గడప గడపకు దశాబ్ది ఉత్సవాలు
ABN, First Publish Date - 2023-05-29T00:15:09+05:30
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత సంబురంగా నిర్వహించాలని, రాష్ట్ర ప్రగతిని అడుగడుగునా ప్రతిబింబించేలా 21 రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్యఆర్యోగశాఖ మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
తొమ్మిదేళ్ల ప్రగతిని పల్లెపల్లెకు తీసుకెళ్లాలి
ప్రజాప్రతినిధులకు ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు సూచన
ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష
మెదక్ అర్బన్, మే 28: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత సంబురంగా నిర్వహించాలని, రాష్ట్ర ప్రగతిని అడుగడుగునా ప్రతిబింబించేలా 21 రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్యఆర్యోగశాఖ మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఆదివారం మెదక్ కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో తొలిసారిగా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి 22వరకు వివిధ శాఖల ద్వారా అమలుపరుస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తెలిసేలా చేపట్టేందుకు ప్రభుత్వం షెడ్యూల్‌ను ప్రకటించిందన్నారు. రాష్ట్రం వస్తే చీకటి అవుతుందని చెప్పిన చోట నేడు విద్యుతు వెలుగులు చిమ్ముతూ తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని గర్వంగా చాటుకుంటూ ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం చేయాలన్నారు. దశాబ్ది ఉత్సవాలు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వం సూచించిన ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జూన్ 2న పతాకావిష్కరణ, దశాబ్ది ఉత్సవ సందేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 21 రోజలు పాటు ఊరూరా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. రైతు వేదికల వద్దా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేయాలన్నారు. ఒక్కో గ్రామానికి అందుతున్న రైతుబంధు, రైతుబీమాతో పాటు పెన్షన్లు, షాదిముబారక్, కల్యాణలక్ష్మి, చెరువులో చేప పిల్లలు వదలడం, గొర్రెల పంపిణీ తదితర అంశాలపై అన్ని వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రజలకు చేరువయ్యేలా
అన్ని శాఖల్లో జరిగిన అభివృద్ధిపై సంబంధింత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు వివరించాలన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కింద మంజూరైన పనుల వివరాలతోపాటు అన్ని రకాల అభివృద్ధి నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. కాగా ఆధునికతతో ఉపాధి కోల్పోయిన కుల వృత్తుల వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం రూ.లక్ష ఇవ్వనుందన్నారు. జూన్ 19న జరిగే తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో గ్రామ గ్రామాన పెద్దఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. మన ఊరు-మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలన్నారు.
24 నుంచి 30 వరకు పోడు భూముల పట్టాల పంపిణీ
జూన్ 24 నుంచి 30వరకు అర్హులైన గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. జూలై మొదటి వారంలో దళితబంధు యూనిట్లు గ్రౌండింగ్, ప్రతీ నియోజకవర్గంలో సొంత స్థలం ఉన్న 3 వేల మందికి రూ.3లక్షల ఆర్థిక సహాయం అందించి ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలన్నారు. కొత్త సభ్యత్వాలు తీసుకున్న మత్స్యకారులకు గుర్తింపు కార్డులు అందించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధిచి అసైన్డ్ ల్యాండ్ వారసత్వ మార్పు చేసి అర్హత పొందేవిధంగా చూడాలని అధికారులకు తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ, మృతి కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని సూచించారు.
సబ్ సెంటర్లకు పక్కా భవనాలు
ఉమ్మడి జిల్లాలో ఒక్క ఆరోగ్య ఉప కేంద్రం అద్దె, శిథిల భవనాల్లో ఉండకుండా అన్ని ప్రతిపాదనలు పంపాలని అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఒక్కో భవనానికి రూ.20 లక్షలతో పక్కా భవనాలను మూడు నెలల్లోనే నిర్మిస్తామని చెప్పారు. మన ఊరు-మన బడి పనుల్లో వేగం పెంచి, విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో 70 శాతం మేర ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని, ఇప్పటి వరకు 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు. సమీక్ష సమావేశంలో మెదక్, సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు హేమలత, రోజాశర్మ, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్సీలు శేరి సుభా్‌షరెడ్డి, యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, సతీ్‌షకుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితాలక్ష్మారెడ్డి, రాష్ట్రచేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్లు రాజర్షిషా, ప్రశాంత్‌జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమాసింగ్, వీరారెడ్డి, సిద్దిపేట సీపీ శ్వేత, సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-29T00:15:09+05:30 IST