Mahabubnagar అలంపూర్ BRSలో వర్గపోరు..అందరూ ఎమ్మెల్యేకు వ్యతిరేకమే!
ABN, First Publish Date - 2023-01-16T13:04:04+05:30
అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పరిస్థితి అయోమయంగా మారుతోంది. గత ఎన్నికల్లో సంపత్‌ను ఓడించగలిగే సత్తా ఉన్న ఏకైక నేత అబ్రహం అంటూ..
అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పరిస్థితి అయోమయంగా మారుతోంది. గత ఎన్నికల్లో సంపత్‌ను ఓడించగలిగే సత్తా ఉన్న ఏకైక నేత అబ్రహం అంటూ.. పార్టీలోకి ఆహ్వానించి మరీ టికెట్ ఇచ్చారు. దానికి తగ్గట్లే.. ఓ కీలక నేత శక్తిని మట్టికరిపిస్తూ.. భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. కానీ.. ఇప్పుడు అదే నేత.. బీఆర్ఎస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో.. సీన్ రివర్స్ అవుతోంది. అప్పుడు అబ్రహం గెలిచేందుకు సహకరించిన నేతలే.. ఇప్పుడు ఓడించడమే లక్ష్యంగా జట్టు కడుతుండడం బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకీ.. బీఆర్ఎస్‌లో చేరిన ఆ కీలక నేత ఎవరు?.. అలంపూర్‌లో సీన్ ఎందుకు మారుతోంది?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడర్‌లో తెలుసుకుందాం..
అలంపూర్‌లో రాజకీయమంతా చల్లా కనుసన్నల్లో..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అలంపూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. కొన్నాళ్ల క్రితం బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి హవా అంతాఇంతా కాదు. 2004 వరకు జనరల్ స్థానంగా ఉన్న అలంపూర్‌లో కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ.. పొత్తులో భాగంగా బీఆర్ఎస్‌కు కేటాయించడంతో.. ఇండిపెండెంట్‌గా భారీ మెజారిటీతో గెలిచి సత్తా చాటారు. ఇక.. అప్పటినుంచి ఆయనకు తిరుగులేకుండా పోయింది. అయితే.. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వుడ్‌గా మారింది. దీంతో.. ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఆ తర్వాత.. టికెట్‌ను ముందుగా కాంగ్రెస్ నేత సంపత్‌కుమార్ సాధించగా.. అధిష్టానంతో పోరాడి ఆయన్ను కాదని.. రాజకీయాలకు దూరంగా ఉండే డాక్టర్ అబ్రహంను తీసుకొచ్చి గెలిపించారు. అయితే..అలంపూర్‌లో రాజకీయమంతా చల్లా వెంకట్రామిరెడ్డి కనుసన్నల్లో కొనసాగుతుందని.. అబ్రహం.. కొంతకాలానికే.. వ్యతిరేక గళమెత్తారు. ఆయనకు వ్యతిరేకంగా ముందుకు సాగారు.
అబ్రహం వ్యతిరేక వర్గంలో అవధుల్లేని సంతోషం!
మరోవైపు.. 2009లో చల్లా వెంకట్రామిరెడ్డి.. అబ్రహంను కాదని.. సంపత్‌కుమార్‌కి టికెట్ ఇప్పించి గెలిపించుకున్నారు. అయితే.. అబ్రహం కూడా టీడీపీ నుంచి బరిలో దిగి.. బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించి రెండో స్థానం పొందారు. కానీ.. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ మందా జగన్నాథ్ కొడుకు మందా శ్రీనాథ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. దాంతో బీఆర్ఎస్ అధిష్టానం.. 2018లో అబ్రహంను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చింది. అలాగే.. అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేయించడంతో అబ్రహం భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే.. అలంపూర్‌లో చల్లా వెంకట్రామిరెడ్డి గత నాలుగేళ్లుగా స్తబ్దుగానే ఉంటూ వచ్చారు. ఇటు అబ్రహంకు కూడా తీవ్రస్థాయిలో పార్టీలోని సీనియర్లు, లోకల్ లీడర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. చాలా మంది నేతలు వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. అనూహ్యంగా బీఆర్ఎస్ అధిష్టానం.. చల్లా వెంకట్రామిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం.. ఆయన గులాబీ శ్రేణులతో కలిసిపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో.. అబ్రహం వ్యతిరేక వర్గాల సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి.
గ్రూపు తగాదాలతో సతమతమవుతున్న అలంపూర్
చల్లా బీఆర్ఎస్‌లో చేరిక తర్వాత.. అలంపూర్ నియోజకవర్గంలోని ప్రతీ నేతా కర్నూల్ బాట పడుతున్నారు. కర్నూల్‌లోని చల్లా వెంకట్రామారెడ్డి ఇల్లు ప్రతిరోజూ అలంపూర్ నేతలతో సందడిగా మారుతోంది. వందలాది వాహనాలు అలంపూర్ టూ కర్నూల్ అంటూ సాగుతున్నాయి. అయితే.. ఎమ్మెల్యే అబ్రహంకు చెక్‌పెట్టేందుకే చల్లాను పార్టీలో చేర్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి.. చల్లా చేరికలో మంత్రి నిరంజన్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. పార్టీ బలహీనంగా ఉందనే సర్వే రిపోర్టుల అధారంగా కేసీఆర్ కొన్ని నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే.. గ్రూపు తగాదాలతో సతమతమవుతున్న అలంపూర్‌పై ఫోకస్ పెట్టారు. మొదటి నుంచి అక్కడ పార్టీలో గ్రూపు రాజకీయలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేది ఓ గ్రూపు కాగా.. మాజీ ఎంపీ ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథ్‌ది మరో గ్రూపు .. జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్యది ఇంకొక గ్రూపు. ఐజ తిరుమల్‌రెడ్డి కుమారుడు గౌతమ్.. గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్.. ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్‌ది మరో గ్రూపు.. వడ్డేపల్లి శ్రీనుది ఒక గ్రూపు.. ఇలా ఎవరికివారు ఆధిపత్యం కోసం తహతహలాడి పోతున్నారు.
తనయుడు అజయ్‌కుమార్ మితిమీరిన జోక్యం..
ఇక.. ఎమ్మెల్యే అబ్రహం ఏకపక్ష నిర్ణయాలు.. తనయుడు అజయ్‌కుమార్ మితిమీరిన జోక్యం.. ఇటు పార్టీకి.. అటు కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారుతున్నాయనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే.. చల్లా పార్టీలో చేరడంతో అబ్రహం వ్యతిరేకులంతా ఏకతాటిపైకి వస్తున్నారు. అబ్రహంకు కాకుండా ఎవ్వరికి టికెట్ ఇచ్చినా గెలిపించాలని నిర్ణయించుకుంటున్నారు. కానీ.. ఏకాకిగా మారుతున్న అబ్రహం మాత్రం.. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్‌లందరికీ టికెట్ గ్యారెంటీ అని కేసీఆర్ ఎప్పుడో ప్రకటించేశారని.. దాంతో తానే అభ్యర్థినంటూ చెప్పుకొస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్ని పవర్స్ ఉన్నాయని.. అయినా కొంతమంది.. ఎవరెవరి దగ్గరకో ఎందుకు పోతున్నారని చల్లా వెంకట్రామిరెడ్డి రాజకీయాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.
అదే జరిగితే.. ప్రస్తుత ఎమ్మెల్యేకు చెక్ పడడం ఖాయం
వాస్తవానికి.. చల్లా వెంకట్రామిరెడ్డి.. అలంపూర్‌తోపాటు వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరనే ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్ది భీరం హర్షవర్దన్‌రెడ్డి గెలుపు కోసం చల్లా కృషి చేశారు. ఈ క్రమంలోనే.. చల్లాను పార్టీలోకి చేర్చుకోవడం వల్ల మేలు జరుగుతుందని భావించి.. ఆయనకు హామీలిచ్చి మరీ బీఆర్ఆర్‌లో చేర్చుకున్నారని.. ఆయన ప్రతిపాదించిన అభ్యర్థినే.. వచ్చే ఎన్నికల్లో అలంపూర్‌లో బీఆర్ఎస్ నుంచి బరిలో దించేందుకు అధినేత అంగీకరించినట్టు టాక్ నడుస్తోంది. అదే జరిగితే.. ప్రస్తుత ఎమ్మెల్యేకు చెక్ పడడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే.. నాలుగైదు గ్రూపులుగా ఉన్న అలంపూర్ బీఆర్ఎస్‌లో.. వచ్చే ఎన్నికల్లో.. చల్లా.. ఎవరిని ప్రతిపాదిస్తారోనన్న చర్చ జోరుగా సాగుతోంది. అదే సమయంలో.. మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహంకు మధ్య కూడా ఏ మాత్రం పొసగడం లేదు. అందుకోసమే.. మంత్రి చల్లా ద్వారా ఎత్తువేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా.. అలంపూర్ బీఆర్ఎస్ రాజకీయం వర్గాల దెబ్బతో హీటెక్కిపోతోంది. అయితే.. బలమైన నేతగా పేరుగాంచిన చల్లా వెంకట్రామిరెడ్డి చేరడంతో మరిన్ని ప్రకంపనలు రేగుతున్నాయి. రాబోయే రోజుల్లో అలంపూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూడాలి.
Updated Date - 2023-01-16T13:06:59+05:30 IST