తెలంగాణలో రాచరికపు పాలన
ABN, First Publish Date - 2023-04-09T23:38:24+05:30
గడిచిన తొమ్మిదేళ్లుగా తెలంగా ణలో రాచరికపు పాలన కొనసాగుతోందని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని, అధికారం, డబ్బు అహంకారంతో దాడులు చేయిస్తు న్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.
- ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు
- ఉమ్మడి రాష్ట్రంలోనూ శాసనసభ్యులను అగౌరవపర్చలేదు
- బీసీలు వెనుకబడలేదు వెనుకవేయబడ్డారు
- వనపర్తి బీసీ ఆత్మగౌరవ సభలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
వనపర్తి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): గడిచిన తొమ్మిదేళ్లుగా తెలంగా ణలో రాచరికపు పాలన కొనసాగుతోందని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని, అధికారం, డబ్బు అహంకారంతో దాడులు చేయిస్తు న్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆది వారం నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభకు ఆయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. 85శాతం ఉన్న అణగారిన వర్గాలకు అధి కారం రావాలని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చేయలేదన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో బీసీలు వెనకబడలేదని, పాలకుల వైఖరి వల్ల వెనుక వేయబడ్డారని విమర్శించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కేసీఆర్ కాలరాస్తున్నారని ఆరోపించారు. ఇన్ని సంవత్సరాలు గడిచి నా.. బీసీ కులాలు తమ హక్కులకోసం పోరాడుతున్నారంటే.. వ్యవస్థ అభివృద్ధి చెందినట్లా లేక.. పతనావస్థకు చేరినట్లా అర్థం చేసుకోవా లని సూ చించారు. అన్నింటిలో మెరిట్ ఉన్నట్లే.. పాలకులకు కూడా మెరిట్ ఉండాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా శాసనసభ్యుల ను ఇంతలా అగౌరవపర్చలేదని అన్నారు. యూనివర్సిటీల్లో పిల్లలకు సరైన భోజనం అందడం లేదని, బీసీ బిడ్డలు చదివే పాఠశాలల్లో భోజనం విషతుల్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ బిడ్డగా వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశానని, కానీ ప్ర భుత్వం నాలుగున్నరేళ్లుగా బీసీలకు రుణాలు ఇవ్వకుండా.. బడ్జెట్‌లో పెట్టిన డబ్బులను ఖర్చు చేయకుండా మోసం చేస్తోందని అన్నారు. అధికారులు, పోలీసులు రాజ్యాంగ బద్ధంగా పనిచేయాలని, మంత్రు లు చెబితేనో పనిచేయవద్దని హితవు పలికారు. ఒక్క హుజూరాబాద్ ఎన్నికల్లో తనను ఓడించడానికి రూ. 600 కోట్లు ఖర్చు పెట్టారని, ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఒకప్పుడు ఉప్పిడి ఉపాసం ఉన్నానని చెప్పే కేసీఆర్ ఇప్పుడు దేశంలో ప్రతిపక్ష పార్టీలకు డబ్బులు ఇస్తానని చెప్పేంత డబ్బు ఎక్కడిదని నిలదీశారు. జనాభాలో ఒక్కశాతం ఉన్న వర్గానికి నాలుగు మంత్రి పదవులు ఉన్నాయని, 52శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు ఏ దామాషా ప్రకారం ఇచ్చారని ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీలో సీఎం కూతురు కవిత.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ధర్నా చేశారని, మరీ అయిదేళ్లు కేబినేట్‌లో మహిళా మంత్రి లేకపోవడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని అన్నారు. పేదలకు మూడెకరాల భూమి ఇవ్వకపోగా.. ఎప్పుడో అసైన్డ్ చేసిన భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ గిరి చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టుపక్కల 5,080 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆక్రమించుకుందని ఆరోపించారు. అంతకుముందు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ మాట్లాడుతూ వనపర్తి గడ్డ గతంలో బీసీల అడ్డగా ఉండేదని, మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. బీసీలపై కేసులు పెడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని, రానున్న రోజుల్లో బీసీ సీఎం అయితేనే బతుకులు మారుతాయని తెలిపారు. పోరాటాలను పునికిపుచ్చుకున్న బీసీలు.. కేసులకు, దాడులకు భయపడబోరని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కరీంనగర్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్యయాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. కృష్ణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నారాయణ, రామన్‌గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్, అఖిపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్‌యాదవ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు నందిమల్ల అశోక్ అన్ని బీసీ కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-09T23:38:24+05:30 IST