రూ.12వేల కోట్ల దాకా ఆదాయం వస్తోంది. ఇందులో ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు కలిపి నెలకు రూ.4 వేల కోట్లు అవసరమవుతాయి. వేతనాలు పోగా... నెలకు రూ.8వేల కోట్లు మిగులుతాయి. ఈ నిధులను మొత్తానికి మొత్తం రుణమాఫీకి మళ్లించినా... రూ.20వేల కోట్లు జమ చేయడానికి రెండున్నర నెలలు పడుతుంది. మిగతా సంక్షేమ పథకాల కోసం నిధులు అవసరమున్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే పని కాదు. అలాంటప్పుడు 45 రోజుల్లో రూ. 20 వేల కోట్లు ఎలా జమచేస్తారు? కేసీఆర్‌ చెప్పిన గడువులోగా రుణమాఫీ పూర్తవుతుందా? అనే అనుమానాలను ఇటు రైతులు, అటు బ్యాంకర్లు వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సంబురాలు

పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేటీఆర్‌

హైదరాబాద్‌: రుణమాఫీ పునఃప్రారంభానికి సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో ఘనంగా సంబురాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రైతులతో కలిసి సంబరాల నిర్వహించాలని పార్టీ జిల్లా, నియోజకవర్గ అధ్యక్షులు, ఇన్‌చార్జిలకు సూచించారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలను ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకోవాలని కోరారు. సంబురాల్లో రైతు బంధు సమితులు, సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని సూచించారు. రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-03T04:31:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising