Bhadrachalam : .. కమనీయం
ABN, First Publish Date - 2023-03-31T02:40:58+05:30
తెలుగు జాతికి అయోధ్యాపురి అయిన భద్రగిరిలో శ్రీరామ నవమి సందర్భంగా గురువారం శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది.
సిరి కల్యాణపు బొట్టు, ఒంపైన కస్తూరి నామం... సీతమ్మ, రామయ్య నుదుటన చేరి మణి బాసికముల మాటు నుంచి తళుక్కున మెరిశాయి. ఆణిముత్యములు వధూవరుల దోసిట్లోకి చేరగానే రంగులు మారడాన్ని చూసుకొని పులకించిపోయాయి. అవే తలంబ్రాలై జానకిరాముల శిరమున వెలిశాయి. ఆ దృశ్యాన్ని రెప్పవాల్చడం కూడా మరిచిన భక్తకోటి కళ్లు కనగ కనగ కమనీయమే అని మురిసిపోయాయి. భద్రాద్రిలో గురువారం జరిగిన శ్రీసీతారాముల కల్యాణ వేడుకను ఆసాంతం తిలకించిన భక్తులు జయ జయ ధ్వానాలు చేశారు.
భద్రాచలం, మార్చి 30: తెలుగు జాతికి అయోధ్యాపురి అయిన భద్రగిరిలో శ్రీరామ నవమి సందర్భంగా గురువారం శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. కల్యాణం సందర్భంగా జానకిరాములకు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. భద్రాద్రిలో గురువారం తెల్లవారుజామున రెండు గంటలకే పెళ్లి సందడి మొదలైంది. ఆలయాన్ని తెరిచిన అర్చకులు, రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం.. ఆ తర్వాత ధ్రువమూర్తులకు కల్యాణం నిర్వహించారు. తర్వాత కల్యాణ మూర్తులను పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల మధ్య మిథిలా మైదానంలోని శిల్పకళాశోభిత కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. రజత సింహాసనంపై సీతారామచంద్ర స్వాములను ఆసీనులను చేశారు. తిరువారాధన, విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించి మండప శుద్ధి చేశారు.
ఈ సమయంలో ‘యుంజానహః ప్రథమం’ అనే మంత్రాన్ని జపిస్తూ వేద పండితులు ప్రజా సంపతర్థ్యం ‘శ్రీయం ఉద్వాః హిష్షే’ అన్న సంకల్పంతో స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చోబెట్టి కన్యావరణలు జరిపారు. మోక్షబంధం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ జరిపారు. వధూవరుల వంశ గోత్రాలకు సంబంధించి ప్రవరలు వినిపించారు. ఈ క్రమంలో ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పుష్పాదక స్నానం జరిపి వరపూజ నిర్వహించారు. కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితురాయి, రామమాడ తదితర ఆభరణాలను రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణ స్వామికి ధరింపజేశారు.
అర్చక స్వాములు స్వామి వారికి నూతన వస్ర్తాలంకరణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం, గణపతి సచ్చిదానంద స్వామి, శృంగేరీ సంస్థానంతో పాటు పట్టు వస్ర్తాలను వధూవరులకు బహుకరించారు. లోక పర్యాంతాన్ని, విశ్వ సృష్టిని దానిలో ఉన్న కాలాన్ని, దేశాన్ని తెలుపుతూ సంకల్పం చెప్పి కన్యాదాన కరిష్యే... అంటూ ముగించారు. సరిగ్గా 12 గంటలకు అభిజిత్‌లగ్నం సమీపించగానే ఉత్సవ మూర్తుల శిరసుపై జీలకర్రబెల్లం ఉంచారు. అనంతరం భక్తరామదాసు చేయించిన మంగళ సూత్రాలతో సూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. చివరగా భాగవోత్తముల ఆశీర్వచనంతో కల్యాణం ముగిసింది. హరియాణా గవర్నర్ దత్తాత్రేయ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీలు మాలోతు కవిత, వద్దిరాజు రవిచంద్ర, భద్రాచలం, పాలేరు ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, తదితర ప్రముఖులు హాజరయ్యారు. వేములవాడ, యాదాద్రి తదితర క్షేత్రాల్లోనూ సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది.
నేడు శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం
12 ఏళ్లకోసారి జరిగే శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం శుక్రవారం భద్రాచలంలో జరగనుంది. కల్యాణమూర్తులైన సీతారామచంద్రస్వామికి జరగనున్న ఈ వేడుకను తిలకించేందుకు గవర్నర్ తమిళిసై, అహోబిల జీయర్‌స్వామి, దేవనాద జీయర్‌స్వామి హాజరుకానున్నారు. ఏటా సీతారాముల కల్యాణం మరుసటి రోజున నిర్వహించే పట్టాభిషేకాన్ని శ్రీరామ మహా పట్టాభిషేకంగా పేర్కొంటారు. ఈ పట్టాభిషేకాన్ని పూర్వం ప్రతీ 60 సంవత్సరాలకు ఒకసారి జరిపేవారు. దీనిని శ్రీరామ మహా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవంగా పేర్కొనేవారు. 1927, 1987లో మహా సామ్రాజ్య పట్టాభిషేకాలు జరిగాయి. తర్వాత కాలంలో భక్తుల సౌకర్యార్థం మార్పులు చేసి పుష్కరానికోసారి నిర్వహించాలని నిర్ణయించారు. దీనిని పుష్కర పట్టాభిషేకంగా పేర్కొంటున్నారు.
లోకమంతా కల్యాణాన్ని ఆచరించడానికి మూలం భద్రాద్రే: చినజీయర్
లోకమంతా శ్రీరామనవమి రోజున సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని ఆచరిస్తోందంటే దానికి మూలం భద్రాచల పుణ్యక్షేత్రమేనని త్రిదండి చినజీయర్‌స్వామి పేర్కొన్నారు. సీతారామ కల్యాణ వేడుకకు హాజరైన ఆయన భక్తులనుద్దేశించి ప్రవచించారు. భద్రాద్రిలో జరిగే కల్యాణాన్ని ఆదర్శంగా తీసుకునే మన దేశంతో పాటు ఇతర దేశాల్లోని వారు కూడా కల్యాణాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు.
ప్రజలకు నవమి శుభాకాంక్షలు: మోదీ
ప్రధాని మోదీ గురువారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి జీవితం ప్రతి యుగంలో మానవాళికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
Updated Date - 2023-03-31T02:40:58+05:30 IST