కొండగట్టులో సీఎం పర్యటన నేడు
ABN, First Publish Date - 2023-02-15T01:26:39+05:30
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం అంతా సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీన కొండగట్టు దేవస్థానానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు.
- గుర్తించనున్న రూ. వంద కోట్ల పనులు
- సాధారణ భక్తుల దర్శనాలపై ఆంక్షలు
జగిత్యాల, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం అంతా సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీన కొండగట్టు దేవస్థానానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగు రోజులుగా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ భాస్కర్‌ల ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల క్రితం కొండగట్టు దేవస్థానానికి రూ. వంద కోట్లు నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ అయింది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ గుర్తించనున్నారు. సుమారు మూడున్నర గంటల పాటు కొండగట్టు గుట్టపై సీఎం కేసీఆర్ గడపనున్నారు. యాదాద్రి దేవస్థానం అభివృద్ధిలో భాగస్వామ్యమైన ప్రముఖ అర్కిటెక్ట్ ఆనందసాయి ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇదివరకే కొండగట్టును సందర్శించి పరిస్థితి పరిశీలించారు. కొండపైకి రోప్‌వేతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు పరిశీలించనున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కోసం అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కొండగట్టు గుట్టపై గల జెఎన్‌టీయూ సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ గుట్టపైకి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభ స్వాగతం పలుకుతూ అర్చకులు ఆలయంలోకి తీసుకొని వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం గుట్టపై గల పలు ప్రాంతాలను సీఎం కేసీఆర్ తిలకించడానికి అనుగుణంగా ఆయా ప్రాంతాలను శుభ్రపరచడం, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం వంటి పనులు చేశారు. అర్కిటెక్ట్ ఆనంద సాయితో కలిసి సీఎం కేసీఆర్ పరిశీలన చేయనున్నారు. ఇందుకు ఇంజనీరింగ్, దేవాదాయ శాఖ, ఇతర శాఖల అధికారులను సిద్ధంగా ఉంచారు. జెఎన్‌టీయూలో కాన్ఫరెన్స్ హాలులో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అర్చకులు, వేద పండితులు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించడానికి అనుగుణంగా సమావేశ మందిరం తీర్చిదిద్దారు.
పోలీసుల భారీ బందోబస్తు
సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొండగట్టు పరిసర ప్రాంతాలను పోలీసు సిబ్బంది జల్లెడ పట్టారు. పలు గ్రామాలు, ప్రాంతాలపై నిఘా పెట్టారు. విస్తృతంగా పోలీసుల తనిఖీలు జరుగుతు న్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సుమారు రెండు వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. ఇందులో ఐదుగురు ఎస్పీ స్థాయి అధికారులు, 20 మంది ఏసీపీ, డీఎస్పీలు, 40 మంది సీఐలు, 150 మంది ఎస్‌ఐలు, సుమారు 1,800 కానిస్టేబుల్స్, స్పెషల్ పార్టీ పోలీసులు, డాగ్ స్క్వాడ్, ఏఆర్ కానిస్టేబుల్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. కొండగట్టు గుట్ట కింద ట్రాఫిక్ నియంత్రిస్తూ ప్రత్యేక పోలీసులను నియ మించారు. గుట్టపై పలు ప్రాంతాల్లో పోలీసులు అడుగడుగునా నిఘా ఉంచుతున్నారు.
పర్యవేక్షించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు రవి శంకర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. మంగళవారం గుట్టపైకి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి.
పర్యటన ఇలా :
కొండగట్టు గుట్టపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు మూడున్నర గంటల పాటు గడపనున్నారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 9.40 గంటలకు కొండగట్టు దేవస్థానానికి చేరుకుంటారు. ఆంజనేయ స్వామిని దర్శిస్తారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన స్థలాలను, కట్టడాలను పరిశీలిస్తారు. అనంతరం పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్ధేశం చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కొండగట్టు నుంచి హెలికాప్టర్ ద్వారా తిరుగు ప్రయాణం అవుతారు. భద్రతా కారణాల దృష్ట్యా సాధారణ భక్తుల దర్శనాలను పర్యటన పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నిలిపివేస్తూ కలెక్టర్ యాస్మిన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - 2023-02-15T01:26:48+05:30 IST