Bhadrachalam: నేడు రామాలయం మూసివేత
ABN, First Publish Date - 2023-10-28T07:25:13+05:30
భద్రాచలం: పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం ఐదు గంటల్లోపు స్వామి వారి సేవలన్ని నిర్వహించి ఆలయాన్ని మూసివేయనున్నారు.
భద్రాచలం: పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం ఐదు గంటల్లోపు స్వామి వారి సేవలన్ని నిర్వహించి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ, సుప్రభాతసేవ, తిరువారాధన, అంతరంగిక అభిషేకం, నివేదన నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 7గంటల నుంచి భక్తులకు దర్శనం, పూజలకు ప్రవేశం కల్పించనున్నారు.
కాగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం శబరి స్మతి యాత్రను నిర్వహించనున్నారు. సీతాన్వేషణ సమయంలో తన వద్దకు వచ్చిన రామలక్ష్మణులను చూసి పొంగిపోయి రామయ్యకు రుచికరమైన పండ్లను అందించి.. ముక్తిని పొందిన ఆ మహాసాద్వి స్మృతిగా భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఏటా స్మృతి యాత్ర నిర్వహిస్తారు. ఈ క్రమంలో వారు తొలుత గిరిప్రదక్షిణ, కల్యాణోత్సవం, అనంతరం తాము తెచ్చిన పలు రకాల ఫలాలు, పూలతో రామచంద్రమూర్తికి సమర్పిస్తారు.
2013లో అప్పటి స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ అయిన వినోద్‌కుమార్ అగర్వాల్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. నాటి నుంచి ఏటా ఆశ్వీయుజమాసంలో పౌర్ణమి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా శనివారం పదోసారి ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 7గంటలకు చిత్రకూట మండపం వద్ద నుంచి శబరిస్మృతి యాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 8.30 గంటలకు చిత్రకూట మండపంలో సీతారామచంద్రస్వామి వారికి సహస్రనామార్చన స్వామి వారి నిత్యకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. అలాగే గిరిజన ముత్తైదువులకు సారెను అందించడంతో పాటు అన్నదాన కార్యక్రమం జరగనుంది.
Updated Date - 2023-10-28T07:25:13+05:30 IST