బాబూజగ్జీవన్‌రామ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం
ABN, First Publish Date - 2023-04-06T00:21:23+05:30
జీవితాంతం దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష సేవలందించిన డాక్టర్ బాబూజగ్జీవన్‌రామ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జడ్పీ చైర్‌పర్సన్ రోజారాధాకృష్ణశర్మ అన్నారు.
దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
జడ్పీ చైర్‌పర్సన్ రోజారాధాకృష్ణశర్మ
మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి
కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 5: జీవితాంతం దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష సేవలందించిన డాక్టర్ బాబూజగ్జీవన్‌రామ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జడ్పీ చైర్‌పర్సన్ రోజారాధాకృష్ణశర్మ అన్నారు. బుధవారం జగ్జీవన్‌రామ్ 116వ జయంతి సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా వద్ద షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జడ్పీ చైర్‌పర్సన్ రోజారాధాకృష్ణశర్మ, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, సీపీ శ్వేత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మంజులరాజనర్సు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ నిరుపేద అణగారినవర్గాల కుటుంబంలో పుట్టి అనేక కష్టాలను ఎదుర్కొని, దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన నేత జగ్జీవన్‌రామ్ అని గుర్తుచేశారు. ఆయనకు అప్పగించిన శాఖలన్నింటిని సమర్థవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ప్రజలందరి శ్రేయస్సును కోరే రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటున్నట్లు, సమైక్య పాలనలో లభించని గుర్తింపు, గౌరవం.. రాష్ట్రంలోని మహనీయులకు తెలంగాణలో లభిస్తుందని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్రాన్ని సంపాదించి, ఉత్తమ పాలనకు బాటలు వేసిన మహనీయులు అన్ని తరాలకు ఆదర్శనీయమని చెప్పారు. విద్య అన్నింటికన్నా ముఖ్యమైనదని, ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చి విస్తృతంగా గురుకుల పాఠశాలలు, అన్ని రకాల కళాశాలలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలు సమీకరించుకున్నామని, ఇక మహనీయుల స్ఫూర్తితో పేదరిక నిర్మూలనకు కృషి చేద్దామన్నారు. కులాలకఅతీతంగా అందరూ చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆశించారు. దళితులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్ సిస్ స్కాలర్షిప్ చాలా ఉపయోగపడుతుందన్నారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ మహనీయులు కులం కోసం కాకుండా దేశం కోసం జీవితం అంకితం ఇచ్చారని, దేశంలోని అందరూ వారు చేసిన త్యాగాలను స్మరించుకోవాలన్నారు. మహాత్మ జ్యోతిబాఫూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ సమాజం కోసం అనేక విప్లవాత్మక కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. ప్రగతి నిరంతర ప్రక్రియని, కులాల మధ్య అంతరాలను తగ్గించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. సహాయం అవసరం ఉన్న వారికి ప్రాధాన్యతనిస్తే మహనీయుల ఆశయం సిద్ధించినట్టేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి గురుకుల విద్యాసంస్థలను పెంచిందని తెలిపారు. మహనీయుల జీవిత చరిత్రను ఎస్సీ అభివృద్ధిశాఖ ద్వారా పుస్తకం రూపంలో ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. దుద్దెడలో ఎస్సీ హాస్టల్‌ను వచ్చే విద్యాసంవత్సరంలో రీ ఓపెన్ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. సీపీ శ్వేత మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించి, దేశ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను అందరం కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌మంజుల, మాజీ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ నాయిని చంద్రం, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కవిత, టీఎన్‌జీవో అధ్యక్షుడు పరమేశ్వర్, దళిత సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు లింగంపల్లి శ్రీనివాస్, దొమ్మాట రవీందర్ సాంస్కృతిక సారథి కళాకారులు, ఎస్సీ అభివృద్ధిశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-06T00:21:23+05:30 IST