Korutla: సీసీ పుటేజీ చూసి పోలీసులకు కీలక విషయాన్ని వెల్లడించిన దీప్తి తల్లిదండ్రులు..
ABN, First Publish Date - 2023-09-01T18:57:38+05:30
కోరుట్ల పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. జగిత్యాల జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో మెట్‌పల్లి డీఎస్‌పీ రవీందర్ రెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. కోరుట్ల పట్టణంతో పాటు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో ఉంటున్న దీప్తి బంధువుల వివరాలను పోలీసులు సేకరించినట్లు సమాచారం.
కోరుట్ల: కోరుట్ల పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. జగిత్యాల జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో మెట్‌పల్లి డీఎస్‌పీ రవీందర్ రెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. కోరుట్ల పట్టణంతో పాటు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో ఉంటున్న దీప్తి బంధువుల వివరాలను పోలీసులు సేకరించినట్లు సమాచారం. ఇప్పటికే కోరుట్ల సీఐ ప్రవీణ్‌కుమార్ ఇద్దరు ఎస్సైలతో కలిసి నాలుగు బృందాలుగా ఏర్పడి హత్యపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. దీప్తి తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీప్తి పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం పోలీసు ఆ కోణంలో విచారణ చేపట్టారు.
దీప్తి ఒంటిపై గాయాల ఆధారంగా హత్య చేయబడిందా, అయితే హత్య చేసింది ఎవరు. దీప్తిని చంపడం వల్ల ఎవరికి లాభం అనే ప్రశ్నలు పోలీసుల మదిలో మెదులుతున్నాయి. ఇదిలా ఉండగా అక్కను తానెందుకు చంపుతాను. ఇంటి నుంచి తాను వెళ్లే సమయంలో అక్క మద్యం తాగి సోఫాలో నిద్రించి ఉంది.. అంటూ తండ్రితో పాటు సోదరుడికి దీప్తి చెల్లి పంపిన వాయిస్ మెసేజ్ ఆధారంగా పోలీసులు సిగ్నల్స్ ట్రేస్ చేసేందుకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విచారణ కొనసాగించారు. అయితే పోలీసులు వెళ్లి విచారణ చేపట్టే సమయానికి అరగంట ముందే చందన మరో వ్యక్తితో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాదు నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వారి బంధువుల వివరాలను సేకరించి వివిధ కోణాలలో విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగా బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సీసీ పుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. మంగళవారం రోజు కోరుట్ల బస్టాండ్‌లో పోలీసులు గుర్తించిన సీసీ పుటేజీలో కనిపించిన వారిలో చందన లేదని దీప్తి కుటుంబ సభ్యులు నిర్థారణ చేశారు. అసలు చందన బస్సులో కాకుండా ద్విచక్ర వాహనం, లేదా కారులోనైనా కోరుట్ల నుంచి వెళ్లి ఉంటుందన్న అనుమానంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా మెట్‌పల్లి డీఎస్‌పీ ఆధ్యర్యంలో దీప్తి బంధువులను విచారణ నిమిత్తం పిలుపించుకుని పలు వివరాలను సేకరిస్తున్నారు. శ్రీనివాస్ ఇంట్లో నుంచి భారీగా బంగారు ఆభరణాలు, నగదు అపహరణకు గురవడంతో పాటు చందన అదృశ్యం కావడం అటు కుటుంబ సభ్యులకు ఇటు పోలీసులకు తలనొప్పిగా మారింది. చందన బీటెక్ పూర్తి కాగా తరచుగా ఇంట్లో నుంచి వచ్చి అమ్మానాన్నలను నమ్మించి డబ్బులు తీసుపోయేదని సమాచారం. ఏది ఏమైనప్పటికీ దీప్తి అనుమానాస్పద మృతి చేధించడం పోలీసులకు సవాల్‌గా మారింది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపాడు.
Updated Date - 2023-09-01T19:06:57+05:30 IST