ఖేడ్‌లో ఢీ అంటే ఢీ
ABN, First Publish Date - 2023-11-17T23:24:47+05:30
దూసుకెళుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

మూడోసారి విజయంపై బీఆర్‌ఎస్ కన్ను
పూర్వవైభవం కోసం పోరాడుతున్న కాంగ్రెస్
గెలుపే లక్ష్యంగా శక్తియుక్తులు ప్రదర్శిస్తున్న బీజేపీ
నారాయణఖేడ్, నవంబరు 17 : కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో విభిన్న సంస్కృతుల మేళవింపుగా నిలుస్తున్న నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ కొనసాగుతున్నది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు చూస్కో అంటే కాస్కో అనేలా తలపడుతున్నాయి. కాషాయ జెండా రెపరెపలాడించేందుకు బీజేపీ శక్తియుక్తులను కూడదీసుకుని కష్టపడుతున్నది. నియోజకవర్గంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారో ఆసక్తి నెలకొన్నది.
పారిశ్రామికంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురైన ప్రాంతం నారాయణఖేడ్. వలసలకు కేరా్‌ఫగా నిలుస్తున్న ఈ ప్రాంతం రాజకీయ చైతన్యంలో మాత్రం ముందుంది. నియోజకవర్గంలో గతంలో న్యాల్‌కల్ మండలంతో పాటు రాయికోడ్ మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలు ఉండేవి. ప్రస్తుతం నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి. విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న నియోజకవర్గంలో ఈసారి 18 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో 2009 వరకు ఒకసారి గెలిచిన అభ్యర్థి వరుసగా రెండోసారి గెలుపొందలేదు. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన కిష్టారెడ్డి 2014లో రెండోసారి వరుసగా ఎన్నికై చరిత్రను తిరగరాశారు. అయితే 2015లో కిష్టారెడ్డి ఆకస్మిక మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్ ఉప పోరులో అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి గెలుపొందగా, 2018 సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్నోసార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలే గెలుస్తున్నా నియోజకవర్గం మంత్రిపదవికి మాత్రం నోచుకోలేదు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి ఎలాగైన గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడం కోసం ఎలాగైన గెలుపొందాలనే లక్ష్యంతో ఆ పార్టీ అభ్యర్థి పట్లోళ్ల సంజీవరెడ్డి పావులు కదుపుతున్నారు. జర్నలిస్టుగా పని చేసి రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనవాడే సంగప్ప కేంద్ర ప్రభుత్వ పథకాలే అస్త్రాలుగా గెలుపు కోసం శ్రమిస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలే దన్నుగా భూపాల్‌రెడ్డి
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన గెలుపునకు దోహదపడుతాయని, ఈసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళుతున్నారు. బీఆర్‌ఎస్ అధినేత ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించడంతో భూపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించడానికి ముందే నియోజకవర్గాన్ని చుట్టివచ్చారు. లక్షా 80 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు బసవేశ్వర ఎత్తిపోతల పథకం చేపట్టడానికి తోడు మిషన్ కాకతీయ ద్వారా జలవనరుల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవలి వరకు ఉప్పునిప్పులా ఉండే భూపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి ఏకతాటిపైకి వచ్చారు. గెలుపే లక్ష్యంగా వారిద్దరూ ముందుకు సాగుతున్నారు.
సంప్రదాయ ఓట్లు.. ప్రభుత్వ వైఫల్యాలపై సంజీవరెడ్డి ఆశలు
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లకు తోడు ప్రభుత్వ వైపల్యాలు తనకు కలిసి వస్తాయని హస్తం అభ్యర్థి సంజీవరెడ్డి భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నారు. సంజీవరెడ్డి తండ్రి దివంగత కిష్టారెడ్డి నాలుగుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, 2015లో ఆకస్మికంగా మృతి చెందారు. అనంతరం 2016లో జరిగిన ఎన్నికల్లో సంజీవరెడ్డి బరిలో నిలిచినా ఓటమి చవిచూశారు. 2018లో బీజేపీ తరఫున బరిలో నిలిచి ఓటమి చెందారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడమే కాకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలోనూ చురుకుగా పాల్గొని విజయవంతం చేశారు. కాంగ్రె్‌సలో రెండు వర్గాలుగా చీలిపోయిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్ షెట్కార్, సంజీవరెడ్డి ఏకతాటిపైకి వచ్చారు. మూడో జాబితాలో సురేష్ షెట్కార్‌కే టికెట్ ఖరారైనప్పటికీ సంజీవరెడ్డి పట్టువీడకపోవడంతో ఆయన ఓ మెట్టుదిగారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా పాతడం కోసం షెట్కార్ తన బీఫారంను త్యాగం చేసి సంజీవరెడ్డికి ఇచ్చి మద్దతు తెలపడంతో పార్టీ శ్రేణుల్లో నూతన జోష్ వచ్చింది.
ప్రశ్నించే గొంతుకు అవకాశమివ్వాలని కోరుతున్న సంగప్ప
ప్రశ్నించే గొంతుకకు ఒకసారి అవకాశం ఇవ్వాని బీజేపీ అభ్యర్థి జనవాడే సంగప్ప కోరుతున్నారు. మారుమూల గ్రామమైన కంగ్టి మండలంలో జన్మించి రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టుగా గుర్తింపు పొందిన సంగప్ప రాజకీయ అడుగులను బీజేపీ పార్టీ నుంచి ప్రారంభించారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టడమే కాకుండా బండి సంజయ్‌కి ప్రధాన అనుచరుడిగా ఉంటూ బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. నియోజకవర్గంలో ప్రభావం చూపే లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సంగప్ప కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. యువ ఓటర్లంతా చాపకింద నీరులా తమకు మద్దతునిస్తారని, దీంతో ఈ ఎన్నికల్లో తాము సత్తా చాటుతామని సంగప్ప ధీమాతో ఉన్నారు.
మొత్తం ఓటర్లు 2,31,188
పురుషులు 1,16,581
మహిళలు 1,14,599
ఇతరులు 8
సామాజిక వర్గాల వారీగా ఓటర్లు
ఓసీలు 15,650
బీసీలు 1,20,450
ఎస్టీలు 34,150
ఎస్సీలు 33,115
మైనార్టీలు 21,190
ఇతరులు 6,633
మహారెడ్డి భూపాల్‌రెడ్డి (బీఆర్‌ఎస్)
అనుకూలతలు
రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం
ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడం
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అండదండలు
సీఎం సహాయనిధి ద్వారా అధిక మందికి ఆర్థిక సహాయం అందజేత
బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన సోదరుడు విజయపాల్‌రెడ్డి మద్దతు
నిరుద్యోగులకు సొంత ఖర్చుతో కోచింగ్ సెంటర్ నిర్వహణ
స్థానిక ప్రజాప్రతినిధులు
ప్రతికూలతలు
ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత
సంక్షేమ పథకాలు అనుకూల వర్గాల వారికే అందాయని ఆరోపణలు
ద్వితీయ శ్రేణి నాయకులు లేకపోవడం
గ్రామాల్లోని పార్టీ క్యాడర్‌లో నెలకొన్న అనైక్యత
బలమైన క్యాడర్ ఉన్న కాంగ్రెస్‌ను ఢీకొనడం
పట్లోళ్ల సంజీవరెడ్డి (కాంగ్రెస్)
అనుకూలతలు
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కిష్టారెడ్డి కుమారుడు
రెండుసార్లు వరుస ఓటమి చెందడంతో సానుభూతి
సొంత ఖర్చుతో జాబ్‌మేళ, వ్యక్తిత్వ వికాస తరగతుల ఏర్పాటు
మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్ సంపూర్ణ మద్దతు
కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లు
ప్రజా సమస్యలపై పోరాటం చేయడం
ప్రతికూలతలు
ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు అధికంగా ఉండడం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం జాప్యం కావడం
ప్రచారానికి సమయం తక్కువగా ఉండడం
సురేష్‌షెట్కార్ అనుచురులు, మద్దతుదారులు ఓటింగ్‌లో ఏమేరకు సహకరిస్తారో
జనవాడే సంగప్ప(బీజేపీ)
అనుకూలతలు
రాజకీయాలకు కొత్త కావడం
లింగాయత్ సామాజికవర్గం నేత
యువ ఓటర్లు అధికంగా నమోదు కావడం
బీసీ సీఎం నినాదంతో బీజేపీ ముందుకు రావడం
జర్నలిస్టుగా పని చేసిన అనుభవం
కేంద్ర ప్రభుత్వ పథకాలు
ప్రతికూలతలు
నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి టికెట్ రాకపోవడంతో బీజేపీకి రాజీనామా చేయడం
నియోజకవర్గంలోని 8 మండలాల పరిఽధుల్లో 227 గ్రామ పంచాయతీలు ఉన్నందున ప్రచారానికి సమయం లేకపోవడం
ద్వితీయ శ్రేణి నాయకత్వం, బీజేపీ నుంచి ప్రజాప్రతినిధులు లేకపోవడం
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లలో బలమైన క్యాడర్ ఉండడం
గ్రామస్థాయి నుంచి పటిష్ఠమైన క్యాడర్ లేకపోవడం
2014లో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లు - 1,58,292
పట్లోళ్ల కిష్టారెడ్డి (కాంగ్రెస్) - 62,347
ఎం.భూపాల్‌రెడ్డి (బీఆర్‌ఎస్) - 47,601
ఎం.విజయపాల్‌రెడ్డి - టీడీపీ - 40,405
కాంగ్రెస్ మెజార్టీ - 14,600
2016లో ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లు 1,54,912
మహారెడ్డి భూపాల్‌రెడ్డి (బీఆర్‌ఎస్) - 93,076
పట్లోళ్ల సంజీవరెడ్డి (కాంగ్రెస్) 39,451
మహారెడ్డి విజయపాల్‌రెడ్డి (టీడీపీ) 14,787
బీఆర్‌ఎస్ మెజార్టీ 53,625
2018లో ఎన్నికల్లో పోలైనోట్లు 1,73,733
మహారెడ్డి భూపాల్‌రెడ్డి (బీఆర్‌ఎస్) 95,550
సురేష్‌కుమార్ షెట్కార్(కాంగ్రెస్) 37,042
పట్లోళ్ల సంజీవరెడ్డి (బీజేపీ) 33,060
బీఆర్‌ఎస్ మెజార్టీ 58,508
Updated Date - 2023-11-17T23:25:18+05:30 IST