చేపల పండుగ.. కమ్మని వేడుక
ABN, First Publish Date - 2023-06-05T00:12:34+05:30
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలతో పాటు మృగశిర కార్తె సందర్భంగా ప్రభుత్వం ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్ 8 నుంచి 10 వరకు సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువు వద్ద ఉన్న నెక్లెస్ రోడ్ ఈ ఫుడ్ ఫెస్టివల్‌కు వేదిక కానుంది. హైదరాబాద్‌కే పరిమితమైన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్ తొలిసారిగా సిద్దిపేట పట్టణంలో నిర్వహించనున్నారు.
8 నుంచి 10 వరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్
కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు వేదికగా నిర్వహణ
చేపలతో పసందైన వంటకాలు
జిల్లాలో ఇదే మొదటి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్..
సిద్దిపేటఅగ్రికల్చర్, జూన్4: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలతో పాటు మృగశిర కార్తె సందర్భంగా ప్రభుత్వం ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్ 8 నుంచి 10 వరకు సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువు వద్ద ఉన్న నెక్లెస్ రోడ్ ఈ ఫుడ్ ఫెస్టివల్‌కు వేదిక కానుంది. హైదరాబాద్‌కే పరిమితమైన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్ తొలిసారిగా సిద్దిపేట పట్టణంలో నిర్వహించనున్నారు.
మత్స్యశాఖకు 7స్టాళ్లను, పశుసంవర్థకశాఖల, డీఆర్డీఏ, విజయ డెయిరీలకు ఒక్కొక్కటిగా 10 వరకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. నోరూరించే చేపల వంటకాలు, సాంప్రదాయక రుచులు, సీ-ఫుడ్, ఎండు చేపలు, రెడీ టూ ఈట్ ఫిష్‌ను అందుబాటులో ఉంచనున్నారు. ఈ వేడుక ద్వారా ప్రజలకు చేపల వంటకాలపై అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యం కోసం ఏఏ చేపల ఆహారం తీసుకోవాలో వివరిస్తారు. చేపల ఉత్పత్తులు, వినియోగంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు.
మహిళా సొసైటీల భాగస్వామ్యం
జిల్లాలో 1,636 చెరువులు ఉండగా, 20,350 మందితో 281 మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీలు ఉన్నాయి. 38 మహిళా సహకార సంఘాలున్నాయి. ఫుడ్ ఫెస్టివల్‌లో ఈ సొసైటీలను భాగస్వామ్యం చేస్తూ వివిధ రకాల వంటకాలు తయారు చేయించనున్నారు. ఈ మేరకు వీరికి శిక్షణ కూడా ఇచ్చారు. నోరూరించే ఫిష్ వంటకాలతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సాంసృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శించనున్నారు.
ఆరోగ్యానికి ఎంతో మేలు
చేపలో కాల్షియం, పాస్పరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి న్యూట్రియన్స్ పుష్కలంగా లభిస్తాయి. రుచిని పెంచే లైసిన్, మిథియోనిన్, ఐసోల్యూసిన్ వంటి అమైనో ఆమ్లాలు దొరుకుతాయి. చేప కొవ్వు సులువుగా అరిగి శక్తినిస్తుంది. చేపల్లో ఉన్న కొవ్వు, ట్రై గ్లిసరైడ్స్ బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి. ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలలోని డీహెచ్‌ఏ (డై హైడ్రాక్సీ అసిటోన్), ఈపీఏ (ఇకోసపెంటనోయిక్ యాసిడ్) వంటివి కంటి చూపును, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. చేపల్లో పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. అందుకే గుండె సంబంధ వ్యాధులు, ఆస్తమా, మధుమేహం ఉన్నవాళ్లని చేపలు తినమని డాక్టర్లు చెబుతుంటారు. చేపలు తింటే పెద్దపేగు మలద్వారా క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. విటమిన్ -1, డీ, ఈ, కే, పాస్పరస్ శరీరానికి అందుతాయి. రక్తంలో హిమగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఎముకలు ధృఢంగా తయారవుతాయి. గర్భిణులు చేపలు తింటే ఇమ్యూనిటీతో పాటు, పిల్లల నాడీ వ్యవస్థ డెవలప్ అవుతుంది. చంటి పిల్లల తల్లులకు పాలు బాగా వస్తాయి.
చేపలతో పసందైన వంటకాలెన్నో
చేపలు అనగానే చేపల ఫ్రై లేదా పులుసు మాత్రమే చేసుకోవచ్చనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు రకరకాల వంటకాలు రుచి చూస్తున్నప్పటికీ ఇంకా తెలియని, కొత్త రుచులు ఇక్కడి స్టాల్స్‌లో ఉంచనున్నారు. ఫిష్ బిర్యానీ, ఫీతల ఫ్రై, ఫిష్ అప్పడాలు, ఫిష్ కట్లేట్, చేపల పులుసు, ప్రాన్స్ ఫ్రై, ఫిష్ రోల్, ఫిష్ సమోసా, ఫిష్ ఫ్రై, ఫిష్ బర్గర్, ఫిష్ పకోడి, స్మోక్డ్ ఫిష్, ప్రాన్స్ పకోడి.. ఇలా ఏకంగా 20 నుంచి 30 రకాల వంటకాలను ప్రదర్శించనున్నారు. అలాగే చేపల రకాలు, ఆరోగ్యంపై కూడా అవగాహన కల్పిస్తారు. చేపలను ఏ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయో వివరిస్తారు. వలలతో చేపలు పట్టే విధానాన్ని కూడా తెలియజేస్తారు.
ఫిష్ ఫుడ్‌ఫెస్ట్‌ను విజయవంతం చేయాలి
- మల్లేశం, జిల్లా మత్స్య శాఖ జిల్లా అధికారి
చేపలతో వివిధ రకాల వంటలు, కలిగే ప్రయోజనాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకే ప్రభుత్వం ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నది. సిద్దిపేట కోమటి చెరువు వద్ద ఉన్న నక్లెస్ రోడ్‌లో ఈ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నాం. వివిధ రకాల చేపలు వంటకాలను రుచి చూపించడంతో పాటు వాటిని పరిచయం చేస్తాం. 10 వరకు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాం. ఫిష్ ఫుడ్ ఫెస్ట్‌ను విజయవంతం చేయాలి.
Updated Date - 2023-06-05T00:12:34+05:30 IST