లక్ష కోట్లు.. లక్ష ఎకరాలు
ABN, Publish Date - Dec 29 , 2023 | 03:42 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రూ.93,872 కోట్లను వెచ్చించగా.. కొత్తగా 98,570 ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందింది.
కాళేశ్వరం ఐదేళ్లలో 1,053 టీఎంసీల నీరు ఎత్తిపోత
మూడు బ్యారేజీల నిర్మాణ వ్యయం రూ.7,516.31 కోట్లు
17లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకృతం
పీపీటీలో పలు కీలక అంశాలు
నేడు మేడిగడ్డకు మంత్రులు
హైదరాబాద్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రూ.93,872 కోట్లను వెచ్చించగా.. కొత్తగా 98,570 ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందింది. ఐదేళ్లలో 1,053 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. 215 టీఎంసీల గోదావరి జలాలను తరలించి 19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టి, 18.82 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కాళేశ్వరం లక్ష్యం. ఇంకా సృష్టించాల్సిన ఆయకట్టు 18,64,970 ఎకరాలు. ఈ ప్రాజెక్టు కాల్వల ద్వారా 456 చెరువులను నింపగా, వాటి కింద 39,146 ఎకరాల ఆయకట్టుంది. కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీ-1, 2, నిజాంసాగర్ కాల్వల ద్వారా 2,143 చెరువులకు తరలించగా, 1,67,050 ఎకరాలకు నీరందింది. ప్రాజెక్టుకు 97,417 ఎకరాలను సేకరించాల్సి ఉండగా 66,190 ఎకరాల సేకరణ పూర్తయింది. మిగతా భూమి సేకరణకు రూ.5,438 కోట్లు అవసరం. మేడిగడ్డ బ్యారేజీ వద్ద శుక్రవారం మంత్రులు ఇవ్వనున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కీలక విషయాలివి. దీనిప్రకారం.. దిగువ మానేరు జలాశయం కింద ఎస్సారెస్పీ ేస్టజీ-1 పాత ఆయకట్టుతో పాటు ఎస్సారెస్పీ స్టేజీ-2, నిజాంసాగర్ కింద పాత ఆయకట్టుకు 2023-24 ఖరీఫ్, యాసంగి సీజన్లలో కాళేశ్వరం ద్వారా సాగు నీరందింది. దీంతో మొత్తం 17,08,230 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకృతమైంది. 2020-21 యాసంగి నుంచి 2023-24 ఖరీఫ్ వరకు కుందెల్లి, హల్దీ వాగులు, 66 చెక్ డ్యాంల కింద మొత్తం 20,576 ఎకరాలకు కాళేశ్వరం జలాలను విడుదల చేశారు.
మూడు బ్యారేజీల నిర్మాణానికే...
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ వ్యయం రూ.7,516.31 కోట్లు. ఇందులో మేడిగడ్డకు రూ.3,625.82 కోట్లు, అన్నారంనకు రూ.2,228.43 కోట్లు, సుందిళ్లకు రూ.1,662.06 కోట్లు వ్యయమైంది. కాగా, అక్టోబరు 21న భారీ శబ్దంతో మేడిగడ్డ ఏడో బ్లాక్‌లోని 20వ నంబరు పిల్లర్ కుంగడంతో బ్రిడ్జి స్లాబ్ కుంగింది. పక్కనే ఉన్న 19, 21 నెంబర్ పిల్లర్లు కూడా కుంగాయి. మరుసటి రోజు ఎల్ అండ్ టీ జీఎం సురేశ్‌కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం బ్యారేజీని సందర్శించి తామే పునరుద్ధరిస్తామని వెల్లడించారు. అదే రోజు సీడీవో, సీఈ నేతృత్వంలో టెక్నికల్ టీమ్ బ్యారేజీని పరిశీలించి కుంగుబాటు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. అక్టోబరు 23న ఆరుగురు సభ్యుల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) బృందం హైదరాబాద్ వచ్చి ఈఎన్‌సీతో సమావేశమైంది. 24న బ్యారేజీని సందర్శించింది. 25న జలసౌధలో ఉన్నతాధికారులతో సమావేశమైంది. బ్యారేజీలోని 20వ నంబర్ పిల్లర్ 1.256 మీటర్లు కుంగినట్టుగా గుర్తించారు. 28న డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ చైర్మన్ అశ్విన్ బి.పాండ్యా నేతృత్వంలోని బృందం బ్యారేజీని సందర్శించింది. నవంబరు 1న ఎన్డీఎ్‌సఏ టీమ్ బ్యారేజీ కుంగుబాటుపై నివేదిక ఇచ్చింది. కుంగుబాటుకు ప్లానింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్‌లోని లోపాలే కారణమని ఎన్డీఎ్‌సఏ నివేదికలో పేర్కొంది.
కాళేశ్వరం అప్పు రూ.87,449.16 కోట్లు
కాళేశ్వరం కోసం (అదనపు టీఎంసీ సహా) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్షియం, బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ల ద్వారా రూ.87,449.16 కోట్ల రుణం మంజూరైంది. ఇందులో రూ.71,565.69 కోట్లు తీసుకున్నారు. ఇంకా రూ.15,698.91 కోట్లు విడుదల కావాల్సి ఉంది. రుణంలో రూ.4,696.33 కోట్ల అసలు తిరిగి చెల్లించారు. ఐదేళ్లలో తెచ్చిన అప్పులకు వడ్డీగా రూ.16,201.94 కోట్లు కట్టాల్సి వచ్చింది. మొత్తం కలిపితే రూ.21,157.87 కోట్లు తిరిగి చెల్లించారు. కాళేశ్వరం కార్పొరేషన్‌లో భాగమైన పాలమూరు-రంగారెడ్డికి రూ.10వేల కోట్ల రుణం మంజూరవగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.7,721.51కోట్లు ఇచ్చింది.
ఇదీ మంత్రుల షెడ్యూల్
శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు మేడిగడ్డకు రానున్నారు. 11.30 గంటలకు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. తర్వాత మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు. 4.20 గంటలకు మేడిగడ్డ నుంచి అన్నారం చేరుకుని బ్యారేజీని పరిశీలిస్తారు.
ప్రాణహిత వ్యయం రూ.11,679.71 కోట్లు
ప్రాణహిత నది నుంచి 160 టీఎంసీలను ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు తరలించి 12 లక్షల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో రూ.17,875 కోట్ల అంచనాతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి 2007 మే 16న అనుమతులు జారీ చేశారు. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో 6.4 లక్షల ఎకరాలకు నీరు అందించడానికి ప్రాజెక్టు అంచనాలను రూ.38,500 కోట్లకు సవరిస్తూ 2008 డిసెంబరు 17న పరిపాలన అనుమతులిచ్చారు. ప్రాజెక్టు విద్యుత్ అవసరాలు 3,466 మెగావాట్లు కాగా, ఏటా 8,701 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం అని అంచనా వేశారు. రీ ఇంజనీరింగ్ తర్వాత ఈ ప్రాజెక్టు పనులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మధ్యలో వదిలేసింది.
కౌంటర్‌కు బీఆర్‌ఎస్ సిద్ధం!
కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను ఎండగట్టడానికి ఒకవైపు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేయగా.. దానికి కౌంటర్ ఇవ్వడానికి బీఆర్‌ఎస్ కూడా మరో పీపీటీ సిద్ధం చేసింది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేనందు వల్లే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించినట్లు వెల్లడిస్తూ పీపీటీ రూపొందించినట్లు సమాచారం. కేంద్ర జలవనరుల సంఘం నివేదికలు కూడా పొందుపరిచి, దీన్ని తయారుచేసినట్లు తెలుస్తోంది. అధికార, విపక్షాలు ఒకే రోజున పీపీటీ ఇచ్చే అవకాశం ఉంది.
Updated Date - Dec 29 , 2023 | 03:42 AM