ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR: రేవంత్‌ బ్లాక్‌మెయిలర్‌

ABN, First Publish Date - 2023-02-10T03:02:22+05:30

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ శివారు భూములపై సపరేట్‌ దఫ్తర్‌

ఆర్టీఐ పేరుతో దందా.. రూ.కోట్లు వసూలు

టీపీసీసీ చీఫ్‌పై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

ప్రగతిభవన్‌ను పేల్చేస్తారా? ధరణిని రద్దు చేస్తారా?

కాంగ్రెస్‌ విధానం ఇదేనా? అంటూ ఆగ్రహం

శాసనసభలో రెవెన్యూ పద్దుపై వాడీవేడి చర్చ

ధరణిలో లోపాయిలున్నాయి.. రద్దు చేస్తాం

అసైన్డ్‌ భూముల బదలాయింపు జరగడంలేదు

స్వాధీనం చేసుకొని వేలం వేస్తున్నారు: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి ఒక బ్లాక్‌మెయిలర్‌ అని, హైదరాబాద్‌ శివారు భూములపై సపరేట్‌గా దఫ్తర్‌ (దుకాణం) ఏర్పాటు చేసుకొని దందాలకు పాల్పడుతున్నారని, రూ.కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గురువారం శాసనసభలో రెవెన్యూ పద్దు(ధరణి)పై జరిగిన చర్చలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ మాట్లాడుతూ, ‘‘వాళ్ల పార్టీ(కాంగ్రె్‌స)కి ఒక అధ్యక్షుడి(రేవంత్‌రెడ్డి)ని పెట్టుకున్నారు. ఆయన పేరు నేను చెప్పను కానీ, ప్రగతిభవన్‌ను బాంబులతో బద్దలు కొడతాం. బయట బ్లాక్‌ మెయిల్‌లు చేస్తాం. రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ను రూట్‌ టు ఇన్‌కమ్‌గా మార్చుకుంటాం. ఆర్టీఐ పేరిట బయట అడ్డగోలుగా దందాలు చేస్తాం అంటాడు. రంగారెడ్డి జిల్లా భూములు, హైదరాబాద్‌ భూములపై మీ పార్టీ అధ్యక్షుడి దగ్గర ఒక సపరేటు దఫ్తర్‌ నడుస్తుంది. ఆ దఫ్తర్‌లో రిటైర్డ్‌ తహసీల్దార్లతో సహా కొంతమందిని కూర్చోబెట్టుకొని ప్రభుత్వాన్ని, ప్రైవేట్‌ వ్యక్తులను బ్లాక్‌ మెయిల్‌ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇలా కోట్లాది రూపాయలు వసూలు చేసేవాళ్లకు ధరణి వల్ల ఇబ్బంది ఉంటుంది’ అని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామనడంపైనా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, విపక్ష కాంగ్రెస్‌ మధ్య వాడి వేడి చర్చ జరిగింది.

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పక్షాన్ని టార్గెట్‌ చేయగా.. ధరణిలో లోపాలను ఎత్తిచూపుతూ సీఎల్పీ ఉపనేత డి.శ్రీధర్‌బాబు అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. టీ విరామం అనంతరం రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం సహా 12 పద్దులపై చర్చను స్పీకర్‌ ప్రారంభించారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ధరణిని ప్రవేశపెట్టిన సమయంలో సర్వరోగ నివారిణి అని చెప్పారని, కానీ, ధరణిలో లోపాలపై విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. ఏళ్ల క్రితం భూములు కొనుగోలు చేసిన వారు.. రికార్డుల్లో పేర్లు నమోదు చేసుకోకపోవడంతో ధరణిలో పాత యజమానుల పేర్లే వస్తున్నాయని, వీటిపై నాలుగు లక్షలకు పైగా విజ్ఞప్తులు వచ్చాయని పేర్కొన్నారు. ధరణిలో లోపాల కారణంగా ఈ ఏడాదిలోనే నలుగురు రైతులు చనిపోయారన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ జోక్యం చేసుకుంటూ.. భూముల క్రయవిక్రయాల్లో అవినీతికి తావులేకుండా ఽధరణి ఉందన్నారు. అంతా కకావికలమైనట్లు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు.

లంచాలకు పనిచేసే వ్యవస్థ కావాలా?

ధరణిని రద్దు చేస్తామంటున్నారని, కాంగ్రెస్‌ హయాంలో మాదిరిగా లంచాలు ఇవ్వనిదే పనిచేయని వ్యవస్థ కావాలనుకుంటున్నారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆధారాల్లేకుండా ధరణిపై నిందారోపణలు చేయడం తగదన్నారు. దీంతో.. రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించిన అనుభవదారు కాలమ్‌తోపాటు ఇతర కాలమ్‌లను పునరుద్ధరించాలని శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ మళ్లీ కల్పించుకుంటూ, ‘వీళ్ల అధ్యక్షుడు (రేవంత్‌రెడ్డి) ధరణిని రద్దు చేస్తామంటున్నారు. సీఎం కార్యాలయ భవనం ప్రగతిభవన్‌ను పేల్చేయాలంటున్నారు. పార్టీకంటూ ఓ వైఖరి ఉందా? పార్టీ అధ్యక్షుడికి, మీకు మధ్య వేర్వేరు వైఖరులు ఉన్నాయా? ప్రగతిభవన్‌ను బాంబులతో పేల్చేయాలనడమే కాంగ్రెస్‌ వైఖరా?’’ అని ప్రశ్నించారు. దీంతో.. ధరణిలో లోటుపాట్లు ఉన్నాయనే రద్దు చేస్తామంటున్నామని, ఈ విషయంలో తమ వైఖరి, తమ పార్టీ అధ్యక్షుడి వైఖరి ఒకటేనని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ధరణి అమల్లోకి వచ్చే క్రమంలో తహసీల్దార్‌ హత్య, పలు జిల్లాల్లో హత్యాయత్నాలు జరిగాయన్నారు. దీనికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ.. పత్రికలు, చానళ్లు తమ ఎజెండాను అమలు చేస్తున్నాయని, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా మాట్లాడ వద్దని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రిజిస్ట్రేషన్లు అయ్యాక మ్యుటేషన్ల కోసం తిరిగి తిరిగి రైతులు చనిపోయారని, ఇప్పుడు నయాపైసా లంచం లేకుండా లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో శ్రీధర్‌బాబు స్పందిస్తూ ఽధరణిలో సమస్యలు పరిష్కారం కావాలనేదే తమ అభిమతమన్నారు.

చట్టబద్ధ వ్యవస్థలు విఫలమైతే..

భూమి చుట్టే తెలంగాణ ఉందని, భూస్వాముల చేతుల్లో భూములున్నాయనే భూ పంపిణీ జరిగిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. చట్టబద్ధ వ్యవస్థలు విఫలమైతే.. ఇంకో వ్యవస్థ పుట్టుకొస్తుందని హెచ్చరించారు. శ్రీధర్‌బాబు మళ్లీ మాట్లాడుతూ అసైన్డ్‌ భూముల బదలాయింపు జరగడంలేదని, కుటుంబపెద్ద ఏకకాలంలో నలుగురైదుగురికి గిఫ్ట్‌ ఇచ్చే అవకాశం కూడా లేదని అన్నారు. ఒక సర్వే నెంబర్‌లో కొంత భూమి వివాదంలో ఉంటే.. మొత్తం భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని, దీనికి తానే బాధితుడినని చెప్పారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకొని వేలం పాటలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి ఎకరానికి రూ.8 లక్షలకు తీసుకున్న భూమిని రూ.కోటిన్నరకు పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తున్నారన్నారు. దీనిపై కేటీఆర్‌ అభ్యంతర వ్యక్తం చేశారు. ‘‘అడ్డగోలుగా ఆరోపణలు చేయడం తగదు. ఎకరం కాదు కదా.. సెంటు అయినా అమ్మినట్లు నిరూపిస్తారా.? ప్రభుత్వాన్ని బద్‌నాం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేయగా.. భూములను ఎంతకు తీసుకున్నారు? ఎంతకు అమ్ముతున్నారు? అనేదే తన ఉద్దేశమని శ్రీధర్‌బాబు బదులిచ్చారు. అయితే భూములను రూ.కోటికి అమ్మారనే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అసైన్డ్‌, కౌలు భూముల సమస్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సేకరించిన భూములకు పరిహారం పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మైనారిటీల రిజర్వేషన్లు పెంచలేదేం?

మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి.. పెంచలేదని శ్రీధర్‌బాబు అన్నారు. మౌజన్‌లు, ఇమామ్‌లకు గౌరవం వేతనం పెంచాలని వచ్చిన 16 వేల దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. రైస్‌ మిల్లర్ల చేతిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 7వేల కొనుగోలు కేంద్రాలు పెట్టినా.. ఆ ధాన్యం మిల్లుకు చేరిన తర్వాతే ట్రిప్‌షీట్‌ ఇస్తున్నారని, కొనుగోలు కేంద్రాల్లోనే ట్రిప్‌షీట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మిల్లుకు ధాన్యం చేరిన తర్వాత 7-8 కేజీల ధాన్యాన్ని తరుగు కింద తీసుకున్నాకే ట్రిప్‌షీట్‌ ఇస్తున్నారని, ఇక వానాకాలం ధాన్యం సేకరణ కింద రూ.300 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. కాలానుగుణంగా రేషన్‌కార్డుల్లో వివరాల నమోదు ప్రక్రియ నవీకరణ జరగడం లేదని, 8 లక్షలకు పైగా దరఖాస్తులు కొత్త రేషన్‌కార్డుల కోసం పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. మంథని ప్రాంతంలో ఇసుక రవాణాతో రోడ్లన్నీ దెబ్బతింటున్నాయని, ఒక్క లారీ చట్టబద్ధంగా వెళుతుంటే... 9 లారీలు చట్టవిరుద్ధంగా వెళుతున్నాయన్నారు. ఇసుక మాఫియాతో రోడ్లన్నీ దెబ్బతింటున్నాయని చెప్పారు.

ఎక్కడాలేని విధంగా కొత్త సచివాలయం

17న ప్రారంభోత్సవం ఘనంగా ఉండాలి

సభ ఏర్పాట్లపై చర్చించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే ఎక్కడాలేని విధంగా కొత్త సచివాలయాన్ని అధునాతనంగా నిర్మించడంతోపాటు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరు పెడుతున్నందున రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ నెల 17న ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య సీఎం కేసీఆర్‌ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్‌, అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ తదితరులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ ప్రారంభం, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ బహిరంగసభ ఏర్పాట్లపై గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో కేటీఆర్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. 17న సచివాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మంది హాజరయ్యేలా చూడాలని సూచించారు. జన సమీకరణ కోసం ఈనెల 13 నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇతర జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రతి నియోజకవర్గానికి ఇన్‌చార్జులుగా నియమించనున్నట్లు తెలిపారు. సచివాలయ ప్రారంభోత్సవం, పరేడ్‌ గ్రౌండ్‌ సభను కలిసికట్టుగా విజయవంతం చేద్దామని ఈ సందర్భంగా కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-02-10T03:29:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising