కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీఆర్‌ఎస్‌లోకి జయపాల్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-08-13T01:05:40+05:30

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ స్థానాలనూ కైవసం చేసుకోవాలని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహా త్మకంగా ముందుకు సాగుతున్నది.

బీఆర్‌ఎస్‌లోకి జయపాల్‌రెడ్డి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ స్థానాలనూ కైవసం చేసుకోవాలని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహా త్మకంగా ముందుకు సాగుతున్నది. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే పార్టీలోని కలహాల కుంపట్లను చల్లార్చి అసంతృప్తి లేకుండా చూసుకోవడంతో పాటు ఇతర పార్టీల్లో బలంగా ఉన్నవారిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా రాజకీయ శక్తుల పునరేకీకరణకు శ్రీకారం చుట్టింది. గెలుపు ధీమా ఉన్న నియోజకవర్గాల్లోనూ పార్టీకి మరింత బలం చేకూర్చడానికి ఉపయోగపడే వారిని ఆహ్వానిస్తున్నది. ఈ నేపథ్యంలోనే మైత్రి గ్రూపు అధినేత, రెడ్డి సామాజికవర్గ నేత కొత్త జయపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరిక ఖాయమైందని తెలుస్తున్నది. మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, కొత్త జయపాల్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ నెల 17 తర్వాత శ్రావణ మాసం మొదటి వారంలో కొత్త జయపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని సమాచారం. మంత్రి గంగుల కమలాకర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌తో జయపాల్‌ రెడ్డి విషయమై మాట్లాడి వారి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ పొందారని తెలిసింది. అయితే పార్టీలో చేరిన పక్షంలో తన పొజిషన్‌ ఏమిటని జయపాల్‌ రెడ్డి మంత్రి గంగుల కమలాకర్‌ను, వినోద్‌కుమార్‌ను అడిగారని సమాచారం. జయపాల్‌ రెడ్డి ఎమ్మెల్సీ పదవిని ఆశించినా 2025 మార్చి వరకు ఎమ్మెల్సీ పదవులేవీ లభించే అవకాశం లేనందువల్ల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడానికి అంగీకరించిన నేపథ్యంలో ఆ కార్పొరేషన్‌ తొలి చైర్మన్‌ పదవిని జయపాల్‌రెడ్డి కోరుకుంటున్నారని, అందుకు పార్టీ అధిష్టానవర్గం కూడా అంగీకరించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తున్నది. రెడ్డి సామాజికవర్గం జిల్లాలో రాజకీయంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రభావితం చేయగలిగిన శక్తి కలిగి ఉన్నది. రెడ్డి సంక్షేమ సంఘ నాయకుడిగా ఉన్న జయపాల్‌రెడ్డి కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూర్‌ నియోజకవర్గాల్లో పట్టు కలిగి ఉన్నారని ఆయనను పార్టీలోకి చేర్చుకోవడం ఈ మూడు నియోజకవర్గాల్లో పార్టీకి అదనపు బలం చేకూర్చుతుందని బీఆర్‌ఎస్‌ నేతలు భావించి జయపాల్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారని సమాచారం. జయపాల్‌ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన బండి సంజయ్‌కుమార్‌ వేములవాడ, హైదరాబాద్‌లోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో జయపాల్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి అవుతారని ప్రచారం జరిగింది. మరో వైపు కరీంనగర్‌ నుంచే పోటీ చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జయపాల్‌ రెడ్డికి అవకాశం కల్పిస్తామని ఆఫర్‌ ఇచ్చారని, జయపాల్‌ రెడ్డి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారని కూడా ప్రచారం జరిగింది. అయితే మంత్రి గంగుల కమలాకర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ జయపాల్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్పించడానికి ఒప్పించడంలో సఫలమయ్యారని అంటున్నారు. బీఆర్‌ఎస్‌లో చేరిక విషయమై జయపాల్‌రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా మంత్రి గంగుల కమలాకర్‌ తనను పార్టీలో చేరాలని ఆహ్వానించిన మాట నిజమేనని, ఆ విషయమై చర్చలు జరుగుతున్నాయని ధ్రువీకరించారు. దీంతో ఆయన బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తున్నది. పార్టీ అధినేత నుంచి ఏదో ఒక స్పష్టమైన హామీ పొంది ఆయన పార్టీలో చేరతారని, వారం రోజుల్లో ముహూర్తం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Updated Date - 2023-08-13T01:05:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising