వర్ష బీభత్సం
ABN, First Publish Date - 2023-07-28T01:08:19+05:30
ఉమ్మడిజిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. పలు ప్రాంతాల్లోని రహదారులు కొట్టుకుపోవడం, చప్టాలపై వరద ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ప్రమాదకరంగా ఉన్న చప్టాల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వాన
వాగులు ఉప్పొంగి వందల గ్రామాలకు నిలిచిన రాకపోకలు
కరకగూడెంలో అత్యధికంగా 38.3సెంటిమీటర్ల వర్షం
ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/కొత్తగూడెం, జూలై 27: ఉమ్మడిజిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. పలు ప్రాంతాల్లోని రహదారులు కొట్టుకుపోవడం, చప్టాలపై వరద ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ప్రమాదకరంగా ఉన్న చప్టాల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం భద్రాద్రి జిల్లాలో సగటున 16.9సెంటిమీటర్ల వర్షపాతం నమోదవగా.. కరకగూడెం మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 38.3 సెం.మీ వర్షం పడింది. ఖమ్మం జిల్లాలో 10సెం.మీవర్షపాతం నమోదవగా.. అత్యధికంగా ఖమ్మం రూరల్‌లో 28.6 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక ఛత్తీ్‌సగఢ్‌లో కురిసిన భారీ వర్షాలతో చర్ల మండలంలోని తాలిపేరుకు భారీగా వరద వస్తోంది. మొత్తం 25గేట్లు ఎత్తి 56వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. పాల్వంచ కిన్నెరసానికి వరద పెరగడంతో 12గేట్లు ఎత్తారు. మొర్రేడువాగు ఉధృతికి పాల్వంచ -ములకలపల్లి రోడ్డు కిలోమీటరు మేర కొట్టుకుపోయింది. కరకగూడెం మండలంలో రికార్డు స్థాయిలో వర్షం పడటంతో పెద్దవాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం జిల్లాలో ఏన్కూరు మండలం బురదరాఘవాపురం వద్ద రోడ్డుపై నీరు ప్రవహించగా.. రాయమాదారం వద్ద రహదారి కోతకు గురైంది. వైరా మండలం లక్ష్మీపురం, వల్లాపురం, లింగాపురం తదితర చోట్ల రోడ్లపై వైరా ఏరు నీరు ప్రవహిస్తోంది. ఇక కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి సింగరేణి ఓసీల్లో వాన నీరు చేరడంతో వారంరోజులుగా సుమారు 3లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
అధైర్యపడవద్దు ఆదుకుంటాం: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
అటు భారీ వర్షాలు, మున్నేరు వరదల నేపథ్యంలో ప్రజలెవరూ అధైర్యపడొద్దని, అందరికీ అండగా ఉంటామని మంత్రి పువ్వాడ అజయ్ భరోసానిచ్చారు. ఖమ్మంలో మున్నేరు ప్రవాహాన్ని మంత్రి అజయ్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి పరిశీలించారు. ఖమ్మం ననగరంలోని ప్రకాష్ నగర్, బొక్కలగడ్డ, వెంకటేశ్వరనగర్, మోతీనగర్ పునరవాస కేంద్రాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు.
పాలేరుకు రికార్డుస్థాయి వరద.. 27 అడుగులకు చేరిన నీటిమట్టం
కూసుమంచి : భారీ వర్షాల కారణంగా పాలేరు జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. గురువారం ఉదయం 8గంటలకు 56వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. రాత్రి 9గంటలకు ఆ ప్రవాహం 85వేల క్యూసెక్కులకు చేరుకోగా.. జలాశయ గరిష్ఠనీటిమట్టం 23 అడుగులకుగాను 27అడుగులకు చేరుకుంది. అయితే 1989లో సుమారు 98వేల క్యూసెక్కుల నీరు చేరిన రికార్డు ఉండగా.. మళ్లీ ఇప్పుడు అంతస్థాయిలో ప్రవాహం వస్తోందని నీటిపారుదలశాఖ డీఈ మధు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
Updated Date - 2023-07-28T01:08:19+05:30 IST